ప్రతిసారీ ఎన్నికలు జరుగుతాయి..ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసిన వారిలో ఒక్కరు గెలిస్తే, మిగిలిన వారంతా ఓడిపోతారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా జరిగేది ఇదే. కానీ, కొన్ని నియోజకవర్గాల్లోని ప్రజలు ఈ విజేతలు, పరాజితులను నిర్ణయించే క్రమంలో విలక్షణంగా వ్యవహరిస్తుంటారు. అక్కడి పరిస్థితులను బట్టి కొన్ని నియోజకవర్గాల ప్రజలు తమ మూడ్‌ను ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు.
కొన్నిచోట్ల ఒక్కసారి గెలిచిన పార్టీకి మరోమారు పట్టం కట్టరు. మరికొన్ని చోట్ల వరుసగా ఒక్కో పార్టీని గెలిపిస్తుంటారు. అలాంటి విలక్షణ తీర్పునిచ్చే నియోజకవర్గాలు తక్కువేం లేవు. రాష్ట్రంలోని నాలుగో వంతుకుపైగా నియోజకవర్గాల్లో విభిన్న తీర్పులిస్తున్నారు ప్రజలు. ఆ నియోజకవర్గాలేంటి... ఈ ప్రజల ‘మూడ్’ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం.
♦ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎనిమిది ఎన్నికల్లో ఒక్కసారి మినహా ఏడుసార్లు విభిన్న తీర్పునిచ్చారు. ఒకసారి గెలిచిన పార్టీని మళ్లీ అక్కడి ప్రజలు ఆదరించలేదు(2004లో మినహా). 2018లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 2014లో టీఆర్‌ఎస్, 2009లో కాంగ్రెస్ గెలిచాయి. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నప్పుడు 2004లో టీడీపీ, 1999లో టీడీపీ, 1994లో సీపీఐ, 1989లో కాంగ్రెస్, 1985లో సీపీఐ గెలిచాయి. అంటే (2004లో మినహా) ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవని సంప్రదాయం 40 ఏళ్లుగా కొనసాగుతోందన్నమాట.
♦ ఖానాపూర్‌లో ఒక్కసారి మినహా గత ఆరు ఎన్నికల్లో ఏ పార్టీనయినా ప్రజలు వరుసగా రెండుసార్లు గెలిపిస్తున్నారు. 1994, 1999ల్లో టీడీపీ, 2004లో టీఆర్‌ఎస్, 2008, 2009లో మళ్లీ టీడీపీ, 2014, 18 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు.
♦ ఆదిలాబాద్‌లో 1978 నుంచి మూడుసార్లు వరుసగా ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ రెండుసార్లు టీడీపీ గెలిచింది. మరోసారి కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ టీడీపీ గెలిచింది. తాజాగా జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ గెలిచింది.
♦ నిర్మల్‌లో నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు పార్టీలు గెలిచాయి. 2004లో కాంగ్రెస్, 2009లో పీఆర్పీ, 2014లో బీఎస్పీ, 2018లో టీఆర్‌ఎస్ ఇక్కడ గెలుపొందాయి.
♦ ముథోల్‌లో 1983లో కాంగ్రెస్ గెలవగా, ఆ తర్వాత వరుసగా టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ గెలిచాయి. అంటే 40 ఏళ్లుగా ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవలేదు.
♦ ఆర్మూరులో 1983లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ఆ తర్వాత వరుసగా టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ గెలిచాయి. గత రెండు ఎన్నికల్లో మాత్రమే టీఆర్‌ఎస్ వరుసగా గెలిచింది.
♦ జగిత్యాలో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్‌ఎస్ గెలిచాయి.
♦ పెద్దపల్లిలో 1978లో కాంగ్రెస్, 83లో టీడీపీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, 85లో టీడీపీ, 89లో కాంగ్రెస్, 94లో టీడీపీ, 99లో బీజేపీ, 2004లో టీఆర్‌ఎస్, 2009లో టీడీపీ, 2014లో టీఆర్‌ఎస్ గెలిచాయి. ఇలా వరుసగా 45 ఏళ్ల సంప్రదాయానికి గండికొడుతూ 2018లో కూడా టీఆర్‌ఎస్ ఇక్కడ గెలిచింది.
♦ హుజూరాబాద్‌లో1962 నుంచి వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ గెలిస్తే, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు టీడీపీ గెలిచింది. టీఆర్‌ఎస్ ఏర్పాటైన తర్వాత 6సార్లు ఆ పార్టీనే గెలిచింది. గత ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచింది.
♦ శేరిలింగంపల్లి ఏర్పాటైన తర్వాత మూడుసార్లు మూడు పార్టీలను అక్కడిప్రజలు గెలిపించారు. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2018లో టీఆర్‌ఎస్‌లు ఇక్కడి నుంచి గెలిచాయి.
♦ సంగారెడ్డిలో 1989 నుంచి గెలిపించిన పార్టీ మళ్లీ ప్రజలు గెలిపించడం లేదు. 1989లో కాంగ్రెస్, 94లో టీడీపీ, 99లో బీజేపీ, 2004లో టీఆర్‌ఎస్, 09లో కాంగ్రెస్, 14లో టీఆర్‌ఎస్, 18లో కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు గెలిపించారు.
♦ ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ పార్టీనయినా రెండుసార్లు ఆదరిస్తున్నారు. 1994, 99లో టీడీపీ అభ్యర్థులు అక్కడ గెలిస్తే, 2004, 09లో కాంగ్రెస్, 2014, 18లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు.
♦ చేవెళ్లలో 2004లో కాంగ్రెస్, 09లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 8లో టీఆర్‌ఎస్ గెలుపొందాయి.
♦ తాండూరులో 1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో టీఆర్‌ఎస్, 2018లో కాంగ్రెస్ గెలిచాయి. ఐదు ఎన్నికల్లో ఒకసారి గెలిచిన పార్టీని ప్రజలు మరోసారి ఆదరించలేదు.
♦ ముషీరాబాద్‌లో 1989, 94లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఒసారి బీజేపీ, మరోమారు టీఆర్‌ఎస్ గెలిచింది. అక్కడ మళ్లీ రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఒకసారి బీజేపీ, మరోసారి టీఆర్‌ఎస్ గెలిచాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
♦ జూబ్లీహిల్స్ ఏర్పాటయిన తర్వాత మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ విజయం సాధించాయి.
♦ గోషామహల్‌లో ప్రజలు డబుల్ ధమాకా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ 1972, 78లో కాంగ్రెస్ గెలిస్తే, 83, 85లో టీడీపీ గెలిచింది. 94, 99 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 2014, 18 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ, 1989లో మాత్రం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
♦ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు గెలిచాయి. 2004లో టీడీపీ, 09లో కాంగ్రెస్, 14లో టీడీపీ, 18లో టీఆర్‌ఎస్ గెలిచాయి. మరి ఈసారి ఎవరు గెలుస్తారో?
♦ కొడంగల్‌లో కూడా రెండుసార్లు గెలిచే సంప్రదాయం కొనసాగుతోంది. 1994,96లో టీడీపీ, 1999,2004లోకాంగ్రెస్, 2009,14లో టీడీపీ గెలిచాయి. 18లో టీఆర్‌ఎస్ గెలవగా, 23లో ఎవరుగెలుస్తారో వేచి చూడాలి.
♦ మక్తల్‌లో 2005 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే 2009లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 18లో టీఆర్‌ఎస్ గెలిచాయి.
♦ వనపర్తిలో గత నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు గెలిచాయి. ఇక్కడ 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్‌ఎస్ గెలిచాయి.
♦ కల్వకుర్తిలో 1989 నుంచి గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదు. 1989లో కాంగ్రెస్, 94లో ఇండింపెండెంట్, 99లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్‌ఎస్ గెలవడం గమనార్హం.
♦ దేవరకొండలోనూ గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదని గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ 1994లో సీపీఐ గెలిస్తే 99లో కాంగ్రెస్, 2004లో సీపీఐ, 2009లో కాంగ్రెస్, 14లో సీపీఐ, 18లో టీఆర్‌ఎస్ గెలిచాయి.
♦ కోదాడలోనూ గత నాలుగు పర్యాయాలుగా ఓసారి గెలిచిన పార్టీ మరోమారు గెలవడం లేదు. ఇక్కడ 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 18లో టీఆర్‌ఎస్ గెలిచాయి.
♦ తుంగుతుర్తిలో 1989లో కాంగ్రెస్ విజయం సాధించగా, 94లో ఇండిపెండెంట్, 99లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 14లో టీఆర్‌ఎస్ గెలిచాయి. వరుసగా రెండోసారి 2018లో మాత్రమే టీఆర్‌ఎస్ గెలిచింది.
♦ నర్సంపేటలో ఐదు పర్యాయాలుగా గెలిచిన పార్టీ గెలవడంలేదు. 1999లో ఇక్కడ టీడీపీ గెలిస్తే, 2004లో టీఆర్‌ఎస్, 2009లో టీడీపీ, 2014లో ఇండిపెండెంట్, 2018లో టీఆర్‌ఎస్ పార్టీలు గెలుపొందాయి.
♦ పరకాలలో 1989లో బీజేపీ గెలిస్తే, 94లో సీపీఐ, 99లో టీడీపీ, 2004లో టీఆర్‌ఎస్, 09లో కాంగ్రెస్, 12లో టీఆర్‌ఎస్, 14లో టీడీపీ, 18లో టీఆర్‌ఎస్ పార్టీలు గెలిచాయి. గత 8 ఎన్నికల్లోనూ అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మరోమారు గెలవడం లేదు.
♦ ములుగులోనూ నాలుగు పర్యాయాలుగా గెలుపు గుర్రాలు మారుతూనే ఉన్నాయి. 2004లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 09లో టీడీపీ, 14లో టీఆర్‌ఎస్, 18లో కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి.
♦ ఖమ్మం నియోజకవర్గంలో 1994 నుంచి గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదు. ఇక్కడ 1994లో సీపీఐ, 1999లో కాంగ్రెస్, 2004లో సీపీఎం, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్‌ఎస్ గెలిచాయి.
♦ కొత్తగూడెంలోనూ నాలుగు దఫాలుగా విజయం వేర్వేరు పార్టీలను వరిస్తోంది. 2004లో అక్కడ కాంగ్రెస్ గెలిస్తే, 2009లో సీపీఐ, 14లో టీఆర్‌ఎస్, 18లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.
♦ ఇక, అశ్వారావు పేట ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీలు గెలిచాయి. ఇక్కడ 2009లో కాంగ్రెస్, 2014లో వైఎస్సార్‌సీపీ, 2018లో టీడీపీ గెలిచాయి.
♦ నకిరేకల్‌లోనూ నాలుగు దఫాలుగా ఇవే ఫలితాలొస్తున్నాయి. ఇక్కడ 2004లో సీపీఎం గెలిస్తే 2009లో కాంగ్రెస్, 2014లో టీఆర్‌ఎస్, 2018లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి.
♦ డోర్నకల్‌లోనూ ఓటర్లు ప్రతీఎన్నికల్లో తమ తీర్పు మారుస్తున్నారు. 2004లో కాంగ్రెస్‌ను గెలిపించిన అక్కడి ప్రజలు 09లో టీడీపీనీ, 14లో కాంగ్రెస్‌ను, 18లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు.
-మేకల కళ్యాణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment