అది టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యమే
♦ ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజం
♦ తెలంగాణ, ఏపీ సీఎంలకు భూమి పిచ్చి పట్టుకుంది: కొండా రాఘవరెడ్డి
♦ భూసేకరణ సవరణ చట్టంపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇద్దరు సీఎం లకు భూమి పిచ్చి పట్టుకుందని దుయ్య బట్టింది. ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం భూసేకరణకు అనుసరి స్తున్న విధానాలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 50–70 వేల కోట్ల నుంచి రూ. 2.44 లక్షల కోట్లకు పెరగడానికి ప్రాజెక్టుల నిర్మాణంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ జాప్యమే కారణమని ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు.
ఈ అంచనా వ్యయం రూ. 3.44 లక్షల కోట్లకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఇందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. సోమవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జీవో 123 మతలబు ఏమిటో, కేంద్ర భూసేకరణ చట్టం–2013 ఎందుకు వద్దో, రాష్ట్ర భూసేకరణ (సవరణ) చట్టం–2016 అవసరం ఏమిటో వివరిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా దీనిపై అర్థమయ్యేలా ప్రజలకు సీఎం కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు జీవో 123 ప్రకారం ఎంత భూమిని సేకరించారో వెల్ల డించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర భూసేక రణ చట్టం–2013కు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చట్టాన్ని తీసుకురావా ల్సిన అవసరమేమిటో చెప్పాలన్నారు. ప్రచారార్భాటాల కోసమే కేసీఆర్ ప్రభుత్వం శాసనసభ సమావేశాలను ఉపయోగించు కుంటోందని రాఘవరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో రూ. 23 వేల కోట్ల వరకు కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ. 11 వేల కోట్ల మేర మాత్రమే ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం, ఇతర అంశాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 75 వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా, కేవలం 5 వేల ఎకరాలే సేకరించినా ఆ ప్రాజెక్టు నుంచి 2018కల్లా నీరిస్తామని సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెద్ద ఎత్తున పెంచేసిన ప్రభుత్వం రైతులు, నిర్వాసితులకు రూ. 10–20 వేల కోట్ల వరకు పరిహారం చెల్లించేందుకు వెనకడుగు ఎందుకు వేస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితులంటే ప్రభుత్వానికి అంత కక్షసాధింపు ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ నేత నిలదీశారు.