
సాక్షి, హైదరాబాద్: వీపీసింగ్ ప్రధానిగా ఉండగా మండల్ కమిషన్ సిఫార్సుల విషయంలో ప్రముఖ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ కృషి మరువలేనిదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. ఎమెస్కో ప్రచురించిన పీఎస్ కృష్ణన్ జీవిత చరిత్ర ‘సామాజిక న్యాయ మహాసమరం’తెలుగు అనువాదాన్ని జైపాల్‌రెడ్డి సోమాజిగూడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఆదివారం ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణకర్త ఎమెస్కో విజయ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల్ కమిషన్ సిఫార్సుల విషయంలో నాటి ప్రధాని వీపీ సింగ్ సంకల్పం ఏదైనా దానికి రాజ్యాంగబద్ధత కల్పించడంలో కృష్ణన్ కృషి ఎనలేనిదని, కృష్ణన్ వల్లనే ఎంతో ఉన్నతమైన ఉత్తర్వులు వెలువడ్డాయని గుర్తుచేశారు. రచయిత పీఎస్ కృష్ణన్ మాట్లాడుతూ.. తాను కొన్ని ఆదర్శాలు, ఆశయా ల సంఘర్షణతో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చానని, తనకు జన్మభూమి కేరళ అయితే, కర్మభూమి ఏపీ అని అన్నారు. ఈ పుస్తకంలోని అస్పృశ్యతాం శం పుస్తక ప్రచురణకర్తలకు సైతం అస్పృశ్యమైనదేనని, అయితే ఉన్నతాశయంతో పుస్తకాన్ని ప్రచురించిన విజయ్‌కుమార్‌కి, పుస్తక రచనకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన పాత్రికేయులు టంకశాల అశోక్, డాక్టర్ వాసంతీదేవికి కృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్ కృష్ణన్ భార్య శాంతా కృష్ణన్ తోడ్పాటుని అందరూ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కేఆర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్ శంకరన్ సహా అందరం పీఎస్ కృష్ణన్‌ని ఆదిగురువుగా భావించేవారమన్నారు.
ముస్లిం రిజర్వేషన్లలో కీలక పాత్ర
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్ ప్రముఖ పాత్ర వహించార ని కాకి మాధవరావు అన్నా రు. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఎస్‌ఆర్ శంకరన్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న వాళ్లు ఈ సమాజానికి, భవిష్యత్ తరాలకు తమ అనుభవాలను జీవితచరిత్రల రూపంలో అందించాల్సిన ఆవశ్యకతను సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి గుర్తుచేశారు. పీఎస్ కృష్ణన్ పుస్తకం ఆవిష్కరణకు ఇది అత్యంత కీలక సమయమని సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి వసంత కన్నాభిరాన్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ కల్పనా కన్నా భిరాన్, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, మాజీ ఐఏఎస్ అధికారి టీఎల్ శంకర్, చక్రవర్తి, జయప్రకాశ్ నారాయణ్, విద్యాసాగర్‌రావు, ఐఏఎస్ అధికారి మురళి, జ్యోతి బుద్ధప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment