సాక్షి, హైదరాబాద్: తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యారు. బుధవారం బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే అతనిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్ హనుమంతు తీరుపై టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. ఆయన తీరును తప్పుబడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయింది.
తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి ప్రణీత్ హనుమంతు మాట్లాడాడు. తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా తన స్నేహితులతో ఆయన మాట్లాడాడు. సాయి దుర్గ తేజ్ ఈ విషయాన్ని తెరపైకి తీసుకురావడంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు.
తాజాగా ప్రణీత్ హనుమంతును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్ హనుమంతును హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేశారు. ప్రణీత్‌తో పాటు అతని స్నేహితులలో మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment