ఓటమి భయంతోనే కేసీఆర్ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అవాస్తవాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ నిగ్రహం కోల్పోతే సీఎం కేసీఆర్‌కే నష్టమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి హెచ్చరించా రు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతో వణికిపోతూనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని అందరికీ అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అబద్ధాలతో, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి సీఎం స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. ‘‘కేంద్ర మంత్రి పదవిని పట్టుకుని నేను వేలాడినట్టుగా, తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నట్టుగా కేసీఆర్ చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. నేను మంత్రి పదవిలో లేకుంటే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వచ్చేది కాదు.
హైదరాబాద్ నుంచి రూ. 25 వేల కోట్ల రెవెన్యూ తెలంగాణకు అందేది కాదు. ఫిబ్రవరి 18న బిల్లును ఎలా ప్రవేశపెట్టాలో, బిల్లును ఎలా నెగ్గించుకోవాలో స్పీకర్‌తో కలసి నేను చేసిన వ్యూహం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది. సీమాంధ్ర మంత్రులు, అప్పటి సీఎం, సీమాంధ్ర నేతలు ఆ బిల్లు నెగ్గకుండా ఎన్నో కుట్రలు చేసినా.. నేను కేంద్రమంత్రిగా ఉంటూ వాటిని తిప్పికొట్టడం వల్లే బిల్లు ఆమోదం పొందింది. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు’’ అని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్ కుటుంబంతో సహా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను కలసిన తర్వాత నన్ను కూడా కలిశారని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌లో చేరాలని తాను కేసీఆర్‌ను కోరానని, కేసీఆర్ కూడా అందుకు వ్యతిరేకత చూపలేదని చెప్పారు. 2009లో దీక్షకు దిగిన కేసీఆర్ రెండోరోజే ఎందుకు విరమించారని జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు. దీక్షను విరమిస్తూ పళ్ల రసం తాగడంతో కేసీఆర్‌పై మండిపడుతూ విద్యార్థులు, యువకులు ఉద్యమంలోకి దిగారని, దిష్టిబొమ్మలను దహనం చేశారని గుర్తుచేశారు. దానికి భయపడే కేసీఆర్ దీక్షను కొనసాగించారన్నారు. కేసీఆర్ దీక్షలోని మర్మమేమిటో తమకు తెలిసినా... ఉద్యమాన్ని, తెలంగాణను పలుచన చేయకూడదనే దానిపై ఇప్పటిదాకా మాట్లాడలేదని జైపాల్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ బండారం బయటపెట్టకపోవడం తమ అసమర్థతో, చేతకానితనమో కాదన్నారు. కేసీఆర్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడాల్సి ఉంటుందని, కానీ కేసీఆర్ స్థాయికి తాము దిగజారబోమని వ్యాఖ్యానించారు. నిగ్రహం కోల్పోయి మాట్లాడితే కేసీఆర్‌కే నష్టమని హెచ్చరించారు.
సీఎం పదవి తీసుకోలేదు
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా పనిచేయాలని అధిష్టానం నుంచి తనకు సూచనలు అందాయని జైపాల్‌రెడ్డి తెలిపారు. కానీ తెలంగాణకు చెందిన తనకు సీఎంగా అవకాశమిచ్చి తెలంగాణ ఏర్పాటును ఆపుతారేమోననే ఆందోళనతో ముఖ్యమంత్రి పదవిని తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ రాకుంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా తనకు కూడా నష్టం కలుగుతుందనే ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత అంశాలను బయటపెట్టి తన స్థాయిని దిగజార్చుకోలేనని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిగ్రహం కోల్పోయి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాను అప్పుడూ, ఇప్పుడూ జాతీయవాదినేనని... జాతీయవాదం వేరు, తెలంగాణ వాదం వేరని జైపాల్‌రెడ్డి చెప్పారు.