వారికి ఓటడిగే హక్కు లేదు
♦ టీఆర్‌ఎస్, బీజేపీ నేతలపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపాటు
♦ తెలంగాణ, ఏపీ సీఎంలు ప్రజలకు చేసిందేమీ లేదు
♦ రైతులకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు
♦16 నుంచి వరంగల్‌లో పార్టీ అధినేత జగన్ ప్రచారం
కాజీపేట రూరల్: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఇప్పటివరకు ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గద్దెనెక్కాక హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌కు, కేంద్రంలో బీజేపీకి వరంగల్ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు పాల్పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో విఫలమయ్యూరని దుయ్యబట్టారు. శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు భరోసా కల్పించారన్నారు. 2004 ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న టీడీపీ రైతులతో పాటు అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసిందని, ఆ రోజుల్లో వైఎస్ మండుటెండల్లో పాదయాత్ర చేసి ప్రజల దీవెనలతో సీఎం అయ్యూరన్నారు. వైఎస్ ఆశయాల సాధనే లక్ష్యంగా స్థాపించిన వైఎస్సార్‌సీపీకే ప్రస్తుత ఎన్నికలో ఓటడిగే హక్కు ఉందని అన్నారు. వరంగల్‌లో తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు గెలిపించాలని కోరారు. తెలంగాణ కేబినెట్‌లో స్థానం కల్పించకపోవడాన్ని మహిళలు గమనిస్తున్నారని తెలిపారు.
16 నుంచి 19 వరకు జగన్ ప్రచారం
వరంగల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు ప్రచారం నిర్వహిస్తారని పొంగులేటి తెలిపారు. 16న హైదరాబాద్ నుంచి జనగామకు చేరుకోనున్న జగన్.. పాలకుర్తి, జఫర్‌గఢ్, వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరు, హన్మకొండ మండలాల్లో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. 17న హన్మకొండ, ఆత్మకూరు, రేగొండ, భూపాలపల్లి, చెన్నరావుపేట, పరకాల మండలాల్లో, 18న హన్మకొండ, సంగెం, గీసుగొండ మండలాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. అదే రోజు హన్మకొండలో జగన్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. 19న హన్మకొండ, న యీంనగర్, కేయు క్రాస్‌రోడ్డు, కాజీపేట, మడికొండతో పాటు ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథ్‌పల్లి మండలాలలో జగన్ ప్రచారం చేస్తారని వివరించారు.
బ్రహ్మరథం పడుతున్న ప్రజలు: నల్లా
ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే రోజా పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. రోజా పర్యటనతో ఇతర పార్టీలకు భయం పట్టుకుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీలు శివకుమార్, గున్నం నాగిరెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, మతిన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్ పాల్గొన్నారు.