సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కుటుంబపాలన సాగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రాజేంద్ర నగర్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకురాగా ఆయన సమాధానిమిచ్చారు.
జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే సులభతరమైన టాక్స్ విధానం కోసం జీఎస్టీ తీసుకొచ్చిందని అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకించారన్నారు. మహిళా అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ది చెందదని కాంగ్రెస్ నమ్ముతుందని, మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు మహిళా భాగస్వామ్యాన్ని మరిచిపోయాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారని, అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ సర్కార్‌లు ఒకేలా ఉన్నాయన్నారు. ఇద్దరు హామీలను పూర్తిగా మరిచిపోయారని మండిపడ్డారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని మోదీ అన్నారని, ఆరోగ్యం, విద్య పేదలకు అందడం లేదని, యూనివర్సిటీలను ప్రయివేట్ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. భేటీ బచావో, భేటీ పడావో అని మోదీ అన్నారని, యూపీలో ఎమ్మెల్యే అత్యాచారం చేసినా.. బీహార్‌లో పిల్లల మీద అత్యాచారం జరిగినా, దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగినా ఆయన నోట మాట రావడం లేదని దుయ్యబట్టారు. నిరుపేదల కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందన్నారు. యూపీఎ హయాంలో రాజస్తాన్‌లో మందులు ఉచితంగా ఇచ్చామని, ఉపాథి హామీ పథకం తీసుకొచ్చామని, ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసామని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చేది మహిళా సంఘాల సర్కార్ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే మహిళల రుణాల మీద వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment