ఇప్పుడు సిగపట్ల సీన్
కాంగ్రెస్‌లో సార్వత్రిక ఫలితాలకు ముందే వర్గాల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకూ ఆధిపత్యం కోసం వేరు కుంపట్లు పెట్టుకున్న ‘పెద్దలు’ ఇప్పుడు బాహాటంగానే ఫిర్యాదుల పర్వానికి తెరతీశారు. ఇక ఫలితాల తర్వాత ఎలా ఉంటుందన్నది ఊహించుకొని ఆ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. తమ నేతల తీరుకు విస్తుపోతున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకే కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ తనకు జరుగుతున్న వెన్నుపోటు వ్యవహారాన్ని చెప్పి చర్యలకు పట్టుపడుతున్నారు. మరికొందరు అరుణ వర్గీయులు తమను దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి సీనంతా సిగపట్లకు చేరుకుంది.
సాక్షి ప్రతినిధి, మహ బూబ్‌నగర్ :ఎన్నికలు ముగిసినా కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గపోరు మాత్రం రోజు రోజుకూ ముదురుతోంది. ఎన్నికల్లో సహకరించని నేతలపై సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటికే టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేల గుంభనంగా సాగిన విభేదాలు పిర్యాదుల పర్వంతో ప్రస్తుతం పార్టీ పరువు రచ్చకెక్కుతోంది. విచారణ పేరిట పీసీసీ క్రమశిక్షణ సంఘం ఇప్పటికే కొందరు నేతలపై వేటు వేసి, మరికొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12, 13, 16తేదీల్లో జరిగే ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పార్టీ రాజకీయాలను రక్తి కట్టించే సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్, స్తానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గానికి వారే పరిమితమై కాంగ్రెస్ నేతలు పనిచేశారు. అయితే సాధారణ ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు చేసి భంగ పడిన నేతలు ప్రచారం, పోలింగ్ పర్వంలో తమ ప్రతాపం చూపారు.
టికెట్ దక్కని కొందరు నేతలు నామినేషన్లు ముగిసిన వెంటనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నామ్ కే వాస్తేగా పార్టీలో కొనసాగినా అధికారిక అభ్యర్తులకు సహాయ నిరాకరణ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తిరిగి జిల్లా రాజకీయాల్లో అడుగు పెట్టడం కాంగ్రెస్‌లో నిద్రాణంగా వున్న గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లైంది. మంత్రి డీకే అరుణ తన వర్గీయులకు టికెట్ల కోసం పట్టుబట్టి సాధించుకోవడం కూడా విభేదాల తీవ్రతను పెంచింది. కొడంగల్, మక్తల్, షాద్‌నగర్, జడ్చర్లలో టికెట్ దక్కని కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. కల్వకుర్తిలో టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కొల్లాపూర్‌లో టికెట్ దక్కని విష్ణువర్దన్‌రెడ్డి పార్టీ అధికారిక అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
షోకాజ్‌లతో మరింత దూరం
సొంత పార్టీ నేతలే సహకరించలేదంటూ పార్టీ అభ్యర్థుల ఫిర్యాదు మేరకు టీపీసీసీ కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కల్వకుర్తిలో జైపాల్‌రెడ్డి సోదరుడు రాంరెడ్డి, కొల్లాపూర్‌లో విష్ణువర్దన్‌రెడ్డి నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. తనకు జైపాల్‌రెడ్డి సహకరించడం లేదంటూ కల్వకుర్తి అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఏకంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పిర్యాదు చేశారు.
స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలుకిన జైపాల్‌రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలంటూ వంశీచంద్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు తమకు సహకరించని డీకే అరుణ వర్గీయులపైనా చర్యలు తీసుకోవాలంటూ జైపాల్‌రెడ్డి వర్గీయులు పీసీసీకి పిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీలో కీలక నేతలు ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకుంటుండటంతో పంచాయతీ పరిష్కరించలేక పీసీసీ క్రమశిక్షణ సంఘం తల పట్టుకుంటున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కకుంటే సొంత పార్టీ నేతల వల్లే ఓడి పోయామంటూ పీసీసీకి పిర్యాదు చేసేందుకు కొందరు అభ్యర్థులు సిద్దమవుతున్నారు. బూత్‌ల వారీగా పోలింగ్ వివరాలు విశ్లేషించుకుంటున్న అభ్యర్థులు ఓట్ల లెక్కింపు తర్వాత పిర్యాదుల అస్త్రానికి పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. షోకాజ్ నోటీసులతో నేతల మధ్య మరింత దూరం పెరుగుతుందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం నేతల మధ్య విభేదాలు టీ కప్పులో తుపానులా సమసి పోతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.