
ఆయన చరిత్ర అందరికీ తెలుసు...
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రులుగా ఉంటూ గతంలో తెలంగాణ పేరు చెప్పడానికి ఇష్టపడని జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణనలు తమను విమర్శించే హక్కు లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్‌లో తమకు పోటీ ఎవరూ లేరని, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేసిన అవినీతిని అందరూ చేస్తారని అనుకుంటున్నారని కర్నె మండిపడ్డారు. ఆయన చరిత్ర అందరికీ తెలుసంటూ ధ్వజమెత్తారు.
కాగా డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించి.. దళితులను కేసీఆర్ అవమానించారంటూ జైపాల్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం అయినట్లే... తెలంగాణ సీఎం కేసీఆర్కి కూడా వరంగల్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమతమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి గురువారం వరంగల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు