
మోదీ.. సాగిలపడి క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి డిమాండ్
సాక్షి, మహబూబ్‌నగర్ : నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా.. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. నోట్ల రద్దు వల్ల 50 రోజుల తర్వాత స్వర్గతుల్యంగా ఉంటుందని యావత్ దేశాన్ని మోసగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సాగిలపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, జి.చిన్నారెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని కనీస ఆర్థిక పరిజ్ఞానం లేకుండా 125 కోట్ల మంది ప్రజానీకాన్ని కష్టాల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు.
నల్లధనం క్యాష్‌రూపంలో కేవలం 6 శాతం మాత్రమే ఉం దని.. మిగతా 94 శాతం భూలావా దేవీలు, బంగారం రూపంలో ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కేవలం 6 శాతం కోసం కోట్లాది మందిని రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిప్పారన్నారు. నోట్లరద్దును వ్యతిరేకిస్తున్నట్లు పత్రికలకు లీకులిచ్చి కథనాలు రాయించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలసి వచ్చిన తర్వాత భజన చేయడం ప్రారంభిం చారని జైపాల్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఇద్దరి మధ్య జరిగిన రహస్య మంతనాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.