కేసీఆర్‌ది మహా మోసం
- ఆ ఒప్పందాలు ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలు
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ కుదుర్చుకున్న ఒప్పం దం.. మహా మోసంతో కూడుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. తమ్మిడిహెట్టి బ్యారే జీ 152 మీటర్లకు కాక 148 మీటర్లకు తగ్గించి కేసీఆర్ ఒప్పందం చేసుకోవడం మోసంతో కూడుకున్న వ్యవహరమని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీని 102 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉండగా 100 మీటర్ల ఎత్తుకే ఒప్పందం చేసుకోవటం దారుణమన్నారు. ఈ రెండూ చారిత్రక ఒప్పందాలుగా కేసీఆర్ చెప్పటం సరైంది కాదన్నారు.
ఈ రెండింటిని కేసీఆర్ సర్కార్ చేసిన చారిత్రక తప్పిదాలుగా తమ పార్టీ భావిస్తోందని పేర్కొన్నారు. మార్చి 8న అంతా అయిపోయిందని మహారాష్ట్ర నుంచి వచ్చిన సీఎం కేసీఆర్, ఆయన భజన బృందం బేగంపేట్ విమానాశ్రయం నుంచి గుర్రాలు, ఒంటెలపై ఊరేగారని, ఇప్పుడు మళ్లీ అదే బేగంపేట్ విమానాశ్రయం నుంచి అదే రీతిలో సీఎంతో పాటు ఆయన భజన బృందం ఊరేగటం చూసి ప్రజలు విస్తుపోతున్నారని చెప్పారు. ప్రచార ఆర్భాటాలకు ప్రజాధనాన్ని నీళ్లల్లా ఖర్చు చేస్తున్నారని, ఆర్భాటాలుమాని ప్రజలకు మేలు చేసే పనిచేపట్టాలని సూచించారు. వర్షాలు లేక రైతులు విలవిలాడుతున్నారని, రైతులకు చేయాల్సిన 25 శాతం రూణమాఫీని ఒకేసారి చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాం డవం చేస్తోందని కేంద్ర జల సంఘం చెప్పిం దని, ప్రభుత్వం ఆ దిశగా ఏ చర్యలు తీసుకుంటుందో వివరించాలని డిమాండ్ చేశారు.
విగ్రహం తొలగింపుపై విచారణ జరపాలి
వైఎస్సార్ విగ్రహాలు ఉంటే ఆ మహానేత ప్రజల హృదయాల్లో అలాగే ఉండిపోతారని భయపడి టీడీపీ భావజాలం ఉన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని తొలిగించి నీటి లో వేశారని రాఘవరెడ్డి ఆరోపించారు. విగ్రహం ఉన్న ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.