రావు పద్మ, నాయిని రాజేందర్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్
సాక్షి, వరంగల్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయా పార్టీల ప్రెసిండెట్లు తలపడుతుండగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్షా.. అంటారో అనే విషయంలో ఆయా పార్టీల నేతలతోపాటు ఓటర్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నాలుగు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నుంచి విజయం సాధించి, ఐదో విజయం కోసం ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలిసారి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకుని అసెంబ్లీలో అడుగిడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఐదో విజయం కోసం దాస్యం వినయ్ భాస్కర్..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఐదో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉద్యమకారులకు అండగా నిలవడం, ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు ఉండడం, నిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వినయ్ భాస్కర్‌కు కలిసొచ్చే అంశాలు.
ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బబ్దిదారులతో పాటు నియోజకర్గంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించారు. కార్మికులకు సొంతగా ప్రీమియం చెల్లించి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించి బీమా సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ నెల 28న నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ రావడంతో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు.
మొదటిసారి శాసనసభకు నాయిని రాజేందర్ రెడ్డి పోటీ..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి మొదటిసారి శాసన సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడిన సమయంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడి ఈసారి టికెట్ సాధించారు. 2014, 2018లో పార్టీ టికెట్ ఆశించారు.
ఆ రెండు సార్లు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నాలుగు పర్యాయాలుగా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత నాయిని రాజేందర్ రెడ్డికి అనుకూలించే అంశాలు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జార్ఖండ్ సీఎం బూపేష్ భఘేల్, సినీ నటి విజయ శాంతి చేసిన ప్రచారం తనకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసంతో ఉన్నారు.
'పద్మ' విశసించేనా..!?
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రావు పద్మ, పశ్చిమ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, రావు పద్మ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ అశించి చివరకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు.
వరంగల్ మహానగరంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ, అమ్మత్, హృదయ్ పథకాల ద్వారా జరిగిన అభివృద్ది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న అసంతృప్తి, కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్, వ్యాగన్ తయారీ పరిశ్రమ మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీకి ప్రజాదరణ ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, మహిళల ఓట్లు వంటివి రావు పద్మకు కలిపోచ్చే అంశాలు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ రాక, బీజేపీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి, మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, ఇతర అగ్ర నాయకుల ప్రచారం చేయడం వల్ల రావు పద్మ తాను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు.
ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
Comments
Please login to add a commentAdd a comment