ప్రగతిశీల శక్తులు ఏకమై..బీజేపీని గద్దె దింపుదాం | CM KCR-CPM-CPI Leaders Says All Unite Get Down BJP 5 State Election | Sakshi
Sakshi News home page

ప్రగతిశీల శక్తులు ఏకమై..బీజేపీని గద్దె దింపుదాం

Published Sun, Jan 9 2022 3:02 AM | Last Updated on Sun, Jan 9 2022 10:55 AM

CM KCR-CPM-CPI Leaders Says All Unite Get Down BJP 5 State Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్పొరేట్‌ శక్తుల చేతిలో పావుగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే నిర్ణయాలతో రైతుల నడ్డి విరుస్తోంది. బీజేపీ విభజన రాజకీయాలు దేశ రాజనీతికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ఈ దుర్మార్గ పాలన అంతం కోసం దేశంలోని ప్రగతిశీల శక్తులు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’’.. శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సీపీఎం, సీపీఐ అగ్రనేతల భేటీల సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయమిది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం సీపీఎం నేతలు, ఆ తర్వాత సీపీఐ నేతలు విడివిడిగా కేసీఆర్‌ను కలిశారు. ఈ క్రమంలో జరిగిన భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 

భవిష్యత్తు కార్యాచరణ అవసరం 
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్రంలో బీజేపీ పాలన తీరు, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ తన అభిప్రాయాలను స్పష్టం చేసినట్టు తెలిసింది. ‘‘బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలి. జాతీయ స్థాయిలో ప్రగతిశీల శక్తులతో పనిచేసిన అనుభవమున్న కమ్యూనిస్టు పార్టీలు ఆ దిశగా చొరవ తీసుకోవాలి. టీఆర్‌ఎస్‌ కూడా ఈ ప్రయత్నాలకు తనవంతు తోడ్పాటు అందిస్తుంది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు జాతీయ స్థాయిలో భారీ సభగానీ, సదస్సుగానీ నిర్వహిస్తే బాగుంటుంది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి లేదా వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా కమ్యూనిస్టు పార్టీలు చొరవ తీసుకోవాలి. బీజేపీ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి..’’అని కేసీఆర్‌ సూచించినట్టు సమాచారం.

కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అభివృద్ధికి సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. తన బాధ్యతను మరిచి ఫెడరల్‌ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రధాని మోదీ పట్ల రైతుల్లో ఉన్న వ్యతిరేకత పంజాబ్‌ పర్యటనలో బయట పడిందని.. ఆయన సభకు జనం లేకపోవడంతో పరువు కాపాడుకునేందుకు భద్రతా కారణాలను సాకుగా చూపుతున్నారని కమ్యూనిస్టు పార్టీల నేతలు పేర్కొన్నట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోనూ సమాజ్‌వాదీ పార్టీ గెలుస్తుందని వారు అభిప్రాయ పడినట్టు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement