Vinay Bhaskar
-
బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత వివాదం.. వేడెక్కుతున్న వరంగల్ పాలిటిక్స్
సాక్షి, వరంగల్: వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత వివాదం ముదురుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. పార్క్ స్థలం ఎకరం భూమి ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించుకుని ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయానికి ఇంటి నంబర్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వరంగల్ బీఆర్ఎస్ నేతలను స్టువర్ట్ పురం చెడ్డి గ్యాంగ్ దొంగలుగా రాజేందర్ రెడ్డి అభివర్ణించారు. భూ ఆక్రమణలు చేసిన బీఆర్ఎస్ నేతల మీద రౌడి షీట్ ఓపెన్ చేసి చెడ్డిల మీద తిప్పాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలైనా వదిలిపెడతాను కానీ... వినయ్ భాస్కర్ చేసిన పాపాలను వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే నాయిని నిప్పులు చెరిగారు. -
'అధ్యక్షా..!' అనేదెవరో?
సాక్షి, వరంగల్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయా పార్టీల ప్రెసిండెట్లు తలపడుతుండగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్షా.. అంటారో అనే విషయంలో ఆయా పార్టీల నేతలతోపాటు ఓటర్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నాలుగు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నుంచి విజయం సాధించి, ఐదో విజయం కోసం ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలిసారి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకుని అసెంబ్లీలో అడుగిడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదో విజయం కోసం దాస్యం వినయ్ భాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఐదో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉద్యమకారులకు అండగా నిలవడం, ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు ఉండడం, నిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వినయ్ భాస్కర్‌కు కలిసొచ్చే అంశాలు. ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బబ్దిదారులతో పాటు నియోజకర్గంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించారు. కార్మికులకు సొంతగా ప్రీమియం చెల్లించి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించి బీమా సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ నెల 28న నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ రావడంతో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. మొదటిసారి శాసనసభకు నాయిని రాజేందర్ రెడ్డి పోటీ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి మొదటిసారి శాసన సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడిన సమయంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడి ఈసారి టికెట్ సాధించారు. 2014, 2018లో పార్టీ టికెట్ ఆశించారు. ఆ రెండు సార్లు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నాలుగు పర్యాయాలుగా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత నాయిని రాజేందర్ రెడ్డికి అనుకూలించే అంశాలు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జార్ఖండ్ సీఎం బూపేష్ భఘేల్, సినీ నటి విజయ శాంతి చేసిన ప్రచారం తనకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. 'పద్మ' విశసించేనా..!? వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రావు పద్మ, పశ్చిమ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, రావు పద్మ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ అశించి చివరకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. వరంగల్ మహానగరంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ, అమ్మత్, హృదయ్ పథకాల ద్వారా జరిగిన అభివృద్ది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న అసంతృప్తి, కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్, వ్యాగన్ తయారీ పరిశ్రమ మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీకి ప్రజాదరణ ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, మహిళల ఓట్లు వంటివి రావు పద్మకు కలిపోచ్చే అంశాలు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ రాక, బీజేపీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి, మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, ఇతర అగ్ర నాయకుల ప్రచారం చేయడం వల్ల రావు పద్మ తాను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
నాకెవ్వరు పోటీ కాదు..
-
కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ: దాస్యం వినయ్ భాస్కర్
-
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు,కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. చదవండి: అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం.. -
వరంగల్ వెస్ట్ నియోజకవర్గం హ్యాట్రిక్ సాధ్యమా..?
వరంగల్ వెస్ట్ నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన వినయ్ భాస్కర్ మరోసారి విజయం సాదించారు. ఒక ఉప ఎన్నికతో సహా ఆయన నాలుగుసార్లు గెలిచినట్లు అయింది. వినయ్ భాస్కర్ తన సమీప టిడిపి ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై 36451 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పక్షాన రేవూరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. దాస్యం వినయ్ భాస్కర్‌కు 80189 ఓట్లు రాగా, రేవూరి ప్రకాష్ రెడ్డికి 43299 ఓట్లు వచ్చాయి. గతంలో నర్సంపేట నుంచి మూడుసార్లు గెలిచిన ప్రకాష్‌రెడ్డి 2018లో వరంగల్ వెస్ట్‌కు మారి ఓటమి చెందారు. బిజెపి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ఎమ్.ధర్మారావుకు ఆరువేల ఓట్లు వచ్చాయి. వినయ్ భాస్కర్ మున్నూరు కాపు వర్గానికి చెందినవారు.ఆయనకు ఈసారి విఫ్ పదవి వచ్చింది. 2014లో వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్ధి ఎర్రబెల్లి స్వర్ణను 56304 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. అప్పుడు కూడా బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా రంగంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మార్తి నేని ధర్మారారవు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత హన్మకొండ బదులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడిరది. రెండువేల తొమ్మిదిలో తొలిసారి గెలిచిన వినయ్ భాస్కర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో శాసనసభకు రాజీనామా చేసి 2010 జూ 27న జరిగిన ఉప ఎన్నికలో, ఆ తర్వాత మరో రెండుసార్లు విజయం సాదించారు. వినయభాస్కర్ సోదరుడు ప్రణయభాస్కర్ గతంలో హన్మకొండలో గెలుపొందిన ఎన్.టిఆర్ క్యాబినెట్లో కొంతకాలం మంత్రిగా ఉన్నారు. అస్వస్థత కారణంగా ఈయన అకాల మరణం చెందారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కుమారుడు పి.వి రంగారావు గెలిచారు. రంగారావు అంతకుముందు కూడా ఒకసారి గెలుపొందారు. గతంలో ఇక్కడ ఉన్న హన్మకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి, పిడిఎఫ్ రెండుసార్లు గెలిచాయి. 1952లో హన్మకొండలో గెలిచిన పెండ్యాల రాఘవరావు వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీచేసి గెలుపొందడం అరుదెన విషయం. ఆ తర్వాత రెండు అసెంబ్లీ సీట్లకు రాజీనామాచేశారు. హనుమకొండలో 1978లో గెలిచిన టి.హయగ్రీవాచారి, రెండుసార్లు ధర్మసాగర్ నుంచి, ఒకసారి ఘనపూర్ నుంచి గెలుపొందారు. హయగ్రీవాచారి, ఎస్. సత్యనారాయణ, ప్రణయభాస్కర్, పి.వి రంగారావులు మంత్రి పదవులు నిర్వహించారు. పివి. రంగారావు సోదరుడు రాజేశ్వరరావు సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు గతంలో ఎన్నికయ్యారు. 2004లో హనుమ కొండలో గెలిచిన మందాడి సత్యనారాయణరెడ్డి తర్వాత అసమ్మతి నేతగా ఉండి, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటకు గురయ్యారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హత వేటుపడిన తొమ్మిదిమందిలో ఈయన ఒకరు. ఈయన హైకోర్టుకు వెళ్ళి ఒక నెలరోజుల పాటు స్టే తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత హైకోర్టు కూడా వ్యతిరేకతీర్పు ఇవ్వడంతో ఈయన పదవిని కోల్పోయారు. వరంగల్ పశ్చిమ , హన్మకొండ,హసన్ పర్తి, ధర్మసాగర్ కలిసి రెండుసార్లు రెడ్లు, ఏడుసార్లు బిసి నేతలు (వినయ్ భాస్కర్ కూడా బిసి నేతే), ఏడుసార్లు బ్రాహ్మణ,రెండుసార్లు ఎస్.సిలు, ఒకసారి ముస్లిం, ఒకసారి ఇతరులు గెలిచారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
చెత్తకుప్పల నుంచి చదువులమ్మ ఒడికి..
హనుమకొండ: చెత్త ఏరే చిట్టిచేతులు నోట్‌బుక్స్ పట్టాయి. చెదిరిన నెత్తి, చిరిగిన బట్టలతో ఉండే పిల్లలు శుభ్రంగా తయారై బడిబాట పట్టారు. 11 మంది బాలలు చెత్తకుప్పలను వీడి చదువులమ్మ ఒడికి చేరుకున్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చెత్త ఏరుకునే బాలలతోపాటు తల్లిదండ్రులను పిలిపించారు. చదువు ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన, చైతన్యం కల్పించారు. దీంతో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. వెంటనే జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీనును పిలిపించి 11 మంది బాల కార్మికులను గురుకులాల్లో చేర్చించారు. పిల్లలకు నోట్‌బుక్స్ అందించారు. బాలలకు, తల్లిదండ్రులకు వినయ్‌భాస్కర్ భోజనం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. -
నా బ్రతుకు రామన్న కోసం.. తెలంగాణ జాతిపితకే నా జీవితం అంకితం
వరంగల్: నా గొంతులో ప్రాణమున్నంత వరకు మంత్రి రామన్న చెయ్యిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ప్రభుత్వ చీఫ్‌విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రమాణం చేశారు. హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట సెయింట్ గాబ్రియల్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం రాత్రి ఐటీ, మున్సి పల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నానన్నారు. తనను పిలిచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలంగాణ జాతిపిత సీఎం కేసిఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తన ప్రజాప్రతినిధి జీవితంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ పదేళ్ల జీవితం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేయించలేకపోయానని, సీఎం కేసీఆర్, మంత్రి రామన్నల సహకారంతో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్న వరంగల్ పశ్చిమ ప్రాంతానికి వీలైనంత మేరకు నిధులను మంజూరు చేయిస్తున్నామన్నారు. బలగం లాంటి తన కార్యకర్తల సహకారంతో వారిచి్చన స్ఫూర్తి, ధైర్యంతో ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులను చేయిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.78 కోట్లతో ఫాతిమానగర్‌లో చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణపు పనులు కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుందని ప్రజలు గుర్తించాలని కోరారు. మంత్రి రామన్న సహకారంతో హనుమకొండ జిల్లాకు 4 అతిపెద్ద ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయని, వీటిలో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మతతత్వంతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్న బీజేపి నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాధించిన నిధులు శూన్యమని, వరంగల్ భద్రకాళీ ఆలయం మాడవీధుల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, మాజీ ఎంపీ వొడితెల కెప్టెన్ లక్షి్మకాంతారావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, సురభివాణిదేవి, బస్వరాజ్ సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సీపీ రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు పశ్చిమంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పొలిటికల్ హీట్..!
