
మాట్లాడుతున్న దాస్యం వినయ్‌భాస్కర్
సాక్షి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తన విజయం తథ్యమని తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. శనివారం హన్మకొండ నయీంనగర్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడారు. కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా కుటుంబ సభ్యుల్లా, సమన్వయంతో పని చేశామన్నారు. గత మూడు నెలలుగా అహర్నిశలు కృషి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు వినయ్‌భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ముందున్నామన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 58.2 శాతం పోలింగ్ అయిందన్నారు. ఎప్పటి లాగానే తాను ప్రజల మధ్యన ఉంటానన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖాముఖి, ప్రతి శనివారం అడ్డా ములాఖత్, ప్రతి ఆదివారం అపార్ట్‌మెంట్ దర్శన్, కాలనీ విజిట్ కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ నల్ల స్వరూపరాణిరెడ్డి, నాయకులు సుందర్‌రాజు, నల్ల సుదాకర్‌రెడ్డి, వెంకట్రాజం, చాగంటి రమేష్ టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment