
తెలంగాణ నిర్మాణంలో ఓయూ కీలకం
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ నిర్మాణంలో ఉస్మానియా వర్సిటీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మాజీ మంత్రి, ఓయూ పూర్వ విద్యార్థి జైపాల్‌రెడ్డి అన్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో ‘రోల్ ఆఫ్ ఓయూ ఇన్ తెలంగాణ అండ్ నేషన్ బిల్డింగ్’అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు, ఓయూ పూర్వ విద్యార్థి కె.కేశవరావు అధ్యక్ష త వహించగా, జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వందేళ్లుగా ఓయూలో చదివిన లక్షలాది మంది విద్యార్థులు చదువుతో పాటు నాయక త్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారని వివరించారు.
ఓయూ దేశానికి ఒక ప్రధానిని, ఏడుగురు ముఖ్యమంత్రులను, అనేక మంది నేతలను అందించిందన్నారు. ఓయూ విద్యార్థులు వందేమాతర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు. తాను 1958లో నిజాం కాలేజీలో, 1962లో ఆర్ట్స్ కళాశాలలో చదివి, 1965 నాటికి చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చినట్లు వివరించారు. భావజాలాలు వేరైనా ఆనాటి విద్యార్థులమంతా కలసిమెల సి ఐక్యంగా ఉండేవారమన్నారు. ఈ సందర్భంగా ఓయూలో తాను చదివిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. కార్యక్రమంలో వీసీ ప్రొ.రాంచంద్రం స్వాగత ఉపన్యాసం చేయ గా మాజీ వీసీలు ప్రొ.సులేమాన్ సిద్దిఖీ, ప్రొ.తిరుపతిరావు, ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, పద్మశ్రీ సయ్యద్ మహ్మద్ ఆరిఫ్, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, హన్స్ ఇండియా సంపాదకులు ప్రొ.నాగేశ్వర్, రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్‌రెడ్డి, సదస్సు కన్వీనర్ ప్రొ.జీబీ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.