ఓరుగల్లు నగరం పశ్చిమంలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వేసవి ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా తీవ్రంగా పెరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఇక్కడ పోటీ పడుతున్నదెవరు? వారి పరిస్థితేంటి? వరంగల్ నగరం పశ్చిమ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పొలిటికల్ వార్ జరుగుతోంది. దాస్యం వినయ్‌భాస్కర్ అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించిన వినయ్‌భాస్కర్ ఐదో సారి కూడా గులాబీ జెండా ఎగరేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి కూడా గెలిచేది నేనే అంటూ ధీమాగా ఉన్నారాయన. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగుతానంటున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఎలాగైనా ఈసారి దాస్యంకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. నాలుగుసార్లు గెలిచి నగరానికి ఏం చేశావని ఐదోసారి గెలిపించాలని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళుతున్నారు నాయిని. తొలినుంచీ ఉత్తర దక్షిణ ధృవాలుగా కొనసాగుతున్న దాస్యం వినయ్‌భాస్కర్, నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా..వీరి అనుచరులు కూడా అదే రేంజ్లో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. కరపత్రాలు, ప్లెక్సీ పోస్టర్లతో రాజకీయ విమర్శలు చేసుకుంటూనే..ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దాస్యం వినయ్ భాస్కర్ పై చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్‌కు హనుమకొండ బిఆర్ఎస్ ముఖ్యనాయకులు ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్.. హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందా? కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు సైతం వాగ్ధాటి పెంచారు. ప్రజల సమస్యలు పరిష్కరించి..అభివృద్ధి చేస్తాడని దాస్యంను గెలిపిస్తే ఎమ్మెల్యేగా చేసింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూకబ్జాలు, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకుంటూ అభివృద్దిని గాలికొదిలేసి వచ్చిన అభివృద్ధి నిధులను ఖర్చు చేయలేని నిస్సహాయ స్థితికి చేరారని ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్ సెల్ కు వచ్చే ఫిర్యాదుల్లో 70శాతం బిఆర్ఎస్ నేతల భూ కబ్జాలపైనే ఉంటున్నాయని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ తరపున నాయిని రాజేందర్ రెడ్డి బరిలో నిలబడితే గులాబీ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ ఓడిపోవడం ఖాయమంటూ ప్రచారం సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీల తరుపున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేది తామే అటు దాస్యం, ఇటు నాయిని చెప్పుకుంటున్నారు. ఎవరికి వారే ఎదుటి వారి లోపాల్ని ఎత్తి చూపుతూ..పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దాదాపు సమానంగా వచ్చినట్లు సమాచారం. సర్వే తర్వాతే ఇరువురు నేతలు పోటీపడి విమర్శలు గుప్పించుకుంటూ..ప్రజాబలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ప్రత్యర్థిని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలడంలేదని చెబుతున్నారు. చదవండి: గులాబీ బాస్‌నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది? -
కేంద్రం ఓబీసీ జనగణన చేపట్టాలి: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక విప్లవంతో కులవృత్తులకు దూరమైన వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓబీసీ జనగణన చేపట్టాలని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రధానిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఓబీసీ గణన చేపట్టకపోవడం సరికాదన్నారు. కేంద్రం ఓబీసీల గణన చేపట్టేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి గురువారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. -
‘దమ్ముంటే నీ కన్న తల్లిపై ప్రమాణం చెయ్’
సాక్షి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళా బీజేపీ వరంగల్‌లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. వరుసగా బీజేపీ నాయకులు వరంగల్ పర్యటనలు చేసూకుంటూ వరంగల్ అభివృద్ధి పై విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో పాటు స్థానిక ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్, బీజేపీ బండి సంజయ్‌లు వరుస గా పర్యటనలు చేస్తూ బీజేపీ కార్యకర్తల్లో ఊపు తెచ్చి ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా వరంగల్‌లో బీజేపీ బల పడుతుందనే రీతోలో కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో వరంగల్ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నగరం ప్రారంభం అయిన కడిపికొండ దగ్గర ఘన స్వాగత పలికిన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో చేరికలు నిర్వహించి బీజేపీ వైపు జనం చూస్తున్నారు అనే భావన తీసుకు వస్తున్నారు. అంతే కాదు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సొంతానికి వాడుతున్నారంటూ అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారు అంటూ విమర్శించారు. స్థానికి ఎమ్మెల్యేలపైనా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బండి సంజయ్ విమర్శలను వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదని మండిపడ్డారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు పేలితే నాలుక చీరేస్తాం అంటూ బండి సంజయ్‌కు వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. ‘నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే వరంగల్‌లోనే ఉరి వేసుకునే పరిస్థితి తీసుకువస్తాం జాగ్రత్త. మీ నీచ రాజకీయాల కోసం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేయవద్దు. నీకు దమ్ముంటే నిన్ను కన్న నీ తల్లిపై ప్రమాణం చేసి వాస్తవాలు మాట్లాడాలి. మా సవాల్‌ను స్వీకరించు. నీ దగుల్బాజీ వేషాలు నిన్ను కన్న నీ అమ్మకైనా అర్థం అవుతాయి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ నువ్వు ఎక్కడున్నావ్. ఉద్యమనేత కేసీఆర్‌ను విమర్శించే అర్హత నీకు లేదు. కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలిస్తే నాలుక చీరేస్తాం. బీజేపీ నేతలు ఖబడ్దార్. పునర్విభజన చట్టంలో హామీలు ఏమయ్యాయ్. బ్రోకర్ బండి సంజయ్ అబద్దాలు ప్రచారం చేస్తే.. నిన్ను ప్రజలు బట్టలిప్పి కొడతారు. వారణాసిలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. నువ్వు బండి సంజయ్ కాదు.. అబద్దాల సంజయ్. సంజయ్ ముచ్చట్లు చెబితే వరంగల్ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీకి నువ్వు అధ్యక్షుడివని గుర్తుపెట్టుకో' అని బండి సంజయ్‌పై వినయ్ భాస్కర్ విరుచుకుపడ్డారు. ఇటు బీజేపీ నేతలు విమర్శలు. అటు టీఆర్ఎస్ నేతల వార్నింగ్స్ తో జిల్లాలో ఒక్కసారి పొలిటికల్ హీట్ పెరిగింది. -
నమ్మితే.. నయవంచనే!
సాక్షి వరంగల్ : ప్రేమకు పునాది నమ్మకం.. ఆ నమ్మకమే యువతుల పట్ల మరణ శాసనంగా మారుతోంది. ప్రేమ. ప్రేమా అంటూ తియ్యటి మాటలు చెప్పి యువతలను ఆకర్షించడం.. ఆ పైన సెల్ నంబర్ దొరికితే చాలు అమ్మాయి తనదేనని గర్వంగా స్నేహితులకు చెబుతున్న ఘటనలు కోకోల్లలుగా జరుగుతున్నాయి. ఇందులోలో కొన్ని ఘటనలు విషాదంగా ముగుస్తుండడం కుటుంబీకులకు తీరని ఆవేదనను మిగులుస్తున్నాయి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు సంఘటనల్లో చివరకు అమ్మాయిలు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా యువతులపై జరుగుతున్న దాడుల వల్ల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవువుతున్నారు. ప్రేమ పేరుతో వంచించే నయ వంచకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కళాశాలలకు వెల్లిన తమ పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ప్రతి రోజు పరీక్షే అవుతోంది. ప్రమాదం ఎవరి రూపంలో వచ్చి ఏం చేస్తుందో తెలియక ప్రతీ క్షణం టెన్షన్‌తో బ్రతకాల్సిన పరిస్థితులు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. సంఘటనల జరిగాక పోలీసులు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా నిందితులు, మిగతా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. పేద కుటుంబం.. ప్రేమ మోసం నగరంలో నాలుగు నెలల్లో జరిగిన రెండు సంఘటనల్లో రెండు పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మయిలు తనువు చాలించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆగస్టు 10 జరిగిన సంఘటనలో సమ్మయ్యనగర్కు చెందిన పదో తరగతి విద్యార్థిని వెన్నెలపై ఇద్దరు అత్యాచారం చేశారు. దీంతో ఆమె ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు కొయ్యడ తిరుపతితో పాటు మరో మైనర్ బాలుడు జైలు పాలయ్యారు. ఇంతలోనే మరో అమ్మాయి ప్రేమకు బలైంది. దీన్దయాళ్నగర్కు చెందిన గాదం మానస పేద కుటుంబానికి చెందిన యువతి. ఆమె తల్లిదండ్రులు గాదెం స్వరూప, మల్లయ్య గీసుగొండ మండలం కొమ్మాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. ముగ్గురు పిల్లల్లో ఒకరి వివాహం చేయగా, మరో ఇద్దరిని కూరగాయలు అమ్మి చదివిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా షాపులో పనిచేస్తున్న క్రమంలో పులి సాయిగౌడ్ పరిచయం పెంచుకుని ఆ తర్వాత సెల్ నంబర్ తీసుకుని, ముందుగా చాలా మర్యాదగా మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమ మొదలుపెట్టాడు. అనంతరం తన కోసం బయటకు రాకుంటే చస్తానని బెదిరించి చివరకు బయటకు వచ్చిన తరువాత బలవంతంగా అత్యాచారం జరిపి హత్య చేయడం ఆ కుటుంబాన్ని ఎంతో కుంగుబాటుకు గురిచేసింది. ఈ రెండు సంఘటనల్లో అమ్మాయిలు కేవలం సెల్ఫోన్లలో నిందితులు ప్రేమగా మాట్లాడిన మాటలకు పొంగిపోయి... ఇంట్లో వారికి చెప్పకుండా నిందితుల వెంట వెళ్లి ప్రాణాలను కోల్పోయారు. మానస హత్యలో నిందితుడు సాయిగౌడ్ సుమారు ఆరు గంటల పాటు మృత దేహంతో ప్రయాణం చేసి , చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఏం జరుగుతుందో... ఇంట్లో ఈడు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడే ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కళాశాలలకు వెళ్లే అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర రూ.వేల విలువైన సెల్ఫోన్లు ఉంటున్నాయి. వీటి ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో, ఎవరితో ఎంత సేపు మాట్లాడుతున్నారో పట్టించుకునే తీరిక చాలా మంది తల్లిదండ్రులకు ఉండడం లేదు. కమిషనరేట్ పరిధిలో ప్రతీ వారం షీ టీమ్స్ అధికారులు ఈవ్‌టీజర్లకు కౌన్సెలింగ్ ఇస్తుండగా.. ఇందులో 80 శాతం మంది కళాశాల విద్యార్థులే ఉంటున్నారు. అయితే, కౌన్సెలింగ్ తర్వాత కూడా చాలామందిలో మార్పు రాకపోవడం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది. మృతదేహం వద్ద నివాళుర్పించిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఎంజీఎం : అత్యాచారం, హత్యకు గురైన మానస మృతహం వద్ద ప్రభుత్వ చీఫ్ వినయ్‌భాస్కర్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని సందర్శించి కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు ఘటనకు పాల్పడిన నిందింతుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని స్వగ్రామమైన కొమ్మాలకు తరలించగా రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
వినయవిధేయతకు పట్టం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కు మరోమారు పెద్దపీట వేశారు. ఇటు శాసనసభ.. అటు శాసనమండలిలో కీలకమైన పదవులకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు కట్టబెట్టారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించారు. అలాగే, శాసనమండలిలో విప్‌గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లును కూడా చీఫ్ విప్‌గా నియమించారు. ఈనెల 9 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చీఫ్ విప్‌తో పాటు ఆరుగురు విప్‌లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్‌కు, మండలిలో చీఫ్ విప్‌గా బి.వెంకటేశ్వర్లుకు స్థానం దక్కింది. వరుస విజయాలు వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్తో పాట సీఎం కేసీఆర్‌కు విధేయత, విశ్వసనీయతతో మెలిగిన వినయ్‌భాస్కర్‌కు కీలక పదవి దక్కింది. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న వినయ్‌భాస్కర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. 2004లో హన్మకొండ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి సత్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయిన వినయ్‌భాస్కర్.. ఆ తర్వాత వ రుస విజయాలు సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి 2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2015 జనవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి పదవి ఆశించిన వినయ్‌కు అప్పుడు అవకాశం దక్కకపోగా, ఈసారి ప్రభుత్వ చీఫ్ విప్‌గా కేసీఆర్ ఆవకాశం కల్పించడం విశేషం. ‘మండలి’లో చీఫ్ విప్‌గా వెంకటేశ్వర్లు శాసనమండలిలో విప్‌గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లు ఈసారి చీఫ్ విప్‌గా పదోన్నతి కలిగింది. ఆరు నెలల క్రితం ఉపాధ్యాయుల నియోజకవర్గం స్థానానికి జరిగిన ఎన్నికల్లో శాసనమండలి ఎన్నికల్లో చీఫ్ విప్‌గా ఉన్న సుధాకర్ రెడ్డి ఓడిపోయిన విషయం విదితమే. దీంతో ఆ స్థానంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లును నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తా ప్రభుత్వ చీఫ్ విప్‌గా సిఫారసు చేసిన కేటీఆర్, ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ కోసం వారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమంలో పని చేసిన నాకు సముచిత స్థానం కల్పించారు. నాకు దక్కిన ఈ పదవికి వన్నే తెచ్చేలా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవహరిస్తాను. మొదటి నుంచి పార్టీకి వినయ విధేయతలతో ఉన్నాను. ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ఆదేశాలతో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేశాం. వరంగల్ టౌన్ ప్రెసిడెంట్‌గా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశా. కార్పొరేటర్‌గా నా డివిజన్ అభివృద్ధికి, ఎమ్మెల్యేగా ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గం అభివృద్ధికి పనిచేశా. అంకితభావంతో, పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్న నా పేరును ప్రభుత్వ విప్‌గా సిఫారసు చేసిన కేటీఆర్‌కు, ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు, మిత్రపక్షాలను కలుపుకుపోతూ కృషి చేస్తా. – దాస్యం వినయ్‌భాస్కర్ -
కేసీఆరే మళ్లీ సీఎం..
సాక్షి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తన విజయం తథ్యమని తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. శనివారం హన్మకొండ నయీంనగర్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడారు. కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా కుటుంబ సభ్యుల్లా, సమన్వయంతో పని చేశామన్నారు. గత మూడు నెలలుగా అహర్నిశలు కృషి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు వినయ్‌భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ముందున్నామన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 58.2 శాతం పోలింగ్ అయిందన్నారు. ఎప్పటి లాగానే తాను ప్రజల మధ్యన ఉంటానన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖాముఖి, ప్రతి శనివారం అడ్డా ములాఖత్, ప్రతి ఆదివారం అపార్ట్మెంట్ దర్శన్, కాలనీ విజిట్ కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ నల్ల స్వరూపరాణిరెడ్డి, నాయకులు సుందర్రాజు, నల్ల సుదాకర్‌రెడ్డి, వెంకట్రాజం, చాగంటి రమేష్ టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మీది నీచరాజకీయ చరిత్ర
హన్మకొండ చౌరస్తా: కొండా దంపతులది నీచ రాజకీయ చరిత్ర అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తమకు రాజకీయ జన్మనిచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే.. రాజకీయ పునర్జన్మను ప్రసాదించింది కేసీఆర్ అని గతంలో అనేక సార్లు చెప్పిన కొండా దంపతులు నేడు విమర్శించడమే వారి దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. మంగళవారం హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన పదవులను అనుభవించి నేడు అదే కుటుంబంపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. లక్ష డాల ర్ల ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమంలో తాను సైతం అంటూ పాల్గొన్న కేటీఆర్‌ను, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలిపేందుకు తన సొంత ఖర్చులతో సమైక్య పాలనలో వెలుగెత్తి చాటిన కవితను విమర్శించే స్థాయి కొండా దంపతులకు లేదన్నారు. ఆయన వెంట ఎంపీ పసునూరి దయాకర్, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు ఉన్నారు. -
అందుకే కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు
సాక్షి, వరంగల్/హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మీడియా ముఖంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ జిల్లా నేతలు స్పందించారు. వరంగల్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొండా దంపతులు రాజకీయంగా సమాధి అవుతున్న సందర్భంలో తనే స్వయంగా కేటీఆర్‌తో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. ఉద్యమ సమయంలో వారిపై రాళ్ల వర్షం కురిపించినా.. కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని చెప్పారు. పార్టీపై నమ్మకం లేకుంటే కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. భూపాలపల్లి, పరకాల ప్రాంతాల్లో పర్యటించి పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ముందు నుంచే కాంగ్రెస్‌కు వెళ్లాలని చూసారని, దమ్ము ఉంటే బహిరంగంగా వెళ్లాలని సవాల్ విసిరారు. సర్వే ప్రకారమే తమ అధినేత కేసీఆర్ టికెట్లు ఇచ్చారని, కొండా దంపుతుల చీకటి వ్యవహారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడుతామన్నారు. అవకాశవాద రాజకీయ నాయకులకు పార్టీలో స్థానం లేదన్నారు. ప్రజలకు అందుబాటులోలేకపోవడంతోనే.. కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలనే ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఉద్యమ కారులను పక్కకు పెట్టి కొండా సురేఖకు టికెట్ ఇచ్చి గెలిపించామన్నారు. అలాంటిది ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వారు కార్పోరేటర్లను బెదిరిస్తున్నారని టికెట్ ఇవ్వకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్నారు. కొండా సురేఖకు టికెట్ రాకపోవడంలో తన ప్రమేయం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ ఒక్కడే నాయకుడు... వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు చేసింది కొండా దంపతులేనని టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ గుండు సుధారాణి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీలో నేతలు గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారంటూ కొండా దంపతులు పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారి ఆరోపణలపై స్పందించిన సుధారాణి కొండా వ్యాఖ్యాలపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీపై వారి వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. బీసీ నాయకుల మధ్య కొండా దంపతులు చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో గ్రూపులు లేవని.. కేసీఆర్ ఒక్కడే నాయకుడని తేల్చిచెప్పారు. -
అజ్ఞాతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
వరంగల్: ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్న నేతలతో పార్టీ అధినాయకత్వం మంచి జోష్ మీద ఉంది. అయితే వలసలతో పార్టీలో ఉన్న నేతలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్టీలో వరుస చేరికలపై నేతలు అలక పూనుతున్నారు. తాజాగా వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృఫ్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీలోకి వరుస చేరికలతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. కార్పొరేషన్ టికెట్ల విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వినయ్ భాస్కర్ సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు, తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. -
కేసీఆర్‌ను విమర్శిస్తే ఖబడ్దార్
పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్ బాబు వ్యూహం మేరకే ఎమ్మెల్యేలతో బేరం హన్మకొండ : టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని, ఖబడ్దార్ అని టీడీపీ నాయకులను పార్లమెంట్ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు శ్రమిస్తుంటే.. ఆంధ్రా వారి మోచేతి నీళ్లు తాగుతూ విమర్శలు చేస్తారా అని వారి తీరును తూర్పారబట్టారు. పార్టీలోకి రాకముందు డీలర్ దయాకర్‌రావు, టీడీపీలోకి వచ్చాక డాలర్ దయాకర్‌రావు, తెలంగాణ వచ్చాక ప్యాకేజీల దయాకర్‌రావు అయ్యాడని దుయ్యబట్టారు. ఏపీలో వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ఫిరాయింపులు కావా అని ఆయన ప్రశ్నించా రు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ మహా సంకల్ప సభలో ఏపీ సీఎం చంద్రబాబు దిగజారి మాట్లాడారని అన్నారు. ఉప ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు జిల్లాకు క్యూ కట్టారని, వక్రభాష్యాలు మాట్లాడితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి ఎలా అవుతారని, టీడీపీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసి బయటకు వచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవరెడ్డి, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, మరుపల్లి రవి, కె.వాసుదేవరెడ్డి, చేవెల్ల సంపత్, క మరున్నీసా బేగం, జోరిక రమేశ్, కె.దామోదర్, బి.వీరేందర్, నాగపురి రాజేష్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సోదరుడి మృతి
వరంగల్ : వరంగల్ పశ్చిమ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ఆకస్మికంగా మృతి చెందారు. ఎమ్మెల్యే సోదరుడు ఉదయ్ భాస్కర్ బుధవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంపూర్ణ తెలంగాణ ఇవ్వాల్సిందే..
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణలో ఏ ఒక్క భాగం లేదా ప్రాంతాన్ని వదులుకునేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు సంపూర్ణ తెలంగాణ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. సంపూర్ణ తెలంగాణ ఏర్పాటుచేయాలనే డిమాండ్‌తో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(టీఎల్ఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని కాళోజీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేశారు. దీక్షలను రిటైర్డ్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి ప్రారంభించగా వినయ్‌భాస్కర్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆంక్షలు లేని తెలంగాణ కావాలన్నదే ఇక్కడి ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. భద్రాచలంను విడదీయాలని కానీ మరో నిర్ణయం కానీ తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించా రు. అలాగే, హైదరాబాద్‌పై కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. విభజనలో అన్యాయం చేయొద్దు.. టీఎల్ఎఫ్ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాం బారి సమ్మారావు మాట్లాడుతూ ఈ నెలఖారులోగా రాష్ట్ర పునర్విభజన జరుగుతుందని ధీమా వ్యక్తం చేశా రు. దీక్షల్లో టీఎల్ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిరంజీవి, భీమినేని శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజిం గ్ సెక్రటరీ పొక్కుల సదానందంతో పాటు డాక్టర్ బొడ్డు రమేష్, పిట్ట వేణుమాధవ్, బ్రహ్మం, సదానందం, విజ య్‌కుమార్, బుర్ర గోవర్ధన్, శ్యాంయాదవ్, అస్నాల శ్రీనివాస్ దీక్షలో కూర్చోగా.. సంఘీభావం తెలిపిన వా రిలో టీఆర్ఎస్ నాయకులు కొరబోయిన సాంబయ్య, కె.వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు. -
మంత్రితో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే
వరంగల్: మంత్రి బసవరాజు సారయ్యతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వాగ్వాదానికి దిగారు. తన డివిజన్ లో సమస్యలు పరిష్కరించడంలో కుట్ర జరుగుతుందంటూ మంత్రిని నిలదీశారు. విలీన గ్రామాల సమస్యలను పరిప్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పోరేషన్ కార్యాలయాన్ని టీఆర్ఎస్ బుధవారం ముట్టడించింది. విలీన గ్రామాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించాలంటూ పట్టుబట్టడంతో అక్కడే ఉన్న మంత్రి బసవరాజు కలగజేసుకున్నారు. తన డివిజన్ లో సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన బసవరాజు, కమీషనర్ లతో మాటల యుద్ధానికి దిగారు. -
‘సమైక్య’ సభను అడ్డుకుంటాం
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఈ నెల 7న హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీఓలు నిర్వహించతలపెట్టిన సభను అడ్డుకొని తీరుతామని, సభ జరగనివ్వమని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. ముల్కి అమరవీరుల వారోత్సవాల ను పురస్కరించుకొని తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండలోకి కాళోజీ కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధావారం నాటికి మూడో రోజుకు చేరాయి. దీక్షలో కూర్చు న్న టీఎన్జీఓలకు ఎమ్మెల్యే సంఘీబావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 7వ తేదీన హైదరాబాద్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నా అనుమతివ్వని సర్కార్ ఏపీ ఎన్జీఓస్ సభకు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. సీఎం కిరణ్ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. కేసీఆర్ దీక్ష చేపడితే అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన ప్ర భుత్వం సీమాంధ్ర నాయకులు చేస్తున్న దీక్షలకు ఎలాంటి అడ్డంకులు కల్పించడం లేదన్నారు. సీమాంధ్ర యాత్రతో చంద్రబాబు అసలు నైజం బయటపడిందని, ఇప్పటికైనా తెలంగాణకు చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి ప్రజా ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. లేక పోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. బాబు సమైక్యాంధ్రకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో కూడి న తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకూ విశ్రమించేది లేదని చెప్పారు. దీక్షలలో టీఎన్జీఓల యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు కె.రత్న వీరాచారి, జి.రాంకిషన్, ఎ.సదానందం, కె.రత్నాకర్‌రెడ్డి, ఎల్.దాస్యానాయక్, ఎన్.ప్రభాకర్, ఈగ వెంకటేశ్వర్లు, హసన్, పుల్లూరి సుదాకర్, మాదవ రెడ్డి, కత్తి రమేశ్, విజయలక్ష్మి, రాజేందర్, సోమయ్య, లక్ష్మారెడ్డి, డి.శ్రీనివాస్ నాయక్, ధరంసింగ్తోపాటు 100 మంది ఉద్యోగులు కూర్చున్నారు. ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకోమని, తెలంగాణ భగ్గుమంటుందని అన్నారు. సీమాంధ్రుల పట్ల అప్రమత్తంగా ఉండి కుట్రలు తిప్పి కొడతామని చెప్పారు. టీఎన్జీఓల యూనియ న్ జిల్లా అధ్యక్షుడు కె.రాజేశ్‌కుమార్ మాట్లాడుతూ ముల్కి అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని గురువా రం దీక్షలతోపాటు అదే స్థలంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఇందులో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు మా ట్లాడుతూ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాసయ్యే వరకూ సంబురాలు చేసుకునేది లేదన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ తిరునహరి శేషు మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడీదారులు, నాయకులు దింపుడు కల్లం ఆశతో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు సీమాంధ్రు లు ఉద్యమం చేసిన కేంద్రం నిర్ణయంలో ఈసారి మార్పు ఉండదన్నారు.