వినయ్‌భాస్కర్‌ను ఎత్తుకున్న కార్యకర్తలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కు మరోమారు పెద్దపీట వేశారు. ఇటు శాసనసభ.. అటు శాసనమండలిలో కీలకమైన పదవులకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు కట్టబెట్టారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించారు. అలాగే, శాసనమండలిలో విప్‌గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లును కూడా చీఫ్ విప్‌గా నియమించారు. ఈనెల 9 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చీఫ్ విప్‌తో పాటు ఆరుగురు విప్‌లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్‌కు, మండలిలో చీఫ్ విప్‌గా బి.వెంకటేశ్వర్లుకు స్థానం దక్కింది.
వరుస విజయాలు
వరంగల్ జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌తో పాట సీఎం కేసీఆర్‌కు విధేయత, విశ్వసనీయతతో మెలిగిన వినయ్‌భాస్కర్‌కు కీలక పదవి దక్కింది. టీఆర్‌ఎస్ ఏర్పాటు నుంచి ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న వినయ్‌భాస్కర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. 2004లో హన్మకొండ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి మందాడి సత్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయిన వినయ్‌భాస్కర్.. ఆ తర్వాత వ రుస విజయాలు సాధించారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి 2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2015 జనవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి పదవి ఆశించిన వినయ్‌కు అప్పుడు అవకాశం దక్కకపోగా, ఈసారి ప్రభుత్వ చీఫ్ విప్‌గా కేసీఆర్ ఆవకాశం కల్పించడం విశేషం.
‘మండలి’లో చీఫ్ విప్‌గా వెంకటేశ్వర్లు
శాసనమండలిలో విప్‌గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లు ఈసారి చీఫ్ విప్‌గా పదోన్నతి కలిగింది. ఆరు నెలల క్రితం ఉపాధ్యాయుల నియోజకవర్గం స్థానానికి జరిగిన ఎన్నికల్లో శాసనమండలి ఎన్నికల్లో చీఫ్ విప్‌గా ఉన్న సుధాకర్ రెడ్డి ఓడిపోయిన విషయం విదితమే. దీంతో ఆ స్థానంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లును నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
కేటీఆర్, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తా
ప్రభుత్వ చీఫ్ విప్‌గా సిఫారసు చేసిన కేటీఆర్, ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ కోసం వారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమంలో పని చేసిన నాకు సముచిత స్థానం కల్పించారు. నాకు దక్కిన ఈ పదవికి వన్నే తెచ్చేలా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవహరిస్తాను. మొదటి నుంచి పార్టీకి వినయ విధేయతలతో ఉన్నాను. ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ఆదేశాలతో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేశాం.
వరంగల్ టౌన్ ప్రెసిడెంట్‌గా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశా. కార్పొరేటర్‌గా నా డివిజన్ అభివృద్ధికి, ఎమ్మెల్యేగా ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గం అభివృద్ధికి పనిచేశా. అంకితభావంతో, పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్న నా పేరును ప్రభుత్వ విప్‌గా సిఫారసు చేసిన కేటీఆర్‌కు, ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు, మిత్రపక్షాలను కలుపుకుపోతూ కృషి చేస్తా.
– దాస్యం వినయ్‌భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment