
సాక్షిప్రతినిధి, వరంగల్: అధికార పార్టీలోని కీలక ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మధ్య వర్గపోరు తాజాగా వెలుగుచూసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షిగా చోటుచేసుకున్న పొరపాటు అధికార పార్టీలో కొత్త సమస్యలకు కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పశువైద్య కాలేజీని వరంగల్ ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మామునూరులో ఈ కాలేజీని ఏర్పాటు చేయాలని పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు మామునూరులో కాలేజీ భవన సముదాయం నిర్మాణానికి సోమవారం ముహూర్తంగా నిర్ణయించారు.
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సభ జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీనికి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు చందూలాల్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్ ఫొటోలు ముద్రించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ పసునూరి దయాకర్ ఫొటో ముద్రించలేదు. శంకుస్థాపన కార్యక్రమం మొదలుకావడానికి ముందే ఎంపీ దయాకర్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కడియం శ్రీహరి, మంత్రి తలసాని కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు.
అప్పటికే ఎంపీ దయాకర్ వెనుతిరిగి వెళ్లిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ పసునూరి దయాకర్ అసంతృప్తి విషయం తెలియడంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వేదిక వద్దకు రాలేదు. భూమి పూజ ముగిసిన అనంతరం శిలాఫలకం ఆవిష్కరించి అక్కడి నుంచి ఇతర కార్యక్రమాలకు వెళ్లిపోయారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కడియం శ్రీహరి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మామునూరు కార్యక్రమంలోనే ఉండాలి. భవన నిర్మాణ శంకుస్థాపనతోపాటు గొర్రెల పంపిణీ, గొర్రెల పెంపకందార్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ.. డిప్యూటీ సీఎం కేవలం శంకుస్థాపన కార్యక్రమానికే పరిమితమయ్యారు.
ఎంపీ దయాకర్ పేరులేని ఫ్లెక్లీ
అంతర్గత విభేదాలు..?
వెటర్నిటీ కాలేజీ నిర్మిస్తున్న మామునూరు... వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రమేశ్ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. పసునూరి దయాకర్ 2013 వరకు వర్ధన్నపేట టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అనంతరం అరూరి రమేశ్ చేరికతో టీఆర్‌ఎస్ అధిష్టానం ఆయనకు వర్ధన్నపేట ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. సాధారణ ఎన్నికల్లో రమేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో దయాకర్ ఎంపీగా గెలిచారు. ఇద్దరు ముఖ్యమైన పదవుల్లో ఉన్నా.. పాత విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజా అధికార కార్యక్రమంలో ఇది బయటపడింది.
తప్పు ఎవరిది..
వెటర్నిటీ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ముద్రణకు బాధ్యులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. అధికారులు ముద్రిస్తే అనుమతి ఇచ్చిన వారు ఎవరనేది తేలాల్సి ఉందని పలువురు ప్రజాప్రతినిధులు అంటున్నారు. మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఫొటో పెట్టిన వారు స్థానిక ఎంపీ ఫొటోను ముద్రించకపోవడం ఏమిటని పసునూరి వర్గం ప్రశ్నిస్తోంది. ఫ్లెక్సీలో సంబంధంలేని వ్యక్తుల ఫొటోలు ఉన్నాయి. వరంగల్ మేయర్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ కొండా మురళి, బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫొటోలూ లేవు. ఉప ముఖ్యమంత్రి ఆమోదం తీసుకున్న తర్వాతే అధికారులు ఫ్లెక్సీ ముద్రిస్తారని... ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని పసునూరి వర్గీయులు అనుమానిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్గం భవిష్యత్ రాజకీయ ఆలోచనలతోనే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీ వర్గం భావిస్తోంది.
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కడియం, తలసాని
Comments
Please login to add a commentAdd a comment