ఓటర్లకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని ఆయన శనివారమిక్కడ అన్నారు. కాగా వరంగల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉప ఎన్నికలో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్... మధ్యాహ్నానికి ఊపందుకుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా పలు కేంద్రాల్లో భారీగా ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారు.
పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యం కావడం మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2014 సాధారణ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ తగ్గడం గమనార్హం. 2014 ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో 75.47 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 15లక్షల 37 వేల మంది ఓటర్లు ఉండగా.... ఈసారి ఓటర్ల సంఖ్య 15లక్షల 9వేలకు తగ్గింది. ఈ నెల 24న ఎనుమాముల మార్కెట్ యార్డులో కౌంటింగ్ జరగనుంది. కాగా పరకాలలో అత్యధికంగా 76.69 శాతం పోలింగ్ నమోదు అయింది.