pasunuri DAYAKAR
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్త నేతలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. -
కాంగ్రెస్‌లోకి దానం, పసునూరి!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో సిట్టింగ్ ఎంపీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఈ సందర్భంగా నాగేందర్ తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఇద్దరు నేతలు ఈనెల 18న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని గాందీభవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఅర్జీ వినోద్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు సికింద్రాబాద్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. -
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్?
సాక్షి, వరంగల్: వరంగల్‌లో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లోకి చేరబోతున్నట్లు సమాచారం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ పసునూరి కలిశారు. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో పసునూరి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. -
తారంగ హిట్టవ్వాలి – ఎంపీ దయాకర్
‘‘తారంగ’ ట్రైలర్ చూస్తుంటే బలమైన కథతో దర్శకుడు చక్కగా తీశాడనిపిస్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘సారంగ’ హిట్టయి, పెద్ద సినిమా అవ్వాలి’’ అన్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. కట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి, పూజ నాగేశ్వర్ కీలక పాత్రల్లో సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తారంగ’. శ్రీనివాస రెడ్డి కర్రి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను పసునూరి దయాకర్, గ్లింప్స్‌ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొటీ చేసిన నవీన్ యాదవ్ విడుదల చేశారు. నిర్మాత టి. రామ సత్యనారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు సంపత్ కుమార్, శ్రీనివాస రెడ్డి కర్రి. -
‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్/వరంగల్: కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శారద స్ఫూర్తిదాయకమైన కథనంపై పలువురు ప్రముఖులు స్పందించారు. కష్టపడి పనిచేయాలన్నది శారద ఆదర్శంగా తీసుకున్నారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. తద్వారా యువతకు ఆదర్శంగా నిలిచిచారని కొనియాడారు. శారద కష్టపడేతత్వం చూసి గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. శారద కుంటుంబాన్ని కలుస్తానని ఎంపీ వెల్లడించారు. స్టాఫ్‌వేర్ ఉద్యోగిగా పనిచేసి కూరగాయలు అమ్ముతున్న శారద కథనం తనను ఎంతగానో కదిలించిందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శారద ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వం తరఫున శారద కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఇక సాఫ్ట్వేర్ శారదపై సాక్షి కథనానికి ఉపరాష్ట్రపతి కార్యాలయం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, తెలంగాణ బీజేపీ నాయకులు, పలువురు ఎన్ఆర్ఐలు స్పందించారు. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు పలు ఐటీ సంస్థలు ముందుకొచ్చాయి. (చదవండి: భూ వివాదం : సెల్ టవర్ ఎక్కిన యువకుడు) జీవితం అంటే అదొక్కటే కాదు ఉద్యోగం ఒక్కటే లైఫ్ కాదని యువ సాఫ్ట్వేర్ శారద అన్నారు. నెగటివ్‌గా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సాక్షి టీవీతో మాట్లాడుతూ ఆమె యువతకు సందేశం ఇచ్చారు. ఓడిపోయినా ధైర్యంగా నిలబడి విజయం సాధించవచ్చని తెలిపారు. ఇదిలాఉండగా.. కుటుంబం కోసమే శారద కూరగాయలు అమ్ముతోందని ఆమె తల్లి తెలిపారు. శారదను చదివించేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. చిన్నతనం నుంచి శారద బాగా కష్టపడేదని అన్నారు. వయసు పైబడిన తండ్రికి సాయం చేస్తోందని అన్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాప్ట్వేర్ ఉద్యోగం చేసిన శారద ఇటీవల హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీకి కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యారు. మూడు నెలల పాటు ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అంతలోనే కరోనా వ్యాప్తి మొదలవడం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో సదరు కంపెనీ యాజమన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అయినప్పటికీ ఎలాంటి కుంగుబాటుకు లోనవకుండా ఆమె తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. (కూరగాయలు అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్) -
రెండింటిలో.. అంతా ఓకేనా..!
సాక్షి, వరంగల్ : లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎదురులేదని.. ప్రజల్లో పూర్తిగా సానుకూల వాతావరణం ఉన్నందున మజ్లిస్ పార్టీతో కలిపి రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన ముఖ్యనేతలతోనూ కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ఇటీవల జిల్లాల పర్యటన తర్వాత ఢిల్లీలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని అర్థమవుతోందని.. తప్పక మరోసారి ఆశీర్వదిస్తారని చెప్పారని సమాచారం. ఈ మేరకు విజయం ఖరారైనందున మెజార్టీపైనే కేడర్ దృష్టి పెట్టాలని ఆయన నేతలకు సూచించారు. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల అభ్యర్థులు పసునూరి దయాకర్, మాలోతు కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి దయాకర్‌రావు లోక్‌సభ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండగా.. వరంగల్ స్థానానికి గ్యాదరి బాలమల్లు, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. పసునూరి దయాకర్, మాలోతు కవిత గెలుపు కోసం భారీ సభలు నిర్వహించిన కేసీఆర్... ఎప్పటికప్పుడు వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల తీరుపైనా ఆరా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మార్చి 17 నుంచి శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యేలే కీలకమని ప్రకటించారు. శాసనసభ సెగ్మెంట్ల పరిధిలో ఎమ్మెల్యేలదే పూర్తిగా బాధ్యతని.. మంత్రులు సమన్వయం మాత్రమే చేస్తారని తెలిపారు. శాసనసభ్యులను కాదని మంత్రులు, ఎంపీ అభ్యర్థులు ఏ పని చేయొద్దని కూడా సూచించారు. గతంలో ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ మంత్రి ఎంపీని పొగుడుతుంటే.. అది నచ్చక ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయిన ఘటన చర్చనీయాంశం కాగా, ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని సూచించిన కేసీఆర్... అంతిమంగా పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని స్పష్టం చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వరంగల్ పరిధిలో స్టేషన్‌ఘన్‌పూర్(ఎస్సీ), వర్దన్నపేట(ఎస్సీ), వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, పినపాక, భద్రాచలం ఉన్నాయి. వరంగల్ స్థానం పరిధిలో 16,53,474 మంది, మహబూబాబాద్ పరిధిలో 14,23,351 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తెలంగాణలో రికార్డు స్థాయి మెజార్టీ ఈ రెండు స్థానాల్లో రావాలని అధి నేత కేసీఆర్ పదే పదే సూచిస్తున్నారు. విధేయతే ప్రామాణికంగా గెలిచే అభ్యర్థులను నిలబెడతామని చెప్పి టికెట్లు ప్రకటించిన గులాబీ బాస్... బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారన్న కోణంలో కూడా ఆరా తీస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
నేడో రేపో..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై రాజకీయ పార్టీల కసరత్తు తుది దశకు చేరింది. ఒకటి, రెండు రోజుల్లో బరిలో నిలిచే తమ అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటికి నామినేషన్ వేసే విధంగా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ అన్ని పార్టీల్లో క్లైమాక్స్‌కు చేరింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరంగల్, మహబూబాబాద్ స్థానాల నుంచి ధీటైన అభ్యర్థులనే బరిలో దింపే ప్రయత్నం చేస్తుండగా.. రాష్ట్రంలో నాలుగు స్థానాలను ఎంపిక చేసుకున్న సీపీఐ, సీపీఎం మహబూబాబాద్ నుంచి అభ్యర్థిని పోటీలో దింపనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించాయి. పసునూరి దయాకర్, సీతక్కల పేర్లు ఫైనల్ వరంగల్, మహబూబాబాద్ స్థానాలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కసరత్తు తుది దశకు చేరింది. ఇక అధికారిక ప్రకటనే తరువాయిగా మారింది. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల నుంచి టీఆర్ఎస్కు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పసునూరి దయాకర్, ఆజ్మీరా సీతారాంనాయక్ ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఇందులో దయాకర్‌కు దాదాపు టికెట్ ఖరారైనట్లే. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి శాసనమండలి చైర్మన్‌గా అవకాశం ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సీతారాంనాయక్ విషయంలో అధిష్టానం ఇంకా ఆలోచన చేస్తున్నా.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి, రామచంద్రునాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితలలో ఎవరో ఒకరికి టికెట్ దక్కుతుందని ఖాయంగా చెప్తున్నారు. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే... ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఖాయమంటున్నారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు టీపీసీసీ నుంచి సమాచారం అందుకున్నారు. ఢిల్లీ పెద్దలతోనూ ఆమె మాట్లాడినట్లు అనుచురులు చెప్తున్నారు. ఇదిలా వుంటే అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడంతో మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, పార్టీ సీనియర్ నేత బెల్లయ్యనాయక్ తదితరులు సీరియస్‌గానే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ సీటు కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, సింగాపురం ఇందిర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో అద్దంకి దయాకర్, మంద కృష్ణ, ఇందిర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, ఓంటేరు జయపాల్, సినీనటుడు బాబుమోహన్‌తో పాటు ఏడుగురు వరంగల్ నుంచి ఆ పార్టీ టికెట్ కోరుతున్నారు. మహబూబాబాద్ నుంచి హుస్సేన్‌నాయక్, యాప సీతయ్యలతో పాటు ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సూచన మేరకు, రాష్ట్రపార్టీ ఎన్నికల కమిటీ, కోర్ కమిటీ ఇటీవల సమావేశమై ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహుల పేర్లతో ఈ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థుల ప్రకటన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా పార్టీలు 16, 17 తేదీల్లో అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. టీఆర్ఎస్ తరఫున లోక్‌సభకు పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికలో శాసనసభ్యులు కీలకపాత్ర పోషిస్తున్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా టికెట్ల ఖరారుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజులుగా కసరత్తు చేసి ఫైనల్‌కు వచ్చారు. డీసీసీ, టీపీసీసీ పరిశీలన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ జాబితా మూడు రోజుల కిందటే ఢిల్లీకి చేరింది. ఆ జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తయినట్లు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరు తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ శనివారం జాబితాను పరిశీలించే అవకాశం ఉండగా... అదే రోజు సాయంత్రం గాని, ఆ మరుసటి రోజు గాని ప్రకటించవచ్చంటున్నారు. 18న ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై 25 వరకు సాగనుంది. దీంతో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే నామినేషన్లు వేసేందుకు వీలుగా అధికారిక ప్రకటన చేస్తారని ఆశావహులు భావిస్తున్నారు. -
కొండా దంపతులకు అహంకారం ఎక్కువ
హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: సీఎం కేసీఆర్‌కు అహంకారం అని విమర్శిస్తున్న కొండా దంపతులకే అహంకారం ఎక్కువని, కాళ్లు మొక్కించుకునే సంస్కృతి వారిదేనని వరంగల్ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. హన్మకొండలోని అశోకా హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పసునూరి దయాకర్ మాట్లాడుతూ ఉద్యమకారుల ఇంటికి వెళ్లలేదని విమర్శించడంలో అర్థం లేదన్నారు. తనతోపాటు ఎంతో మంది ఉద్యమకారుల ఇంటికి కేసీఆర్ నేరుగా వచ్చారన్నారు. బీసీ మహిళ అని చేరదీసి పార్టీలోకి తీసుకుంటే ఏనాడు ఉద్యమకారులను, పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఉద్య మం మొదలు పెడితే కీటీఆర్, కవిత భాగస్వాములయ్యారని, లాఠీ దెబ్బలు తిన్నారని, జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. జయశంకర్ సార్‌కు ప్రభుత్వం ఎంతో గుర్తింపు ఇచ్చిందన్నారు. రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం : తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ కొండా మురళీధర్‌రావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ సవాల్ విసిరారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతులు తన అల్లుడు మర్రి జనార్దన్ పటేల్‌ను తన వద్దకు పంపి టీఆర్ఎస్లో చేరేందుకు మధ్యవర్తిత్వం నెరిపారన్నారు. తాను వారిని కేటీఆర్ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డికి ఇంటికి తీసుకెళ్లి పార్టీలో చేరే అంశంపై కేటీఆర్, తాను చర్చించామన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ను తాను, కేటీఆర్ కలిసి పార్టీలో చేర్చుకునేలా ఒప్పించామని, ప్రవర్తన మార్చుకోవాలని కేసీఆర్ సూచించగా అంగీకరించారన్నారు. గతంలో ఉద్యమకారులపై చేసిన దౌర్జన్యాలను కేసీఆర్ పెద్ద మనస్సుతో తుడిచివేశారన్నారు. ఎమ్మెల్సీ కొండా మురళీ రాజీనామా చేసి స్వతంత్రంగానైనా లేదంటే తనను ఆహ్వానించారని చెబుతున్న 15 పార్టీల్లో దేని నుంచైనా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలువాలని సవాల్ విసిరారు. కాంట్రాక్టర్లు, అధికారులను బెదిరించే డెన్ మీ ఇల్లు, గెస్ట్ హౌస్ అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్‌కు గుర్తింపు ఇవ్వలేదని అనడంలో వాస్తవం లేదన్నారు. ఆయన పుట్టిన రోజను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండా దంపతుల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే ముగ్గురు స్వతంత్రంగా పోటీ చేసి గెలువాలన్నారు. సమావేశంలో వరంగల్ అర్బన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆజీజ్ఖాన్, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
కొండా మురళికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్
సాక్షి, వరంగల్ అర్బన్ : కేసీఆర్ సర్వేలో అనుకూల ఫలితాలు రానందునే టీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖకి టికెట్ నిరాకరించిందని వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రాజకీయంగా బీభత్సమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటున్న కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. మురళి ఏకగ్రీవంగా ఎన్నికైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయంలో ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడిన కొండా దంపతులు ప్రజలు, కార్యకర్తలు, మైనారిటీలను దూరం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. వారి భూ కబ్జాలకు హన్మకొండలోని రామ్‌నగర్‌లో ఉన్న భవనమే సాక్షి అని విజయ్‌భాస్కర్ ఆరోపించారు. ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేదు కనుకనే రాష్ట్రంలో లేని పార్టీలు పిలిచాయని చెప్పుకుంటున్నారని అన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ అత్యన్నత పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. అవినీతి చరిత్ర కలిగిన కొండా దంపతులు ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మీవెంట ఒక్క కార్పొరేటర్ అయినా ఉన్నాడా..! అధికారం ఉన్నంతకాలం పార్టీని వాడుకుని ఇవాళ కేసీఆర్, కేటీఆర్ పట్ల కొండా దంపతులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎంపీ పసునూరి దయాకర్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని ఏ ఒక్క కార్పొరేటర్ కూడా కొండా దంపతులకు తోడుగా లేరంటేనే వారి నైజం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌పై కూడా వారు విమర్శలు చేయడం దారుణమన్నారు. తమ సమస్యలు తీర్చాలని ఇంటికొచ్చిన ప్రజలతో కాళ్లు మొక్కించుకునే నియంతృత్వం కొండా దంపతులదని దయాకర్ నిప్పులు చెరిగారు. కాగా.. అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. -
అందుకే కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు
సాక్షి, వరంగల్/హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మీడియా ముఖంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ జిల్లా నేతలు స్పందించారు. వరంగల్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొండా దంపతులు రాజకీయంగా సమాధి అవుతున్న సందర్భంలో తనే స్వయంగా కేటీఆర్‌తో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. ఉద్యమ సమయంలో వారిపై రాళ్ల వర్షం కురిపించినా.. కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని చెప్పారు. పార్టీపై నమ్మకం లేకుంటే కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. భూపాలపల్లి, పరకాల ప్రాంతాల్లో పర్యటించి పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ముందు నుంచే కాంగ్రెస్‌కు వెళ్లాలని చూసారని, దమ్ము ఉంటే బహిరంగంగా వెళ్లాలని సవాల్ విసిరారు. సర్వే ప్రకారమే తమ అధినేత కేసీఆర్ టికెట్లు ఇచ్చారని, కొండా దంపుతుల చీకటి వ్యవహారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడుతామన్నారు. అవకాశవాద రాజకీయ నాయకులకు పార్టీలో స్థానం లేదన్నారు. ప్రజలకు అందుబాటులోలేకపోవడంతోనే.. కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలనే ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఉద్యమ కారులను పక్కకు పెట్టి కొండా సురేఖకు టికెట్ ఇచ్చి గెలిపించామన్నారు. అలాంటిది ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వారు కార్పోరేటర్లను బెదిరిస్తున్నారని టికెట్ ఇవ్వకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్నారు. కొండా సురేఖకు టికెట్ రాకపోవడంలో తన ప్రమేయం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ ఒక్కడే నాయకుడు... వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు చేసింది కొండా దంపతులేనని టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ గుండు సుధారాణి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీలో నేతలు గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారంటూ కొండా దంపతులు పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారి ఆరోపణలపై స్పందించిన సుధారాణి కొండా వ్యాఖ్యాలపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీపై వారి వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. బీసీ నాయకుల మధ్య కొండా దంపతులు చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో గ్రూపులు లేవని.. కేసీఆర్ ఒక్కడే నాయకుడని తేల్చిచెప్పారు. -
ఎంపీ X ఎమ్మెల్యే
సాక్షిప్రతినిధి, వరంగల్: అధికార పార్టీలోని కీలక ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మధ్య వర్గపోరు తాజాగా వెలుగుచూసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షిగా చోటుచేసుకున్న పొరపాటు అధికార పార్టీలో కొత్త సమస్యలకు కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పశువైద్య కాలేజీని వరంగల్ ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మామునూరులో ఈ కాలేజీని ఏర్పాటు చేయాలని పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు మామునూరులో కాలేజీ భవన సముదాయం నిర్మాణానికి సోమవారం ముహూర్తంగా నిర్ణయించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సభ జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీనికి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు చందూలాల్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్ ఫొటోలు ముద్రించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ పసునూరి దయాకర్ ఫొటో ముద్రించలేదు. శంకుస్థాపన కార్యక్రమం మొదలుకావడానికి ముందే ఎంపీ దయాకర్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కడియం శ్రీహరి, మంత్రి తలసాని కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే ఎంపీ దయాకర్ వెనుతిరిగి వెళ్లిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ పసునూరి దయాకర్ అసంతృప్తి విషయం తెలియడంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వేదిక వద్దకు రాలేదు. భూమి పూజ ముగిసిన అనంతరం శిలాఫలకం ఆవిష్కరించి అక్కడి నుంచి ఇతర కార్యక్రమాలకు వెళ్లిపోయారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కడియం శ్రీహరి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మామునూరు కార్యక్రమంలోనే ఉండాలి. భవన నిర్మాణ శంకుస్థాపనతోపాటు గొర్రెల పంపిణీ, గొర్రెల పెంపకందార్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ.. డిప్యూటీ సీఎం కేవలం శంకుస్థాపన కార్యక్రమానికే పరిమితమయ్యారు. ఎంపీ దయాకర్ పేరులేని ఫ్లెక్లీ అంతర్గత విభేదాలు..? వెటర్నిటీ కాలేజీ నిర్మిస్తున్న మామునూరు... వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రమేశ్ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. పసునూరి దయాకర్ 2013 వరకు వర్ధన్నపేట టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. అనంతరం అరూరి రమేశ్ చేరికతో టీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు వర్ధన్నపేట ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. సాధారణ ఎన్నికల్లో రమేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో దయాకర్ ఎంపీగా గెలిచారు. ఇద్దరు ముఖ్యమైన పదవుల్లో ఉన్నా.. పాత విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజా అధికార కార్యక్రమంలో ఇది బయటపడింది. తప్పు ఎవరిది.. వెటర్నిటీ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ముద్రణకు బాధ్యులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. అధికారులు ముద్రిస్తే అనుమతి ఇచ్చిన వారు ఎవరనేది తేలాల్సి ఉందని పలువురు ప్రజాప్రతినిధులు అంటున్నారు. మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఫొటో పెట్టిన వారు స్థానిక ఎంపీ ఫొటోను ముద్రించకపోవడం ఏమిటని పసునూరి వర్గం ప్రశ్నిస్తోంది. ఫ్లెక్సీలో సంబంధంలేని వ్యక్తుల ఫొటోలు ఉన్నాయి. వరంగల్ మేయర్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ కొండా మురళి, బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫొటోలూ లేవు. ఉప ముఖ్యమంత్రి ఆమోదం తీసుకున్న తర్వాతే అధికారులు ఫ్లెక్సీ ముద్రిస్తారని... ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని పసునూరి వర్గీయులు అనుమానిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్గం భవిష్యత్ రాజకీయ ఆలోచనలతోనే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీ వర్గం భావిస్తోంది. శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కడియం, తలసాని -
కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదనే విమర్శలు
► అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నేతలు ► ఎంపీలు ప్రొఫెసర్ సీతారాంనాయక్, పసునూరి దయాకర్ ► పాచికగా కోదండరాంను వాడుకుంటున్న కాంగ్రెస్ ► టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు హన్మకొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎక్కడ తమకు భవిష్యత్ ఉండదేమోననే భయంతో కాంగ్రెస్ నాయకులు ఆయనపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఎంపీలు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, పసునూరి దయాకర్ విరుచుకుపడ్డారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేం దుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తెలంగాణకు రావాల్సిన వాటా నీరు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోర్టుకు వెళితే, ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డుపడుతూ కాంగ్రెస్ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో వారిలో వారికే సఖ్యత లేదని, ఆ పార్టీలోని నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. గిరిజన నియోజకవర్గానికి ఏనాడైనా వెళ్లారా, ప్రత్యేక నిధులేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలో అర్థం లేదన్నారు. రాజకీయ బలం లేని కాంగ్రెస్ రాజకీయంగా బలం లేని కాంగ్రెస్ తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పాచికగా వాడుకుంటుందని టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమ నేతగా కేసీఆర్ ఎక్కని మెట్టు లేదని, కలువని పార్టీ, నాయకుడు లేడన్నారు. తెలంగాణలో దేశంలోనే అభివృద్ధిలో ముందు నిలి పేందుకు సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారన్నారు. మూడేళ్ళ పాలన చూసి జాతి గర్విస్తుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నయిముద్దీన్, జోరిక రమేశ్, కమరున్నీసాబేగం, కోల జనార్ధన్, పులి సారంగపాణి, కత్తరపల్లి దామోదర్, పద్మ, శ్రీజా నాయక్, పోగు ల రమేశ్, నాగపురి రాజేష్ పాల్గొన్నారు. -
లఘుచిత్రాలు.. సందేశాత్మక వృత్తాలు
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ముగిసిన షార్టఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు {పేక్షకులతో కిక్కిరిసిన కేయూ ఆడిటోరియం పోచమ్మ మైదాన్ : పదిహేను నిమిషాల నిడివితో తీసే లఘుచిత్రాలు.. మంచి సందేశాన్ని ఇచ్చే ఇతివృత్తాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. షార్టఫిల్మ్లు సమాజానికి ఎంతో దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు ఆదివారం ఘనం గా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ దయాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒక సినిమా చూసేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని, అదే యూ ట్యూబ్‌లో చాలా షార్ట్‌ఫిల్మ్‌లు చూడవచ్చని తెలిపారు. షార్టఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఐశ్వర్యాన్నిచ్చింది : విజయేంద్రప్రసాద్ బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడు తూ పశ్చిమ గోదావరి జిల్లాలో తాను పుట్టినప్పటికీ బతకడానికి హైదరాబాద్‌కు వచ్చానని.. ఈ ప్రాంతం తనకు ఐశ్వర్యాన్నిచ్చిందని చెప్పారు. ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ మహేంద్ర మాట్లాడుతూ 100కు పైగా వచ్చిన లఘుచిత్రాల్లో ఐదింటిని ఎంపిక చేయడం క ష్టంగా మారిందన్నారు. అంతర్జాతీయ లఘుచిత్రోత్సవంలో ప్రదర్శించిన ఫిల్మ్‌లలో విషయం బాగుంద ని... టెక్నికల్ పరంగా కొంత వెనక ంజలో ఉన్నాయన్నారు. కాగా, ముగింపు వేడుకలకు హాజరైన సినిమాహాల్ హీరో రాహుల్‌తోపాటు చిత్ర బృందం సందడి చేసింది. ఇదిలా ఉండగా, వేడుకల్లో రాధిక యాంకరిం గ్ ఆకట్టుకుంది. అంతర్జాతీయ లఘు చిత్రోత్సవ కమి టీ చైర్మన్ నాగేశ్వర్రావు, దర్శకుడు ప్రభాకర్ జైనీ, జ్యూరీ మెంబర్లు కేవీపీ మహేంద్ర, వాల్మీకి వడ్డేమాని, సైదా, కేఎల్.ప్రసాద్, పూర్ణచందర్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఆట పాట ముగింపు వేడుకల్లో భాగంగా సాయంత్రం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రముఖ సినీ నేపథ్యగాయని కౌసల్య పాడిన ‘రామా రామా రామా నీలిమేఘ శ్యామ’, ‘గుమ్ గుమారే గుమ్గుమ్గుమ్’ పాటలు, చరణ్ డ్యాన్స్ గ్రూప్ చేపట్టిన నృత్యా లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కందిరీగ సినిమా హీరోయిన్ అక్ష మాట్లాడుతూ షార్ట్ఫిల్మ్లకు మంచి భవిష్యత్ ఉందన్నారు. అవార్డు విన్నర్స్ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో మూడు రోజుల్లో మొత్తం 118 లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో ఉత్తమ లఘుచి త్రంగా సీతావలోకనం, ఉత్తమ దర్శకుడిగా సీతావనలోకం లఘుచిత్రం డెరైక్టర్ వేణుమాదాల, ఉత్తమ మేల్ ఆర్టిస్టుగా చిచోర ఫిల్మ్ నటుడు ఆర్.సుమన్, ఉత్తమ ఫీమేల్ ఆర్టిస్టుగా అమ్మానాన్నకు ప్రేమతో లఘుచిత్రం నటి దివ్య, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ కొలంబస్ లఘుచిత్రం నటుడు గోపి, ఉత్తమ అంతర్జాతీయ చి త్రంగా చైనీస్ చిత్రం బస్ 44, స్పెషల్ జ్యూరీ-1 అవార్డును సీతారామరాజు లఘుచిత్రం నటుడు కరుణాకర్, స్పెషల్ జ్యూరీ-2 అవార్డును చదువు లఘుచిత్రం నటుడు లాలు గెలుచుకున్నారు. రెడ్డి కాదు మాదిగ... స్టేజీపైకి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌ను ఆహ్వానిస్తున్న సమయంలో యాంకర్ ఆయనను ‘దయాకర్‌రెడ్డి’ అంటూ సంబోధించారు. దీంతో కార్య క్రమానికి హాజరైన ప్రేక్షకులు దయాకర్‌రెడ్డి కాదు.. దయాకర్మాదిగ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు యాంకర్ సరిదిద్దుకొని దయాకర్ అని పిలు స్తూ ఆహ్వానించింది. -
పార్లమెంట్లో అడుగుపెడతానని ఊహించలేదు
కేసీఆర్ దీవెనలతోనే ఎంపీ అయ్యాను 2001 నుంచి టీఆర్ఎస్లో.. రాజకీయంగా ఎదగాలనే ఉద్యోగం వదులుకున్నా ‘మాదిగ దండోరా’లో కీలకంగా పనిచేశా తెలంగాణ తల్లి విగ్రహాల తయారీ సంతృప్తినిచ్చింది ఓపికతో ఉండడంతోనే పెద్ద పదవి దక్కింది వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పసునూరి దయాకర్.. మొన్నటి వరకు సామాన్య కార్యకర్త. ఇప్పుడు.. ఎంపీ. ఆయన గెలుపు ఒక సంచలనం. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. బొమ్మలు వేసే కళాకారుడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం పార్లమెంట్ వరకు చేరుకుంది. ఎందరో మహనీయులు అడుగు పెట్టిన అత్యున్నత చట్టసభకు తాను వెళ్తానని అనుకోలేదని, అది.. కేసీఆర్ ఆశీస్సులతో సాధ్యమైందని, ఓపికతో వేచిచూడడంతోనే పెద్ద పదవి దక్కిందని చెబుతున్న పసునూరి దయాకర్ జీవిత విశేషాలపై ‘సాక్షి’ పర్సనల్ టచ్. వరంగల్ సంగెం మండలం బొల్లికుంట మా సొంతూరు. నాన్న ప్రకాశం, అమ్మ కమలమ్మ. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు. అందరికంటే నేనే చిన్నోడిని. మొదటి నుంచి ఆర్థిక ఇబ్బందులు లేవు. మా తాత వాళ్ల నాన్నకు 80 ఎకరాలు ఉం డేవి. మా తాతలు ఇద్దరికి 40 ఎకరాల చొప్పున వచ్చాయి. మా నాన్న రేషన్ డీలరు. 15 ఎకరాల్లో వ్యవసాయం చేసేవారు. మాకు పాలేర్లు ఉండేవారు. సంప్రదాయ పెళ్లి చేసుకోవాలనుకునేవాడిని. 1995లో నా పెళ్లి అలాగే జరిగింది. భార్య జయవాణి. మాకు ఇద్దరు కుమారులు... రోణి భరత్, ప్రతీమ్భరత్. అమ్మానాన్న ఇప్పుడు లేరు. నాన్నే స్ఫూర్తి... సమాజంలో గౌరవంతో బతకాలనే తపన మా నాన్నతోనే వచ్చింది. ఆయన ఎంతో నిజాయితీగా బతికారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పు చేయొద్దని, ఓపికతో ఉండడం ఆయన ద్వారానే వచ్చింది. నాన్న రేషన్ డీలర్ కాగా, ఏ రోజు సరుకులు ఇవ్వకుండా ఎవరికీ నష్టం చేయలేదు. రేషన్ సరుకులను బ్లాక్‌లో విక్రయించడం ఎప్పుడూ చేయలేదు. ఓపిక, ఆలోచనలో మా నాన్న గొప్పగా అనిపించేవారు. ఏ రోజు మా నాన్న... నన్ను ఒక్క దెబ్బ కొట్టలేదు. డబ్బు సంపాదన విషయంలోనూ మా నాన్న ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. నేను ఎప్పడూ డబ్బు సంపాదన లక్ష్యంగా పని చేయలేదు. నాకు ఉన్న కళతో ఖర్చులు, అవసరాల సరిపడా డబ్బులు వచ్చేవి. పెళ్లయ్యాక కొంచెం ఇబ్బంది అనిపించినా గ్యాస్ డీలర్‌షిప్‌తో అవి తొలిగాయి. చదువు కంటే ఆర్ట్‌పైనే దృష్టి... ఆర్ట్ అంటే నాకు మొదటి నుంచి చెప్పలేనంత ఇష్టం. చదువు మీద కంటే ఆర్ట్‌పైనే దృష్టి ఉండేది. బొల్లికుంటలో పదో తరగతి వరకు చదివా. మా చిన్నాన్న ప్రసంగి వ్యవసాయ అధికారిగా పని చేసేవారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆయన దగ్గర ఉండి ఇంటర్మీడియట్ పూర్తి చేశా. తర్వాత హైదరా బాద్‌కు వెళ్లి డ్రాయింట్ టీచర్‌గా శిక్షణ పొందా. జేఎన్ టీయూలో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్ఏ) ఎంట్రన్స్ రాస్తే సీటు వచ్చింది. శిక్షణ కాలంలో బాగా గుర్తింపు లభిం చింది. బీఎఫ్ఏ పూర్తయ్యాక ఓ ప్రైవేటు సంస్థలో పని చేశా. అంతర్జాతీయ స్థాయి కళాకారులుగా అక్కడికి వచ్చి పనిచేసే వారి కంటే నేను వేగంగా బొమ్మలు చేసేవాడిని. కొన్ని కా రణాలతో అక్కడి పద్ధతి నచ్చలేదు. హైదరాబాద్‌లో హడావుడి జీవితం కంటే వరంగల్‌లో ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నా. రెట్టింపు జీతం ఇస్తానని చెప్పినా వరం గల్కే వచ్చేశా. గోవిందరాజులగుట్ట వద్ద రోణి ఫొటో స్టూడి యో పెట్టా. కొసినా ఫొటో కెమెరా, ఎం7 వీడియో కెమెరా ఉండేవి. స్టూడియో ద్వారా ఖర్చులకు సరిపడా డబ్బులు వచ్చేవి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు సోనియగాంధీ ఆత్మకూరుకు వచ్చినప్పుడు నేను గీసిన రాజీవ్‌గాంధీ చిత్రపటాన్ని ఎమ్మెల్యే సురేఖ ఆమెకు ఇచ్చారు. సోనియాగాంధీ ఎంతో ఇష్టంతో దాన్ని హెలీకాప్టర్‌లో ఢిల్లీకి తీసుకెళ్లారు. అప్పుడు నా పెయింటింగ్స్‌కు బాగా గుర్తింపు ఉండేది. ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం... స్టూడియో నడుపుతూనే మాదిగ దండోరా వరంగల్ నగర అధ్యక్షుడిగా ఉద్యమంలో కీలకంగా పని చేశా. పొద్దున్నే లేచి వెళ్లి మండలాల్లో కమిటీలు వేసేవాడిని. బీడీలను ఇంకులో ముంచి వాల్‌పోస్టర్లు రాసేవాడిని. అప్పుడే ఎస్సీల వర్గీకరణ జరిగింది. ఈ కేటగిరీలో ఒక ఫైర్ ఆఫీసర్ పోస్టుకు నోటిఫికేషన్ పడింది. అది నాకే వచ్చింది. అరుుతే, రాజకీయంగా గుర్తింపు పొందాలనే ఆలోచన ఉండగా ఉద్యోగాన్ని వదులుకున్నా. అదే సమయంలో వర్ధన్నపేటలో గ్యాస్ డీలర్షిప్ వచ్చింది. రాజకీయాల్లో ఒక పెద్ద నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉండాలని అనుకునేవాడిని. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయం నుంచి పని చేశా. కరీంనగర్ బహిరంగసభకు ముందు డాక్టర్ సుధీర్ టీఆర్ఎస్ వైస్ చైర్మన్‌గా ఉండేవారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఆయన చెప్పారు. టీఆర్ఎస్ మీటింగ్‌కు రావాలని సూచించడంతో అక్కడి వెళ్లగా... టీఆర్ఎస్లో నా పయనం మొదలైంది. టీఆర్ఎస్తో గుర్తింపు... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... తొలి రోజుల్లోనే నన్ను పేరుపెట్టి పిలిచేవారు. మొదటి కమిటీలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఆ తర్వాత పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించా. నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట ఎస్సీ కేటగిరీకి రిజర్వు అరుుంది. కేటీఆర్ అన్న ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని పిలిస్తే వెళ్లాను. కేసీఆర్ నన్ను నియోజకవర్గ ఇంచార్జీగా నియమించారు. 2009 సాధారణ ఎన్నికలో మహాకూటమి పొత్తులో మాజీ మంత్రి విజయరామారావుకు అసెంబ్లీ సీటు ఇవ్వాల్సి వచ్చింది. కేసీఆర్ సార్ మా అందరితో చర్చించి విజయరామారావుకు వర్ధన్నపేట టిక్కెట్ ఇచ్చారు. పార్టీకి ఏది మంచిదైతే అలాగే చేయాలని చెప్పా. అప్పుడు కేసీఆర్ సార్ ఎంతో అభినందించారు. 2009 ఎన్నికల తర్వాత పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉండె. అప్పుడూ వర్ధన్నపేట ఇంచార్జీగా వ్యవహరించా. నా స్థాయిలో పార్టీ కార్యక్రమాలన్నీ విజయవంతం చేశా. 12 చోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు నెలకొల్పా. 2013లో ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్నా. నాకు టీఆర్ఎస్తోనే గుర్తింపు వచ్చింది. కేసీఆర్ సార్ వద్ద నాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. రెండేళ్లు ఓపికతో ఉన్నా. ఇప్పుడు పెద్ద అవకాశం ఇచ్చారు. కష్టం తెలిసిన వాడిని... వరంగల్ ఉప ఎన్నిక ప్రత్యేక సందర్భంలో వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలకమైన ఎన్నిక. ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నికలో కేసీఆర్ నాకు టిక్కెట్ ఇచ్చారు. ఉద్యమ నేత కేసీఆర్, ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి పనులే ఘన విజయాన్ని తెచ్చి పెట్టాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన నన్ను ప్రజలు ఆదరించారు. సాధారణ కార్యకర్తగా ఉన్న నేను కేసీఆర్ దీవెనలతోనే ఎంపీగా ఎన్నికయ్యాను. ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో మొదటిసారి అడుగుపెట్టినప్పటి అనుభవం మరిచిపోలేను. ప్రధానమంత్రి మోడీ, దేశంలోని గొప్ప నేతలు ఉన్న ప్రదేశంలోకి వెళ్లగానే కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. గతంలో పార్లమెంట్‌ను దూరంగానే చూశా. అందులో అడుగు పెడతానని ఎప్పుడూ ఊహించలేదు. కేసీఆర్ దీవెనలతో ఈ అవకాశం వచ్చింది. అరుుతే, ఎంపీగా గెలిచినా మూలాలు మరిచిపోను. కష్టమంటే తెలిసిన వాడిని. ఎప్పటికీ ఇలాగే ఉంటాను. వరంగల్ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా. రూపకర్త కేసీఆర్... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసవరాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు భావజాల వ్యాప్తి కీలకమని కేసీఆర్ చెప్పేవారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిచాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలనే విషయమై చాలా మంది మేధావులు, ముఖ్యులతో చర్చించారు. తెలంగాణ తల్లి రూపం ఎలా ఉండాలో తన ఆలోచనలను చెప్పి ఆ మేరకు కాగితంపై బొమ్మలు వేయాలని కేసీఆర్ సార్ సూచించారు. గంగాధర్ సార్ వేసిన బొమ్మను ఎంపిక చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపు ఇచ్చే బాధ్యత నాకు అప్పగించారు. మొదటి విగ్రహం తెలంగాణ భవన్లో పెట్టారు. మొదట్లో విగ్రహం తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువయ్యేది. తర్వాత అచ్చులు చేసి దీన్ని తగ్గించా. తెలంగాణ తల్లి విగ్రహం తయారీలో నా దగ్గర పని చేసే వారికి నైపుణ్యం వచ్చింది. ఫినిషింగ్ పనులు నేను చేసేవాడిని. ఎక్కువగా ఐదున్నర అడుగుల విగ్రహాలు ఉండేవి. సిద్ధిపేట, నర్సంపేట వంటి ప్రాంతాల్లో 12 ఫీట్ల విగ్రహాలు పెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాల కళాకారుడిగా నేను ఎంతో సంతృప్తి పొందాను. -
ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం ఉభయ సభలు జాతీయ గీతంతో ఆరంభం అయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఇటీవల వరంగల్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్... ఇటీవల మృతి చెందిన సభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం చదివి వినిపించారు. కాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గౌరవార్థం ఇవాళ, రేపు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సేవలను స్పీకర్ కొనియాడారు. ఇక డిసెంబర్ 23 వరకూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. మరోవైపు మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానం అనంతరం రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. -
గర్వం పనికిరాదు: కేసీఆర్
గర్వం, అహం పనికి రాదని టీఆర్ ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. వరంగల్ ఉప ఎన్నికలో విజయం పార్టీ నాయకుల్లో అహాన్ని పెంచకూడదని అన్నారు. వరంగల్ లో విజయం సాధించిన పసునూరి దయాకర్ తో పాటు.. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు బుధవారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ గెలుపు గర్వాన్ని తలకెక్కించుకోవద్దని పార్టీనేతలకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కవచంలా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలతో అత్యంత వినయంగా ఉండాలని, శాంతంగా ప్రవర్తించాలని, చాలా సంయమనం పాటించాలని, వీలైనంత తగ్గి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీకి, ఉద్యమానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా వరంగల్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని, ఈసారి ప్రభుత్వాన్ని దీవించి ఆత్మ విశ్వాసం పెంచారన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వరంగల్‌కు తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. జిల్లాలో అతి పెద్ద టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, కార్యకర్తలు వాటిని ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు. త్వరలోనే కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. వరంగల్‌లో అత్యధిక మెజారిటీ వచ్చేందుకు కృషి చేసిన వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. -
లండన్‌లో టీఆర్ఎస్ నాయకుల సంబరాలు
వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందడంపై లండన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచిపెట్టి, టపాసులు కాల్చారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులే దయాకర్‌ను గెలిపించాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రత్నాకర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను కలిసిన పసునూరి దయాకర్
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించిన పసునూరికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. పసునూరితో పాటు పలువురు మంత్రులు కేసీఆర్ ను కలిశారు. కాగా పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన లోక్‌సభ సభ్యుడిగా ఆయన రికార్డు నమోదు చేశారు. -
గులాబీ తోటలో ఓట్ల తుఫాను
-
గులాబీ తోటలో ఓట్ల తుఫాను
