మంత్రులకు గులాబీ భవన్ల బాధ్యత! | Trs Party building construction | Sakshi
Sakshi News home page

మంత్రులకు గులాబీ భవన్ల బాధ్యత!

Published Sun, Jul 29 2018 1:38 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

Trs Party building construction

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 29 కొత్త జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భవనాలను నిర్మించే బాధ్యతలను జిల్లాల మంత్రులకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా వ్యవహరిస్తున్నవారే ఆ ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లా కేంద్రాల్లో పార్టీ భవన నిర్మాణం పూర్తి చేయడంపై బాధ్యతలు తీసుకోవాలని పార్టీ అధినేత, ముఖ్యమంతి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలిసింది. 29 జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌కు ఎకరానికి మించకుండా భూమిని కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో స్థలాల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సూచనల మేరకు స్థలాల ఎంపికపై కసరత్తు చేసి, అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లా కేంద్రాల్లో కేటాయించిన భూమిని, ఆ జిల్లా అధికార యంత్రాంగం నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అన్నింటికీ ఒకటే నమూనా
రాష్ట్రంలోని 29 జిల్లాల్లో నిర్మించనున్న గులాబీ భవనాలను అన్నింటికీ ఒకటే నమూనాను రూపొందించనున్నట్టుగా తెలిసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య బాధ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు హాలు తదితరాలు అవసరమైన స్థాయిలో భవనాన్ని నిర్మించనున్నారు.

పూర్తిగా వాస్తు శాస్త్రానికి లోబడి నమూ నాను రూపొందించనున్నారు. వాస్తు ప్రకారం భవనాలకు నమూనాను రూపొందించే బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు సుద్దాల అశోక్‌ తేజకు అప్పగించనున్నారు. జిల్లాల్లో ఎంపిక చేసిన స్థలాలను అశోక్‌తేజ పరిశీలించనున్నారు.  అనంతరం ఎంపిక చేసిన నమూనా ప్రకారం జిల్లా కేంద్రాల్లో భవనాలను నిర్మించనున్నారు. జిల్లా మంత్రులు వీటి నిర్మాణాన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసుకునే బాధ్యత తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు.

అత్యాధునిక సాంకేతికత
ఆయా జిల్లాల్లోని సమగ్ర సమచారం కలిగి ఉండే లా డిజిటల్‌ లైబ్రరీని కొత్త భవనాల్లో ఏర్పాటు చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయంతో అనుసంధానం ఉండేలా ప్రత్యేక వ్యవస్థ కూడా ఉండనుంది. సోషల్‌ మీడియాతోపాటు అత్యాధు నిక సాంకేతిక కూర్పు ఉండనుంది. జిల్లా, మం డల, గ్రామస్థాయి నాయకులకు, కార్యకర్తలకు వేగంగా సమాచారం అందించే వ్యవస్థను ఏర్పా టు చేయనున్నారు. రాజకీయంగా ఎప్పటికప్పు డు అనుసరించే వ్యూహాలను కేడర్‌కు చేరవేసేలా సమాచార వ్యవస్థ ఉండనుంది. జిల్లా స్థాయి విస్తృత సమావేశాలు, జిల్లా కార్యవర్గ సమావేశాలు, నేతల మీడియా సమావేశాల ఏర్పాటుకు అనుగుణంగా భవనాల నిర్మాణం జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement