గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో హరీశ్‌రావు, కవిత, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి
రాత్రి 8.30 గంటల తర్వాత విడుదల
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే సమాచారంతో ఆయన ఇంటికి వెళ్లిన మాజీమంత్రి
అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పీఎస్‌కు తరలించిన పోలీసులు
అనంతరం కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరుల అరెస్టు
కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు, జగదీశ్‌రెడ్డి రాయదుర్గం పీఎస్‌కు తరలింపు
హరీశ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతల బైఠాయింపు
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో ఉద్రిక్తత
గచ్చిబౌలి/ బంజారాహిల్స్/ సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టుతో గచ్చిబౌలి ఠాణా అట్టు డికింది. పార్టీ మరో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే సమా చారంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్‌ను గచ్చిబౌలి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చిన మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పీఎస్‌కు తీసుకెళ్లారు. అయితే హరీశ్‌రావు అరెస్టుతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. మరోవైపు హరీశ్‌రావును పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల తరలిరావడం, భారీయెత్తున బలగాల మోహరింపుతో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో 50 మందికి పైగా నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాగా హరీశ్‌రావును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 వరకు పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పోలీస్‌స్టేషన్‌లో హరీశ్‌రావును పరామర్శించారు.
ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీస్ రాజ్యం
హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డిలను అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు..ఎమర్జెన్సీని తలపించేలా పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఫిర్యాదును తీసుకోని ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయం అని అన్నారు. తెలంగాణ సమాజం అణచివేతను సహించదని, తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.
ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిర్బంధించడం ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హమీలు అమలు చేయడం చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి, అక్రమ అరెస్టులతో గొంతులు మూయాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.
సీఐని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్‌రెడ్డి అరెస్టు
పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా అంతు చూస్తానంటూ బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్రను బెదిరించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. కొండాపూర్‌లోని కోలా లగ్జారియా విల్లాస్‌లో ఉంటున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డిలపై ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కౌశిక్‌రెడ్డి..తనతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా పోలీసు వాహనానికి తన కారును అడ్డుగా పెట్టి విధులకు ఆటంకం కలిగించారని ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.
దీంతో బీఎన్‌ఎస్ సెక్షన్లు 57, 126 (2), 127 (2), 132, 224, 333, 451 (3), 191 (2) రెడ్‌విత్ 190, 3(5) కింద కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. ఉదయం ఇంట్లో ఉన్న కౌశిక్‌రెడ్డి బయటకు రాకపోవడంతో, తమకు సహకరించాలని లేనిపక్షంలో తామే బలవంతంగా లోపలికి రావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆయన తలుపులు తీశారు. అప్పటికే లోపల ఉన్న హరీశ్‌రావును తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన కానును సీజ్ చేశారు.
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్, సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పరామర్శించారు. కౌశిక్‌రెడ్డి అరెస్టు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రాకేష్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసిన పోలీసులు రాయదుర్గం, నార్సింగి పీఎస్‌లకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment