సాక్షి, వరంగల్ : లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని.. ప్రజల్లో పూర్తిగా సానుకూల వాతావరణం ఉన్నందున మజ్లిస్ పార్టీతో కలిపి రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన ముఖ్యనేతలతోనూ కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ఇటీవల జిల్లాల పర్యటన తర్వాత ఢిల్లీలో టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని అర్థమవుతోందని.. తప్పక మరోసారి ఆశీర్వదిస్తారని చెప్పారని సమాచారం. ఈ మేరకు విజయం ఖరారైనందున మెజార్టీపైనే కేడర్ దృష్టి పెట్టాలని ఆయన నేతలకు సూచించారు.
వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల అభ్యర్థులు పసునూరి దయాకర్, మాలోతు కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి దయాకర్‌రావు లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండగా.. వరంగల్ స్థానానికి గ్యాదరి బాలమల్లు, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. పసునూరి దయాకర్, మాలోతు కవిత గెలుపు కోసం భారీ సభలు నిర్వహించిన కేసీఆర్... ఎప్పటికప్పుడు వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల తీరుపైనా ఆరా
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మార్చి 17 నుంచి శ్రీకారం చుట్టిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యేలే కీలకమని ప్రకటించారు. శాసనసభ సెగ్మెంట్ల పరిధిలో ఎమ్మెల్యేలదే పూర్తిగా బాధ్యతని.. మంత్రులు సమన్వయం మాత్రమే చేస్తారని తెలిపారు. శాసనసభ్యులను కాదని మంత్రులు, ఎంపీ అభ్యర్థులు ఏ పని చేయొద్దని కూడా సూచించారు. గతంలో ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ మంత్రి ఎంపీని పొగుడుతుంటే.. అది నచ్చక ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయిన ఘటన చర్చనీయాంశం కాగా, ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని సూచించిన కేసీఆర్... అంతిమంగా పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని స్పష్టం చేశారు.
14 అసెంబ్లీ నియోజకవర్గాలు
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వరంగల్ పరిధిలో స్టేషన్‌ఘన్‌పూర్(ఎస్సీ), వర్దన్నపేట(ఎస్సీ), వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, పినపాక, భద్రాచలం ఉన్నాయి. వరంగల్ స్థానం పరిధిలో 16,53,474 మంది, మహబూబాబాద్ పరిధిలో 14,23,351 మంది ఓటర్లు ఉన్నారు.
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తెలంగాణలో రికార్డు స్థాయి మెజార్టీ ఈ రెండు స్థానాల్లో రావాలని అధి నేత కేసీఆర్ పదే పదే సూచిస్తున్నారు. విధేయతే ప్రామాణికంగా గెలిచే అభ్యర్థులను నిలబెడతామని చెప్పి టికెట్లు ప్రకటించిన గులాబీ బాస్... బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారన్న కోణంలో కూడా ఆరా తీస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment