ఓరుగల్లు నగరం పశ్చిమంలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వేసవి ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా తీవ్రంగా పెరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఇక్కడ పోటీ పడుతున్నదెవరు? వారి పరిస్థితేంటి?
వరంగల్ నగరం పశ్చిమ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పొలిటికల్ వార్ జరుగుతోంది. దాస్యం వినయ్‌భాస్కర్ అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించిన వినయ్‌భాస్కర్ ఐదో సారి కూడా గులాబీ జెండా ఎగరేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి కూడా గెలిచేది నేనే అంటూ ధీమాగా ఉన్నారాయన. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగుతానంటున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఎలాగైనా ఈసారి దాస్యంకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. నాలుగుసార్లు గెలిచి నగరానికి ఏం చేశావని ఐదోసారి గెలిపించాలని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళుతున్నారు నాయిని.
తొలినుంచీ ఉత్తర దక్షిణ ధృవాలుగా కొనసాగుతున్న దాస్యం వినయ్‌భాస్కర్, నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా..వీరి అనుచరులు కూడా అదే రేంజ్‌లో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. కరపత్రాలు, ప్లెక్సీ పోస్టర్లతో రాజకీయ విమర్శలు చేసుకుంటూనే..ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దాస్యం వినయ్ భాస్కర్ పై చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్‌కు హనుమకొండ బిఆర్ఎస్ ముఖ్యనాయకులు ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
చదవండి: ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్.. హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందా?
కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు సైతం వాగ్ధాటి పెంచారు. ప్రజల సమస్యలు పరిష్కరించి..అభివృద్ధి చేస్తాడని దాస్యంను గెలిపిస్తే ఎమ్మెల్యేగా చేసింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూకబ్జాలు, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకుంటూ అభివృద్దిని గాలికొదిలేసి వచ్చిన అభివృద్ధి నిధులను ఖర్చు చేయలేని నిస్సహాయ స్థితికి చేరారని ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్ సెల్ కు వచ్చే ఫిర్యాదుల్లో 70శాతం బిఆర్ఎస్ నేతల భూ కబ్జాలపైనే ఉంటున్నాయని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ తరపున నాయిని రాజేందర్ రెడ్డి బరిలో నిలబడితే గులాబీ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ ఓడిపోవడం ఖాయమంటూ ప్రచారం సాగిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీల తరుపున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేది తామే అటు దాస్యం, ఇటు నాయిని చెప్పుకుంటున్నారు. ఎవరికి వారే ఎదుటి వారి లోపాల్ని ఎత్తి చూపుతూ..పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దాదాపు సమానంగా వచ్చినట్లు సమాచారం. సర్వే తర్వాతే ఇరువురు నేతలు పోటీపడి విమర్శలు గుప్పించుకుంటూ..ప్రజాబలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ప్రత్యర్థిని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలడంలేదని చెబుతున్నారు.
చదవండి: గులాబీ బాస్‌నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్‌ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది?
Comments
Please login to add a commentAdd a comment