కాంగ్రెస్‌లోకి దానం, పసునూరి!  | BRS MP Pasunuri Dayakar and BRS MLA Prakash Goud Meet With CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి దానం, పసునూరి! 

Published Sat, Mar 16 2024 3:58 AM | Last Updated on Sat, Mar 16 2024 3:58 AM

BRS MP Pasunuri Dayakar and BRS MLA Prakash Goud Meet With CM Revanth Reddy - Sakshi

సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఎంపీ 

18న కాంగ్రెస్‌లో చేరిక! 

సీఎం రేవంత్‌తో దానం

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మరో సిట్టింగ్‌ ఎంపీ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్‌ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి పాల్గొన్నారు.

రెండు మూడురోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఈ సందర్భంగా నాగేందర్‌ తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పసునూరి దయాకర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, పాలకుర్తి కాంగ్రెస్‌ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఇద్దరు నేతలు ఈనెల 18న కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దానం నాగేందర్‌ను సికింద్రాబాద్‌ ఎంపీగా బరిలో నిలిపే ఆలోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉందని గాందీభవన్‌ వర్గాలంటున్నాయి. మరోవైపు పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఅర్జీ వినోద్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. తనకు సికింద్రాబాద్‌ నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement