ఆరెస్సెస్.. బ్రిటిషోళ్ల ఏజెంట్
అది దేశం కోసం ఏనాడూ పోరాడలేదు: జైపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బ్రిటిషోళ్లకు ఏజెంట్ గా పనిచేసిన ఆరెస్సెస్ దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూపై విమర్శలు చేస్తూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పొగుడుతున్నారని, ఇది కుత్సిత రాజకీయ బుద్ధికి నిదర్శనమన్నారు. ఆరెస్సెస్, బీజేపీకి పటేల్‌పై ప్రేమాభిమానాలేమీ లేవన్నారు. నెహ్రూను నిందించడానికే పటేల్‌ను వాడుకుంటున్నారన్నారు. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గాంధీభవన్‌లో జైపాల్ విలేకరులతో మాట్లాడారు.
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నగరంలో నెహ్రూపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని, చరిత్ర తెలియకుండా మా ట్లాడారని అన్నారు. స్వాతంత్య్ర సమరంలోనూ, దేశాన్ని నడపడంలోనూ నెహ్రూ, పటేల్ ఇద్దరూ సమ ఉజ్జీలుగా పనిచేశారన్నారు. ఏ నిర్ణయమైనా కేబినెట్‌లో చర్చించి తీసుకున్నారని, అప్పటి కేంద్ర కేబినెట్‌లో డాక్టర్ రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, జయప్రకాశ్ నారాయణ, శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారని గుర్తు చేశారు. ‘‘నెహ్రూ, పటేల్ ఇద్దరూ మహాత్మాగాంధీకి ప్రియ శిష్యులు. క్విట్ ఇండియా సమయంలో ‘డూ ఆర్ డై’ పేరుతో ఉద్యమం చేపడితే కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఉద్యమించాయి. ఆరెస్సెస్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించింది’’ అని అన్నారు.
నెహ్రూను విమర్శించే అర్హత లేదు...
హైదరాబాద్‌లో పటేల్ పోలీసు యాక్షన్ చేపట్టారని, ఆయన ప్రధాని అయి ఉంటే కశ్మీర్ సమస్య కూడా ఉండేది కాదంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడం చరిత్ర తెలియకపోవడమేనని జైపాల్ అన్నారు. అప్పట్లో వీటో అధికారం ఉన్న దేశాలేవీ కశ్మీర్ విషయంలో భారత్‌కు మద్దతివ్వలేదని, అందుకే అక్కడ సైనిక చర్యకు దిగలేదని వివరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్‌లో గల్లీ లీడర్ అని, అలాంటి వ్యక్తికి దేశ చరిత్ర ఏంతెలుస్తుందని ప్రశ్నించారు. ‘‘ఆరెస్సెస్ ఎన్నడూ దేశం కోసం పోరాడలేదు. ఆ సంస్థ నాయకులు సావర్కర్, దేవరస్‌లాంటివారు స్వాతంత్య్రం కోసం జైలుకు పోలేదు. కాంగ్రెస్ నాయకులు దేశం కోసం పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గారు. నెహ్రూను విమర్శించే నైతిక అర్హత ఆరెస్సెస్‌కు, బీజేపీ నేతలకు లేదు. ఆర్‌ఎస్‌ఎస్ అంటేనే అబద్ధాలను ప్రచారం చేసే సంస్థ’’ అని విమర్శించారు.