సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కోసం ప్రజాక్షేత్రంలో సర్వేలు చేస్తూనే టీఆర్‌ఎస్‌లో అంతర్గత అంశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి కేంద్రీకరించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ పరిస్థితితోపాటు అభ్యర్థుల ప్రభావాన్ని, పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. వివిధ సర్వే సంస్థల ద్వారా చేపట్టిన సర్వేలు, పోలీసు నిఘా వర్గాలు, ఇతర మార్గాల ద్వారా నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నారు. పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి అనుకూలంగానే క్షేత్రస్థాయిలో ఓటర్లు ఉన్నట్లు పలు నివేదికలు, సర్వేలు వస్తున్నాయి.
అయితే చాలా నియోజకవర్గాల్లో, అంటే దాదాపుగా రాష్ట్రంలోని మూడొంతుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పార్టీ శ్రేణులు, ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్లు వస్తున్న నివేదికలను సీఎం ప్రత్యేకంగా మదింపు చేస్తున్నారు. దీనికోసం ముందుగా పార్టీలోని పరిస్థితులపై నివేదికలను జిల్లా మంత్రులు, ముఖ్యుల ద్వారా తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయంగా ఉన్న ఎమ్మెల్యేలు, కొంత కష్టపడితే గెలుస్తారనే విశ్వాసమున్న నియోజకవర్గాల్లో ముందుగా దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తే గెలుపు సులభం అవుతుందనే విశ్వాసమున్న నియోజకవర్గాల్లో కొంత కఠినంగా వ్యవహరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దీనికోసం పార్టీ మండలస్థాయి నేతల బలాబలాలు, శక్తి సామర్థ్యాలతోపాటు భవిష్యత్తు యోచనను జిల్లా యంత్రాంగం ద్వారా సేకరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ను ఆశిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను నష్టపరిచే చర్యలకు టీఆర్‌ఎస్ నేతలే దిగుతున్నారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో స్థానికంగా పదవులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న నేతలతో చర్చించి, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతలను జిల్లా నేతలకు అప్పగించనున్నారు.
ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి, స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారితో జిల్లా మంత్రులు, ఇతర ముఖ్యులు చర్చించాలనే యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పించలేని వారికి మరో మార్గంలో రాజకీయంగా స్థానాన్ని కల్పిస్తామని హామీలతో రానున్న ఎన్నికల్లో వారితో ఇబ్బందులు రాకుండా చూడాలని అనుకుంటున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే టికెట్ తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒప్పుకోని నాయకులను, ఇంకా ఏవైనా ఇతర మార్గాల్లో పార్టీకి నష్టం కలిగిస్తారనే అంచనా ఉన్న నాయకులను పార్టీ నుంచి బయటకు పంపించడానికి కూడా వెనుకాడకూడదనే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు.
భూపతిరెడ్డి, డీఎస్‌పై వ్యూహం ఏమిటో...?
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆర్. భూపతిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కె.కవిత, బి.బి.పాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆరు నెలల కిందట లేఖ రాశారు. అలాగే రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాజాగా లేఖ రాశారు. అయితే ఈ రెండు ఫిర్యాదులపైనా సీఎం కేసీఆర్ మనోగతం పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఈ విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment