Central Land Acquisition Act
-
భూనిర్వాసితులపై మరో పిడుగు
సాక్షి, అమరావతి: రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకే ‘ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం–2018’ను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం లెక్కచేయడం లేదు. మరో అడుగు ముందుకేసి ‘ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం–2018’ నిబంధనల పేరుతో జీఓఎంఎస్ నంబరు 390 కింద సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులోని అంశాల పట్ల రెవెన్యూ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరికి, దగాకోరు విధానానికి ఈ జీవో ప్రత్యక్ష నిదర్శనమని చెబుతున్నారు. ‘కేంద్ర భూసేకరణ చట్టం–2013’ను రాష్ట్ర ప్రభుత్వం సవరించడమే కాకుండా, ఈ సవరణ 2014 జనవరి నుంచే వర్తిస్తుందంటూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమని అంటున్నారు. సర్కారు నియంతృత్వానికి నిదర్శనం ‘‘సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయించడం అన్యాయం. పరస్పర ఆమోదం పేరుతో కన్సెంట్ అవార్డు ప్రకటించడం సరైంది కాదు. సరస్పర ఆమోదం అనే పదం కాగితాల్లో బాగానే ఉంటుంది. భూసమీకరణ కింద భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతులను రాజధాని అమరావతిలో, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వం ఎలా వేధించిందో అందరికీ తెలుసు. కన్సెంట్ అంటే భవిష్యత్తులో జరిగేది ఇదే. అందుకే ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018ని ఉపసంహరించుకోవాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పాత తేదీ నుంచి ఈ చట్టం వర్తిస్తుందంటూ జీవో ఇవ్వడం ఏమిటి’’ అంటూ రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ‘కేంద్ర భూసేకరణ చట్టం–2013’ను సవరిస్తూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టరూపం దాల్చిన తర్వాత జీవో జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనికి విరుద్ధంగా ‘డీమ్డ్’ అంటూ 2014 జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొంది. ఇలా చేయడం సరికాదని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టుకు వెళతాం... కేంద్ర భూసేకరణ చట్టం–2013కు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా... ప్రజల వ్యక్తిగత జీవనానికి, జీవనోపాధికి విఘాతం కలిగేలా ఉన్నాయని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. కేంద్ర చట్టానికి 12 సవరణలు చేసి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018లోని అంశాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయాలని పేర్కొంటున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పెద్ద ఎత్తున లేఖలు రాయాలని, వీటిని ఆధారంగా చూపుతూ తాము ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళతామని పలువురు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. తక్షణమే ఉపసంహరించుకోవాలి: సీపీఎం కేంద్ర భూసేకరణ చట్టం–2013కు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. భూములు కోల్పోయే వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు నష్ట పరిహారాన్ని నిరాకరించేలా సవరణలు చేయడం దారుణమని మండిపడింది. ‘‘కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడం కోసమే చేసిన ఈ చట్ట సవరణలను సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సవరణ చట్టం 2014 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందంటూ జీవో ఇవ్వడం రైతుల భూములను బలవంతంగా గుంజుకోవడానికే. కేంద్ర చట్టంలో రైతులకు ఉన్న రక్షణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం సవరణల ద్వారా తొలగించింది. నిర్వాసితుల హక్కులను నిరంకుశంగా కాలరాసేందుకు పూనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా రైతులు, నిర్వాసితులు ఆందోళనలు చేపట్టాలి’’ అని సీపీఎం మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. -
ఇక భూములు లాక్కోవడమే!
సాక్షి, అమరావతి : భూ యజమానుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకునేందుకు మార్గం క్లియరైంది. విలువైన భూములను చౌకగా, బలవంతంగా లాక్కుని అస్మదీయులకు కట్టబెట్టి వాటాలు పంచుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు రూపొందించిన ఏపీ భూసేకరణ చట్ట సవరణ–2017కు ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఈ సవరణ వల్ల ఏపీలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, కొత్త రాష్ట్రమైన ఏపీకి ఇది ఏమాత్రం ఉపయుక్తం కానందున దీనిని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం పంపిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. కేంద్ర ప్రభుత్వం పంపిన మార్గదర్శకాలను కాలరాస్తూ మళ్లీ అవే సవరణలతో గత ఏడాది నవంబరులో అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం మళ్లీ కేంద్రానికి పంపింది. ఈ చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జరిగే నష్టాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతాధికారులను పంపించి.. రాష్ట్రంలో కొత్తగా 12 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తున్నామని, అందువల్ల ఈ భూసేకరణ చట్ట సవరణవల్ల ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదంటూ పదేపదే వివరించడం, పలుమార్లు లేఖలు రాయడం ద్వారా రాష్ట్రపతికి అనుకూల నివేదిక పంపించేలా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. 2013 కేంద్ర చట్టానికి తూట్లు ఇదిలా ఉంటే.. ఏపీ భూసేకరణ చట్టం–2017 సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ( భూసేకరణ చట్టం)–2013కు తూట్లు పొడించినట్లయింది. ఇప్పటివరకూ ఏ ప్రాంతంలోనైనా పారిశ్రామికీకరణ ఇతర అవసరాల కోసం భూమిని సేకరించాలంటే ఆ ప్రాంతంలో 80 శాతం మంది ప్రజల ఆమోదం తప్పనిసరని కేంద్ర భూసేకరణ చట్టం–2013 స్పష్టంగా పేర్కొంది. ఆమోదం లభించని పక్షంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టడానికి వీల్లేదు. దీనినే సామాజిక ప్రభావ అంచనా సర్వే తప్పనిసరి అని అంటారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ కింద భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటూ కోర్టుకెళ్లిన వారి గ్రామాల్లో ఈ సర్వే నిర్వహిస్తే 70 శాతం మందికి పైగా వ్యతిరేకిస్తారు. అందువల్ల ఇక్కడ భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యంకాదు. బహుళ పంటలు పండే ఈ భూములను ఎలాగైనా రాజధాని పేరుతో లాక్కోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి కేంద్ర భూసేకరణ చట్టం–2013కు సవరణలు తీసుకువచ్చింది. సవరణలతో వచ్చే నష్టాలివీ.. ఏపీ భూసేకరణ చట్టం–2017వల్ల భూయజమానులకు వివిధ రకాలుగా నష్టం జరుగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టే ప్రాజెక్టులు, రహదారులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ అవసరాలకు ఇకపై సామాజిక ప్రభావ మదింపు అంచనా అవసరంలేదు. నచ్చిన పారిశ్రామికవేత్తలకు విలువైన భూములను సేకరించి ఇవ్వొచ్చు. - ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే భూ యజమానులు ప్రేక్షకుల్లా మిగిలిపోవాల్సి వస్తుంది. - కలెక్టరు, ఇతర అధికారులు సంప్రదింపుల ద్వారా నిర్ణయించిన ధరే ఇక ఫైనల్. దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశంలేదు. ఉదాహరణకు.. రాజధాని అమరావతి కోసం భూములు ఇవ్వడానికి తిరస్కరించిన గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఎకరా అధికారిక ధర రూ.కోటి వరకు (మార్కెట్ ధర రూ.రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా) ఉందనుకుందాం. 2013 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం దీనికి రెండున్నర రెట్లకు పైగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సవరించిన చట్ట ప్రకారమైతే సంప్రదింపుల్లో నిర్ణయించిన ధరను రైతులు తప్పకుండా అంగీకరించాల్సిందే. తక్కువ ధరకే భూములు ఇచ్చేందుకు అంగీకరించినట్లు రైతుల నుంచి బలవంతంగా సంతకాలు సేకరించి భూములు తీసుకోవచ్చు. -
రాష్ట్ర చట్టం ప్రకారం భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో తీపి కబురు వినిపించింది. కేంద్ర భూసేకరణ చట్టం–2013 ప్రకారం పునరావాసం, పరిహారం నిబంధనలు అమలు చేశాకే ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాలంటూ కేంద్ర ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ (ఈఏసీ) కమిటీ గతంలో జారీచేసిన ఆదేశాల్లో మరిన్ని సడలింపులిచ్చింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2017 ప్రకారం భూసేకరణ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ డైరెక్టర్ కెరికెట్టా ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 18న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈఏసీ పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగానే పలు షరతులను విధించింది. వాటి ప్రకారం ప్రాజెక్టుకు ముంపు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున.. నిర్మాణ దశలో, నిర్మించిన తర్వాత వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను నివేదించాలి. అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్మెంట్ చేపట్టాలి. దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలి. ఘన వ్యర్థాల నిర్వహణ పక్కాగా ఉండాలి. ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయ విధానంతో రీసైక్లింగ్ చేయాలి. భూసేకరణ చట్టానికి అనుగుణంగా భూమిని కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలి. -
భూసేకరణ ‘చట్ట సవరణ’కు బ్రేక్!
⇒ చట్టంలో సామాజిక ప్రభావ మదింపు తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ ఆర్డినెన్సు జారీకి అనుమతివ్వని రాష్ట్రపతి ⇒ ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం లేదంటున్న అధికారులు ⇒ సర్కారు ఎత్తులు పారవంటున్న న్యాయ నిపుణులు సాక్షి, అమరావతి: కేంద్ర భూసేకరణ చట్టం–2013కు సవరణల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చట్ట సవరణ/ఆర్డినెన్సుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కేంద్ర భూసేకరణ చట్టంలోని అత్యంత ముఖ్యమైన సామాజిక ప్రభావ మదింపునకు తూట్లు పొడవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశం కనిపించడం లేదు. భూసేకరణవల్ల పర్యావరణ పరంగా, నిర్వాసితులకు సామాజికంగా, ఉపాధిపరంగా, ఆర్థికంగా కలిగే నష్టాలపై సామాజిక ప్రభావ మదింపు జరపాలన్న ఈ చట్టంలోని ప్రధాన నిబంధనను తొలగించాలని ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే సామాజిక ప్రభావ మదింపు నిబంధనను కేంద్ర భూసేకరణ చట్టం–13 నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్సు జారీ చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, హోంశాఖ ద్వారా వెళ్లిన ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించకుండా పక్కన పెట్టేశారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా ఆమోదించిన ఈ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై న్యాయ నిపుణులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికి బ్రేక్ పడ్డట్లే... ప్రస్తుతానికి కేంద్ర భూసేకరణ చట్టం–13 సవరణకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లేనని అధికారులు అంటున్నారు. ఈ చట్టం మూల లక్ష్యమైన సామాజిక ప్రభావ మదింపునకు తూట్లు పొడుస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించి కేంద్రానికి పంపడాన్నే నిపుణులు తప్పుబడుతున్నారు. ‘ఈ చట్ట సవరణకు ఆర్డినెన్సు అనే పేరు ఉచ్చరించాలంటేనే జుగుప్సాకరంగా ఉందని నేను గతంలో వ్యాఖ్యానించాను. న్యాయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉన్నారు’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అన్నారు. ‘ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టే అవకాశం లేదు. ఆర్డినెన్సు జారీకి కూడా రాష్ట్రపతి నుంచి ఆమోదం రాదు. దీంతో 2013 భూసేకరణ చట్ట సవరణ ప్రతిపాదన తాత్కాలికంగా ఆగిపోయినట్లే’ అని మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం త్వరలో ముగుస్తున్నందువల్ల ఆయన ఈ వివాదాం శాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరని కేంద్ర న్యాయ శాఖకు చెందిన అధికారి రాష్ట్ర అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మౌలిక సదుపాయాల కల్పన ముసుగులో పేదల భూములను బలవంతంగా లాక్కునేందుకే సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని ఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర సర్కారు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తోందని, అవసరమైతే న్యాయ స్థానం ద్వారానైనా దీనిని అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. -
అది టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే
♦ ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజం ♦ తెలంగాణ, ఏపీ సీఎంలకు భూమి పిచ్చి పట్టుకుంది: కొండా రాఘవరెడ్డి ♦ భూసేకరణ సవరణ చట్టంపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇద్దరు సీఎం లకు భూమి పిచ్చి పట్టుకుందని దుయ్య బట్టింది. ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం భూసేకరణకు అనుసరి స్తున్న విధానాలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 50–70 వేల కోట్ల నుంచి రూ. 2.44 లక్షల కోట్లకు పెరగడానికి ప్రాజెక్టుల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వ జాప్యమే కారణమని ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఈ అంచనా వ్యయం రూ. 3.44 లక్షల కోట్లకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఇందుకు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. సోమవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జీవో 123 మతలబు ఏమిటో, కేంద్ర భూసేకరణ చట్టం–2013 ఎందుకు వద్దో, రాష్ట్ర భూసేకరణ (సవరణ) చట్టం–2016 అవసరం ఏమిటో వివరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా దీనిపై అర్థమయ్యేలా ప్రజలకు సీఎం కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు జీవో 123 ప్రకారం ఎంత భూమిని సేకరించారో వెల్ల డించాలని డిమాండ్ చేశారు. కేంద్ర భూసేక రణ చట్టం–2013కు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చట్టాన్ని తీసుకురావా ల్సిన అవసరమేమిటో చెప్పాలన్నారు. ప్రచారార్భాటాల కోసమే కేసీఆర్ ప్రభుత్వం శాసనసభ సమావేశాలను ఉపయోగించు కుంటోందని రాఘవరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ. 23 వేల కోట్ల వరకు కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ. 11 వేల కోట్ల మేర మాత్రమే ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం, ఇతర అంశాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 75 వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా, కేవలం 5 వేల ఎకరాలే సేకరించినా ఆ ప్రాజెక్టు నుంచి 2018కల్లా నీరిస్తామని సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెద్ద ఎత్తున పెంచేసిన ప్రభుత్వం రైతులు, నిర్వాసితులకు రూ. 10–20 వేల కోట్ల వరకు పరిహారం చెల్లించేందుకు వెనకడుగు ఎందుకు వేస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితులంటే ప్రభుత్వానికి అంత కక్షసాధింపు ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ నేత నిలదీశారు. -
కేంద్ర భూసేకరణ చట్టాన్నే అమలు చేయాలి
ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ తెలంగాణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: నిర్వాసితులకు న్యాయం జరిగేలా కేంద్ర భూసేకరణ చట్టం–2013నే అమలు చేయాలని వైఎస్సా ర్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర భూసేకరణ(సవరణ) చట్టానికి కూడా జీవో 123 మాదిరిగా హైకోర్టులో చుక్కెదురయ్యే అవకాశముందని వ్యాఖ్యానించింది. జీవో 123 ద్వారా భూసేకరణ చేయవద్దని, ఒప్పందాలు చేసు కోవద్దని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గున్రెడ్డి రాంభూపాల్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. భూసేకరణ చట్టంపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని, ఇప్పుడు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. జీవో 123లో సామాజిక ప్రభావ అంశాలు, బాధితులకు పునరావాసం, పునర్నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోక పోవడం వల్లే ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. -
సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య నిరసన
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ, నాయకులపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిరసనకు దిగారు. గురువారం స్పీకర్‌కు లేఖను అందజేశారు. ఆ తర్వాత శాసనసభ ఆవరణ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. కేంద్ర భూసేకరణ చట్టం–2013ను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ చట్టంలోని ప్రమాదకరమైన నాలుగు అం శాలను తొలగించాలన్నారు. సీపీఎం నాయ కులు అసాంఘిక శక్తులని 2013 కేంద్ర చట్టం దిక్కుమాలినదని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. -
అడుగు గడప దాటకపోతే ఇక అంతే...!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యపై విపక్షాలుగా విడివిడిగా నిర్వహిస్తున్న ఉద్యమాలు ఆయా పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయట. కేంద్రంలో భూసేకరణ చట్టం 2013ను తీసుకొచ్చిన ప్రభుత్వంగా... ఆ తర్వాత బీజేపీ పాలనలో పార్లమెంట్లో ఆ చట్టానికి సవరణలు తెచ్చే ప్రయత్నాలను అడ్డుకున్న ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తోందట. అయితే రాష్ట్రంలో మాత్రం కేంద్ర భూసేకరణ చట్టం అమలయ్యేలా చూడడంలో జీవో 123ను అడ్డుకోవడంలో టీపీసీసీ ముఖ్యనేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడిని తేలేకపోతున్నారని ఆ పార్టీ నాయకులు తెగ వాపోతున్నారట. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలపై సీపీఎం, ఇతర పార్టీలు ముందుండి రిలే నిరాహారదీక్షలు, పాదయాత్రలంటూ జోరుగా నిరసనలతో ముందుకు సాగుతున్నాయని గుర్తుచేసుకుని లోలోపల బాధపడుతున్నారట. గాంధీభవన్ నుంచి ‘చలో మల్లన్నసాగర్’ అంటూ మొదలెట్టి... కనీసం పార్టీ కార్యాలయం గేటు కూడా దాటకుండానే నేతలంతా అరెస్ట్ కావడం ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారట! రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడే మార్గాలను పార్టీ నాయకత్వం తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు పనిలో పనిగా సలహాలిస్తున్నారట! -
