అలుపెరగని రాజకీయ యోధుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి (77) కన్నుమూయడంతో ఆ పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. జాతీయ
రాజకీయాల్లో విశిష్ట గుర్తింపు పొందిన ఈయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై చెరగని ముద్ర వేసుకున్నారు. సుమారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలోని ప్రస్థానాన్ని జిల్లా నేతలు నెమరువేసుకున్నారు.
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జైపాల్‌రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో అదే పార్టీతో విభేదించి జనతా పార్టీలో చేరారు. తొలిసారిగా 1980లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగి అప్పటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరాగాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోనే చేరారు.
జిల్లాపై చెరగని ముద్ర
జాతీయ రాజకీయాల్లో విశిష్ట గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేసుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో స్థానిక సంస్థల నుంచి ఎంపీ వరకు ఏ ఎన్నికలయినా తాను నిశ్చయించుకున్న వారికే టిక్కెట్లు వచ్చేలా చక్రం తిప్పారు. తనను నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించారు. ఈ క్రమంలో నాలుగేళ్ల నుంచి సొంత పార్టీకి చెందిన జిల్లా నేతల నుంచే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఎమ్మెల్యే.. ఎంపీగా ఇక్కడ్నుంచే ప్రస్థానం
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగి.. కేంద్రంలోనూ తనదైన ముద్ర వేసుకున్న జైపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఉమ్మడి జిల్లా నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలిసారిగా 1969లో ఉమ్మడి జిల్లా పరిధిలోని కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన అప్పటి ఎస్.ఎస్.పి. అభ్యర్ధి బి.ఎస్.రెడ్డిపై 4,178 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించిన జైపాల్‌రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన ఇతర సెగ్మెంట్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో 1984లో జనతా పార్టీ నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్‌పై 80,103 ఓట్లతో గెలిచారు.
ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి
సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన జైపాల్‌రెడ్డి ఈ ఏడాది మార్చి 25న.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. అనారోగ్యం.. పై బడ్డ వయస్సే తన ఈ నిర్ణయానికి కారణమన్నారు. ఈ ప్రకటన.. కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
1965 నుంచి 2009 వరకు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మాడ్గుల (ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలిసింది) కు చెందిన సూదిని జైపాల్‌రెడ్డి.. 1942 జనవరి 16న అమ్మమ్మ ఊరైన నల్లగొండ జిల్లా చందూరు మండలం నెరమెట్టలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాపుచ్చుకున్న ఆయన విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగారు. రెండుసార్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965 నుంచి 71 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1969–72 పీసీసీ జనరల్ సెక్రటరీగా, 1969–83 వరకు వరుసగా నాలుగుసార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలుపొందారు. 1990–98 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
1991–92 జూన్‌లో రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు. 1999–2000లో సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి చైర్మన్‌గా సేవలందించారు. 1999, 2004లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2005 వరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా, 2006లో పట్టణాభివద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో చేవేళ్ల నుంచి ఎంపీ గెలుపొంది కేంద్రపట్టణాభివద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన జైపాల్‌రెడ్డి దక్షిణ భారతదేశంలోని యువ పార్లమెంటేరియన్లలో ప్రథముడిగా గుర్తింపు పొందారు. ఐకె గుజ్రాల్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. మన్మోహన్‌సింగ్ హయాంలో పెట్రోలియం, కేంద్ర పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖలకు మంత్రిగా పని చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర
జైపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. అదే సమయంలో ఆంధ్రాలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించిన అధిష్టానం అదే నెల 24న తెలంగాణ ఏర్పాటు ప్రకటనను ఉపసంహరించుకుంది. దీంతో ఇక్కడా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది.
అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉద్యమకారులు దాడులకు దిగారు. అధిష్టానం తీసుకున్న యూ టర్న్ నిర్ణయంపై కలతచెందిన జైపాల్‌రెడ్డి రాష్ట్రానికే పెద్ద దిక్కుగా ఉన్న హోదాలో తెలంగాణ ఎంపీలందరితో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు నిర్వహించారు. అధిష్టానానికి తెలంగాణవాదం బలంగా వినిపించేలా కృషి చేశారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను సోనియాగాంధీకి వివరించి చివరకు ప్రకటన చేయించుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు తొలి సీఎం జైపాల్‌రెడ్డి అని కాంగ్రెస్‌లో జోరుగా చర్చలు కొనసాగాయి. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. ఈ ఏడాది మార్చి 25న ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికారు.
Comments
Please login to add a commentAdd a comment