వలస ఎంపీలతో టీఆర్‌ఎస్‌కు చిక్కులు!
- ఫిరాయింపులపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్న పార్టీలు
- ఈ సమావేశాల్లోనే ఫిర్యాదు చేసే అవకాశం
- టీటీడీపీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నుంచి
- టీఆర్‌ఎస్‌లోకి ముగ్గురు ఎంపీల ఫిరాయింపు
- వలసలపై గుర్రుగా ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వం
సాక్షి, హైదరాబాద్ : ‘ఆపరేషన్ ఆకర్ష్’లో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకున్న అధికార టీఆర్‌ఎస్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యేలా ఉన్నాయి. ఎమ్మెల్యేల వలసలపై ఇబ్బందులు ఎదురుకాకుండా టీడీపీ, వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షాలను విలీనం చేసుకున్న గులాబీ దళానికి పార్లమెంటు సభ్యుల విషయంలో మాత్రం ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌లోకి ఈ ఏడాది ముగ్గురు ఎంపీలు ఫిరాయించడం తెలిసిందే. దీంతో తమ ఎంపీల ఫిరాయింపులపై వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వ చ్చినట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ ముందు చూపు లోపం
ఎమ్మెల్యేలకు గులాబీ కండువాలు కప్పుడంలో దూకుడుగా వ్యవహరించిన టీఆర్‌ఎస్ ఎంపీల విషయంలోనూ అదే తరహాలో వ్యవహరించడం వల్లే కొత్త చిక్కులకు అవకాశం ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తె లంగాణ టీడీపీకి చెందిన మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి సైతం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వం తనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకంటూ గుత్తా టీఆర్‌ఎస్ కండువా కప్పు కోలేదు. అయినా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరినట్లు రుజువు చేసే ఆధారాలను కాంగ్రెస్ సిద్ధం చేసుకుందని చెబుతున్నారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆయా పార్టీలు ఫిరాయింపు ఎంపీలపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ
రాష్ట్రంలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా గులాబీ గూటికి దగ్గరవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నాయకత్వం పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తోందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే జరిగిన వలసలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం స్థానిక బీజేపీ నేతలతో భేటీలో సీరియస్‌గానే మాట్లాడినట్లు చెబుతున్నారు. దీంతో లోక్‌సభ స్పీకర్‌కు ఫిరాయింపు ఎంపీలపై ఫిర్యాదులు అందితే చర్యలు తీవ్రంగానే ఉంటాయన్నది అంచనా. ఒకవేళ వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటే ముందే రాజీనామా చేయించాల్సి కూడా రావొచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎస్పీవై రెడ్డిని ఇదే తరహాలో చేర్చుకున్న అధికార టీడీపీ...తెలంగాణలో తమ పార్టీ ఎంపీ మల్లారెడ్డి వలసపై ఫిర్యాదు చేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.