4,59,092 మెజారిటీతో వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు పార్టీ అభ్యర్థి దయాకర్ ఘన విజయం ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు.. డిపాజిట్ కోల్పోయిన ప్రతిపక్షాలు రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ-టీడీపీ కూటమి 59.42% ఓట్లు గులాబీ పార్టీకే... తెలంగాణలో ఇదే అత్యధిక మెజారిటీ.. దేశంలో 7వ అత్యధికం రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఓరుగల్లు’ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. మునుపటికన్నా భారీ మెజారిటీతో వరంగల్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉప ఎన్నికలో ఓటర్లు ఏకపక్షంగా టీఆర్ఎస్కు విజయాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన లోక్‌సభ సభ్యుడిగా పసునూరి రికార్డు నమోదు చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ పార్టీల నుంచి, స్వతంత్రులుగా బరిలో నిలిచిన 22 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా గెలుపు సాధిస్తామన్న కాంగ్రెస్ ఆశలు అడియాసలే అయ్యాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ప్రయత్నం చేసిన బీజేపీని వరంగల్ ఓటర్లు కరుణించలేదు. టీడీపీతో పొత్తుతో బరిలో ఉండి కూడా బీజేపీ డిపాజిట్ దక్కించుకోలేపోయింది. అన్ని సెగ్మెంట్లలోనూ.. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చింది. మొత్తంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 15,09,671 మంది ఓటర్లు ఉండగా... ఉప ఎన్నికలో 10,35,656 మంది ఓటు వేశారు. ఇందులో టీఆర్ఎస్కు 6,15,403, కాంగ్రెస్‌కు 1,56,311, బీజేపీకి 1,30,178, వైఎస్సార్సీపీకి 23,352, వామపక్షాల కూటమి అభ్యర్థికి 14,788 ఓట్లు వచ్చాయి. శ్రమజీవి పార్టీ తరఫున పోటీ చేసిన జాజుల భాస్కర్‌కు 28,541 ఓట్లు పోలయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)లో అభ్యర్థుల వరుసలో ఏడవ సంఖ్యలో ఉన్న భాస్కర్‌కు కెమెరా గుర్తు వచ్చింది. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలి ఉండడంతో భాస్కర్‌కు ఎక్కువ ఓట్లు పోలైనట్లు అభిప్రాయపడుతున్నారు. తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం.. వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డులో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవగా... తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ దాకా కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. ఇక్కడ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కడియం శ్రీహరి 3,92,137 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. అప్పట్లో ఇదే రికార్డు మెజారిటీగా నమోదుకాగా... ప్రస్తుత ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ దాన్ని తిరగరాశారు. మొత్తంగా ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో టీఆర్ఎస్కు 59.42 శాతం, కాంగ్రెస్‌కు 15.09 శాతం, బీజేపీకి 12.56 శాతం, వైఎస్సార్సీపీకి 2.25 శాతం, వామపక్షాల కూటమి అభ్యర్థికి 1.42 శాతం వచ్చాయి. కాగా.. ఈవీఎంలలో సాంకేతిక లోపాలున్నట్లు బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య.. ఎన్నికల అధికారి వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. దానివల్ల అధికార పార్టీకి ఏకపక్షంగా ఓట్లు వచ్చాయన్నారు. పరకాల నియోజకవర్గంలో వరికోల్ గ్రామంలోని 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో 89 శాతం పోలింగ్ నమోదైందని... అందులో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు ఒక ఓటు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. రిగ్గింగ్ జరిగిందని, తిరిగి పోలింగ్ నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ ఇ.వి.శ్రీనివాస్ ఈ ఫిర్యాదుపై సంతకం చేశారు. దానిని ఎన్నికల సంఘానికి పంపించారు. ఇది ఓ సామాన్య కార్యకర్త విజయంగా భావిస్తున్నా. కార్యకర్తగా ఉన్న నాకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించిన టీఆర్ఎస్కు, పార్టీ అధినేత కేసీఆర్‌కు రుణపడి ఉంటా. పేదలకు కేసీఆర్ అండగా ఉంటారనడానికి ఇదే నిదర్శనం. అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశంలోనే గుర్తింపు తెచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. వరంగల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా. - పసునూరి దయాకర్ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీలకు వచ్చిన ఓట్లు.. -
దేశంలో ఏడో అత్యధిక మెజార్టీ
-
దేశంలో ఏడో అత్యధిక మెజార్టీ
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఏడో వ్యక్తిగా ఘనతకెక్కారు. దయాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన విజేతలు ప్రీతమ్ ముండే (బీజేపీ) మహారాష్ట్రలోని బీద్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే 6.92 లక్షల ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అనిల్ బసు (సీపీఎం) 2004లో పశ్చిమబెంగాల్లోని అరమ్గఢ్ నియోజకవర్గం నుంచి అనిల్ బసు 5.92 లక్షల మెజార్టీతో గెలుపొందారు. పీవీ నరసింహారావు (కాంగ్రెస్) 1991లో నంద్యాల నుంచి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు 5.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నరేంద్ర మోదీ (బీజేపీ) 2014 ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి నరేంద్ర మోదీ 5.7 లక్షల ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లో కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాంవిలాస్ పాశ్వాన్ 1989లో ఉత్తరప్రదేశ్‌లోని హజీపూర్ నుంచి రాం విలాస్ పాశ్వాన్ (జనతా దళ్) 5.04 లక్షల మెజార్టీతో నెగ్గారు. పసునూరి దయాకర్ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4.59 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
వరంగల్ వార్ వన్ సైడే...
-
'వరంగల్ ప్రజలకు రుణపడివుంటా'
వరంగల్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే వరంగల్ లో తనను గెలిపిస్తున్నాయని టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో విజయం దిశగా దూసుకెళుతుండడంతో ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించడం వల్లే భారీ మెజారిటీతో తాను గెలవబోతున్నట్టు చెప్పారు. తనకు భారీ విజయాన్ని అందిస్తున్న వరంగల్ ప్రజలకు రుణపడివుంటానని అన్నారు. వరంగల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీయిచ్చారు. కేసీఆర్ తనపై పెద్ద బాధ్యత పెట్టారని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు.