‘ఫీజు’ చెల్లించే వరకు పోరు
- వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్
- 24న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
- పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: కోటి ఆశలు కల్పించి, అంతులేని హామీలు గుప్పించి, 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్ పార్టీ.. అతి తక్కువ కాలంలోనే అపఖ్యాతి మూటగట్టుకొందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ విమర్శించారు. మంగళవారం లోటస్‌పాండ్ వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల బలిదానాలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ పూటకో మాట.. పచ్చి అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని వాపోయారు. వైఎస్సార్ 23 జిల్లాల్లో సమర్థవంతంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కళాశాలలకు చెల్లించారన్నారు. తద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులు ఉన్నత చదువు అభ్యసించేందుకు అవకాశం కల్పించారన్నారు.
మహానేత వైఎస్సార్ అకాల మరణం తర్వాత అధికార పీఠం ఎక్కిన నలుగురు సీఎంలు వైఎస్సార్ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రం విడిపోతే మా బతుకులు బాగుపడతాయని ఆశలు పెట్టుకున్న విద్యార్థులను టీఆర్‌ఎస్ సర్కారు నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూ రూ. 1,35,000 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్.. విద్యార్థులకు రూ. 3,000 కోట్లు చెల్లించలేరా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఏటా 30 నుంచి 40 శాతం మాత్రమే చెల్లిస్తూ పోతే రాబోయే అకడమిక్ సంవత్సరంలో అది రూ.6,000 కోట్లకు చేరి, విద్యార్థుల చదువులే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.
శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో పోరాటం
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధల్ని దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తమ పార్టీ సమరానికి సిద్ధమైందన్నారు. ఈ నెల 24న నగరంలోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ శ్రేణులంతా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేంత వరకు పోరాటం ఆపమని అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24న చలో ఇందిరా పార్కు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో ఉదయం 11 గంటలకు ఆందోళన ప్రారంభమౌతుందన్నారు.