ఆర్‌బీఐ హక్కులు హరిస్తే సంక్షోభం
వైవీ రెడ్డి ‘నా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణలో జైపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యమంటే అర్థం.. స్వతంత్ర సంస్థల హక్కులను హరించడం కాదని, వాటిని కాపాడటమేనని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఆర్‌బీఐ స్వేచ్ఛని రాజకీయ నాయకులు హరిస్తే సంక్షోభం సంభవిస్తుందన్నారు. శుక్రవారం విద్యారణ్య పాఠశాలలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ యాగా వేణుగోపాల్‌రెడ్డి ఆత్మకథ ‘నా జ్ఞాపకాలు’ పుస్తకాన్ని జైపాల్ ఆవిష్కరించారు. ఆర్థిక సంస్కరణ లెప్పుడూ పేదవాడి పక్షమే వహించాలని భావించి, ఆచరించిన ఆర్థికరంగ నిపుణుడు వైవీ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఆర్‌బీఐలో కొత్త ఒరవడి, నూతన ప్రమాణాలకు అంకురార్పణ చేసిన వైవీ రెడ్డి కృషిని దేశం యావత్తు కొనియాడిందన్నారు.
ఆర్థికాభివృద్ధిని సాధించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం రెండు భిన్నమైన విషయాలను ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహించిన ఘనుడన్నారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కీలకమైన నిర్ణయాలు చేసి, వాటిని అమలు చేశారన్నారు. ఈ పుస్తకం భవిష్యత్ ఆర్థిక రంగ నిపుణులకు ఉపకరిస్తుందన్నారు. వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ పుస్తకాన్ని కళ్లతో చదువుతూ, హృదయంతో అనుభవించాలన్నారు. చట్టబద్ధంగా ప్రజలకు మంచి చేసే ఏ పనైనా ఆలస్యం చేయకూడదన్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, శాస్త్రవేత్త రామారావు తదితరులు పాల్గొన్నారు.