
బీజేపీతో ఉన్నది అభివృద్ధి ఒప్పందమే: కర్నె
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో తమకున్నది అభివృద్ధి ఒప్పందం మాత్రమేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కార్యకర్త స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేదన్నా రు.
రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ముందు ఎన్డీఏ టీఆర్‌ఎస్‌ను సంప్రదించగా, సీఎం కేసీఆర్ సూచన మేరకే దళిత నేతను అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు. గతంలో అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌ను కూడా మోసం చేసిందని, రాజకీయాల కోసం లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను బలి చేయొద్దని హితవు పలికారు.