బీజేపీతో అంటకాగే టీడీపీతో పొత్తా?
జైపాల్‌రెడ్డిపై మండిపడ్డ పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీతో వ్యతిరేకత ఏమీ లేదన్న కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులతో కలసి ఎన్నికల్లో పోటీచేస్తామని జైపాల్‌రెడ్డి ఎలా అంటారని పొంగులేటి ప్రశ్నించారు. పొత్తులపై మాట్లాడే అధికారం జైపాల్‌రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఇప్పుడు ఎవరితోనైనా పొత్తులెందుకని, అసలు ఈ చర్చే అసందర్భమన్నారు.
కేంద్రంలో బీజేపీతో అంటకాగుతున్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటామని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో పొత్తుల విషయం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. విధానపరమైన నిర్ణయాల గురించి జైపాల్‌రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. ప్రజల సమస్యలపై పోరాటంలో ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని, ఎన్నికల్లో పొత్తుల విషయంలో అనేక అంశాలు ముడిపడి ఉంటాయన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో బలహీనపరిచే విధంగా జైపాల్‌రెడ్డి మాట్లాడటం సరికాదని పొంగులేటి అన్నారు.