సాక్షి, వరంగల్/హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మీడియా ముఖంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నేతలు స్పందించారు. వరంగల్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొండా దంపతులు రాజకీయంగా సమాధి అవుతున్న సందర్భంలో తనే స్వయంగా కేటీఆర్‌తో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. ఉద్యమ సమయంలో వారిపై రాళ్ల వర్షం కురిపించినా.. కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని చెప్పారు.
పార్టీపై నమ్మకం లేకుంటే కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. భూపాలపల్లి, పరకాల ప్రాంతాల్లో పర్యటించి పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ముందు నుంచే కాంగ్రెస్‌కు వెళ్లాలని చూసారని, దమ్ము ఉంటే బహిరంగంగా వెళ్లాలని సవాల్ విసిరారు. సర్వే ప్రకారమే తమ అధినేత కేసీఆర్ టికెట్‌లు ఇచ్చారని, కొండా దంపుతుల చీకటి వ్యవహారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడుతామన్నారు. అవకాశవాద రాజకీయ నాయకులకు పార్టీలో స్థానం లేదన్నారు.
ప్రజలకు అందుబాటులోలేకపోవడంతోనే..
కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలనే ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఉద్యమ కారులను పక్కకు పెట్టి కొండా సురేఖకు టికెట్ ఇచ్చి గెలిపించామన్నారు. అలాంటిది ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వారు కార్పోరేటర్‌లను బెదిరిస్తున్నారని టికెట్ ఇవ్వకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్నారు. కొండా సురేఖకు టికెట్ రాకపోవడంలో తన ప్రమేయం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కేసీఆర్ ఒక్కడే నాయకుడు...
వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు చేసింది కొండా దంపతులేనని టీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ గుండు సుధారాణి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీలో నేతలు గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారంటూ కొండా దంపతులు పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారి ఆరోపణలపై స్పందించిన సుధారాణి కొండా వ్యాఖ్యాలపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీపై వారి వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. బీసీ నాయకుల మధ్య కొండా దంపతులు చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో గ్రూపులు లేవని.. కేసీఆర్ ఒక్కడే నాయకుడని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment