'బంగారు తెలంగాణకు కాంగ్రెస్సే పునాదులు వేసింది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్లో 68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను పొన్నాల ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా... ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒడిపోయిందని ఆయన విశ్లేషించారు.
బంగారు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే పునాదులు వేసిందని పొన్నాల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులను టీఆర్ఎస్ పార్టీ కొనసాగించలేకపోతుందని విమర్శించారు. అదికాక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టి రాజకీయాలే కేంద్రంగా పని చేస్తూ... ప్రజల ఆశయాలకు గండి కొడుతుందని పొన్నాల ఆరోపించారు.