వరంగల్‌లో ఓటర్ల అనాసక్తి
2014 ఎన్నికలతో పోల్చితే 7 శాతం తగ్గిన పోలింగ్
వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో 69.01 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు పెరిగింది. అయితే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత 69 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2014 సాధారణ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ తగ్గడం గమనార్హం. ఈ లోక్‌సభ పరిధిలోని పర్కాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా ఓట్లు పోలవగా, అత్యల్పంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోలయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా చూస్తే స్టేషన్ ఘన్‌పూర్ (74.55 శాతం), పర్కాల (76.69 శాతం), పాలకుర్తి (76.51 శాతం), వర్ధన్నపేట (74.03 శాతం), భూపాల్‌పల్లి (70.1 శాతం), వరంగల్ తూర్పు (62.21 శాతం), వరంగల్ పశ్చిమ (48.03 శాతం) ఓట్లు పోలయ్యాయి.
2014 సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 75.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 15.37 లక్షల మంది ఓటర్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య కూడా స్వల్పంగా (15.09 లక్షలు) తగ్గింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంది. గత ఎన్నికల్లో ఉన్న ఓటర్ల సంఖ్యకు ప్రస్తుత సంఖ్యకు స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ దాదాపు 7 శాతం మేరకు పోలింగ్ తగ్గడం ఓటర్లు ఈ ఎన్నిక పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3.92 లక్షల భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం పోలింగ్ సరళిని పరిశీలిస్తే విజయం సాధించే అభ్యర్థి మెజారిటీ కూడా భారీ స్థాయిలో ఉండదని చెబుతున్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన ఏడాదిన్నర తర్వాత వచ్చిన ఈ ఉపఎన్నిక టీఆర్‌ఎస్ పరిపాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలు సవాలు చేశాయి.
ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గడం ఫలితంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయా పార్టీల నేతలు విశ్లేషణల్లో పడ్డారు. గత ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య అనూహ్యంగా చివరి నిమిషంలో రంగం నుంచి తప్పుకోవలసిన పరిస్థితి, ఆఖరు రోజున సర్వే సత్యనారాయణ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవడం తెలిసిందే. గత ఎన్నికల్లో మాదిరిగానే మిత్రపక్షమైన టీడీపీ మద్దతుతో ఈసారి కూడా బీజేపీ తన అభ్యర్థిని నిలపగా, వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నల్లా సూర్యప్రకాశ్ రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు స్వతంత్రులు పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.