'పొన్నాల ఉతికేస్తున్నాడు...కడిగేస్తున్నాడు'
హైదరాబాద్ : సాధ్యంకాని వాగ్ధానాలు ఇవ్వటం వల్లే టీఆర్ఎస్ గెలిచిందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ తెచ్చినందుకు ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించలేదని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదని కేసీఆర్ స్వయంగా మెదక్ జిల్లా నర్సపూర్ సభలో ఒప్పుకున్నారని జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్కార్ ఇచ్చిన హామీల అమలు విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే....కేసీఆర్ను ఉతికేస్తూ...కడిగేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ తీరు వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఇది తెలంగాణకే నష్టమని అన్నారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ భవిష్యత్లో బీజేపీతో జత కడుతుందని, మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పొత్తు కోసం టీఆర్ఎస్ ప్రయత్నించిందన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి సిద్ధాంతం ఉండదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా రాజకీయ కవలలుగా జైపాల్ పేర్కొన్నారు. మోడీ చెప్పిన అంశం కాకుండా, అమిత్ షా చర్యలబట్టే ప్రధాని తీరు అర్థం చేసుకోవాలన్నారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న రూ.85 లక్షల కోట్ల నల్లధనాన్ని మూడు నెలల్లో స్వదేశానికి తెప్పిస్తామన్న మోడీ, రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. నల్లధనం వెనక్కి తెచ్చే అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా తనకు తెలియదనటం విడ్డూరమన్నారు. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు.