కాంగ్రెస్ నేతలే ప్రజా కంటకులు
విపక్ష నేతలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నేతలే ప్రజా కంటకులని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. అధికారమే పరమావధిగా భావించి ఢిల్లీకే పరిమితమైన జైపాల్‌రెడ్డికి, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి జైపాల్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
సీఎం కేసీఆర్ ఎలా ప్రజా కంటకుడు అవుతారో జైపాల్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన వందిమాగధులు సాగిస్తున్న కుట్రల్లో భాగంగానే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సాధన పేరుతో పాదయాత్రలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ నేతలు తమ సిద్ధాంతాలను గాలికొదిలి దుష్టచతుష్టయంలా మారారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టులపై త్వరలోనే ప్రతిపక్ష పార్టీలకు బహిరంగ లేఖ రాస్తానని, వారికి దమ్ముంటే తాను అడిగే ప్రశ్నలకు సమధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్, బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య పాల్గొన్నారు.