
వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దయాకర్
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. నిన్నటివరకూ రేసులో ముందు ఉన్న రవికుమార్‌ను ...కుల వివాదం కారణంగా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో దయాకర్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొన్న దయాకర్ ... గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డారు.
పసునూరి దయాకర్ గతంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్‌ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్‌కు టీఆర్‌ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది.