హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుతో వార్తల్లోకి ఎక్కిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ కోసం ఇప్పుడు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని ఈ బృందం.. ప్రణీత్‌రావును విచారణ చేపట్టి.. ఆ వివరాలతో సహా ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావును మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఇక.. ఎస్‌ఐబీ లాగర్ రూమ్‌లో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్‌బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్‌కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్‌బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొనప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు కోసం శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడు.. ప్రణీత్‌రావు చేసిన నిర్వాకమిది!
మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్‌రావును హైదరాబాద్‌కు తరలించారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరమే ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
ఎస్‌ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై.. ఎస్‌ఐబీ అడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సైతం అయ్యింది. అంతకు ముందు.. ఆయన పోలీసుల అదుపులోనే రహస్య ప్రదేశంలో ఉన్నారని.. విచారణ జరుగుతోందన్న ప్రచారం నడిచింది. అయితే ప్రణీత్ రావు కోసం రెండ్రోజులుగా పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలోనే మకాం వేసినట్లు ఇప్పుడు తేలింది. ప్రణీత్‌రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం ప్రత్యేక టీం విచారణ చేపట్టే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment