
మోదీకి జ్ఞానం పూజ్యం: జైపాల్
మాటలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ దొందూదొందే
హైదరాబాద్: ‘ప్రధాని నరేంద్రమోదీకి జ్ఞానం పూజ్యం (శూన్యం). అహంకారం పరిపూర్ణం. చరిత్ర తెలియని అజ్ఞాని మోదీ. ఆయన అధికార మదాందంతో వ్యవహరిస్తున్నారు’ అని కాంగ్రెస్ జాతీయ నాయకులు ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, నేతలు జి.వివేక్, శ్రవణ్, ఉద్దెమర్రి నర్సింహ్మారెడ్డితో కలసి గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తక్షశిల అనే నగరం పాకిస్తాన్‌లో ఉందనే విషయం తెలియకుండా బిహార్‌లో ఉందని చెప్పడం మోదీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
అలెగ్జాండర్‌కు గంగానది విషయ మే తెలియకున్నా, గంగానది ఒడ్డున ఓడించారని మోదీ చెప్పారన్నారు. మోదీకి చరిత్ర, భూగోళశాస్త్రం తెలియదని, ఇలాంటి అజ్ఞానిని ఎక్కడా చూడలేదన్నారు. మంచివక్తగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్‌ను మోదీ డమ్మీని చేశారని, మోదీకి రాజకీయ గురువుగా ఉన్న అద్వానీని మమ్మీగా మార్చేశారని జైపాల్ విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కి తెప్పించి, ప్రతీ పౌరునికి 15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామన్న మోదీ.. ఈ ఏడాదిలో ఎంత జమచేశారని ప్రశ్నించారు. రైతులకు భూములపై హక్కుల్లేకుండా తెచ్చిన భూసేకరణ చట్టానికి టీఆర్‌ఎస్ ఎలా మద్దతిచ్చిందని ప్రశ్నించారు. దీంతో రెండు పార్టీలూ రైతు వ్యతిరేక పార్టీలేనని తేలిపోయిందన్నారు. హామీలను అమలుచేయకుండా మోసం చేయడంలో అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం కేసీఆర్ దొందూదొందేనని వ్యాఖ్యానించారు.