మోదీ ప్రతినిధిగా కేసీఆర్
- భూ నిర్వాసితుల మహాధర్నాలో బృందా కారత్ - సొంత నియోజకవర్గ ప్రజలపై లాఠీచార్జీ చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌దే - వాస్తవాలు చూడాలని సూచన సాక్షి, హైదరాబాద్ : కేంద్ర భూసేకరణ చట్టం 2013 ద్వారా కాకుండా జీవో 123 వంటి నల్ల చట్టాన్ని తీసుకొచ్చి సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ప్రతినిధినని చాటుకున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. పార్లమెంట్లో భూసేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాల్లో విఫలమైన మోదీ... రాష్ట్రాల ద్వారా దొడ్డిదారిలో చేస్తున్న ఆ ప్రయత్నాలకు కేసీఆర్ చేదోడువాదోడుగా నిలుస్తున్నారన్నారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద ‘తెలంగాణ భూనిర్వాసితుల పోరాట కమిటీ’ నిర్వహించిన మహాధర్నాలో ఆమె ప్రసంగించారు. ‘రైతులు, నిర్వాసితులపై లాఠీచార్జీలకు పాల్పడుతూ... అప్రజాస్వామికంగా భూమిని లాక్కుంటూ బంగారు తెలంగాణను సాధించలేరు. తన సొంత నియోజకవర్గ పేదలు, రైతులపై లాఠీలు, తూటాలు ప్రయోగించి, కాళ్లు, చేతులు విరగ్గొంటించిన సీఎంగా దేశంలోనే ఎవరూ సాధించని ఘనత కేసీఆర్ దక్కించుకున్నారు’ అని బృందా కారత్ ఆరోపించారు. లాఠీచార్జ్జీకి కారకులైన డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేసి, బాధ్యులైన ఇతర పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన ప్రభుత్వ దృష్టి కోణాన్ని మార్చుకునేందుకు కళ్లజోడు మార్చుకోవాల న్నారు. తన నియోజకవర్గ ప్రజలు విరాళాలు వేసుకుని కొత్త కళ్లద్దాలు కొనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బిచ్చగాళ్లను చేస్తామంటే సహించం... ‘నాడు తెలంగాణ ఉద్యమంలో రోడ్లు దిగ్బం ధించి మంత్రి హరీశ్‌రావు వంటా వార్పు చేస్తే రైటు.. ఇప్పుడు భూనిర్వాసితులు రోడ్లపై బైఠాయిస్తే తప్పా’ అని జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నిం చారు. కేసీఆర్, హరీశ్‌రావు చట్ట, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. భూములపై నయానోభయానో సంతకాలు పెట్టించుకున్నం త మాత్రాన ప్రాజెక్టులు పూర్తికావని, ఇందులో అంతిమ విజయం ప్రజలదేనన్నారు. అణచి వేత చర్యలపై ప్రజలు, సంఘాలు, వివిధ పక్షాల ఐక్య ఉద్యమాల ద్వా రానే ప్రభుత్వానికి చెక్ పెట్టగలమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరి ట రైతులను బిచ్చగాళ్లను చేస్తామంటే సహిం చేది లేదన్నారు. కేసీఆర్‌కు కళ్లద్దాల కోసం విరాళం..! బృందాకారత్ ఇచ్చిన పిలుపు మేరకు భూని ర్వాసితులు కొందరు ఆందోళనకారులు కేసీఆర్ కు కళ్లద్దాలు కొనిచ్చేందుకు వంద నుంచి ఐదొందల రూపాయల వరకు విరాళాలు ఇచ్చా రు. ఈ మొత్తాన్ని సీఎంకు మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తామని భూనిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ బి.వెంకట్ తెలిపారు. ధర్నాలో పోటు రంగారావు (న్యూ డెమోక్రసీ), విమలక్క, పి.శంకర్ (డీబీఎఫ్), ప్రొ.పీఎల్వీ (ఆప్), రాజ య్య, జూలకంటి (సీపీఎం) పాల్గొన్నారు. భూములివ్వం... ఊళ్లో నుంచి పోం... మాకు ఎలాంటి రిజర్వాయర్ (పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు) అవసరంలేదు. ప్రాజెక్టులకు భూములివ్వం. ఊళ్లో నుంచి ఎక్కడికీ వెళ్లం. మా ఊరు ఉండాలి.. మా భూమి మాకే ఉండాలి. ఇప్పుడిప్పుడే వేసిన పంట చేతికొచ్చి అన్నం తినే సమయం వచ్చింది. రైతుల నోట్లో మట్టిపోసి ఆయన (సీఎం) బంగారం తింటారా? జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి ఇప్పుడు రిజర్వాయర్ల మంత్రి అయ్యారు. భూములు తీసుకుని కేసీఆర్ ఏమైనా రూపాయలు, బంగారంపై నిద్రపోతారా? - కె.మణెమ్మ, మహబూబ్‌నగర్ జిల్లా ఉద్దండపూర్ సర్పంచ్ కేంద్ర చట్టం అమలుకు పోరు.. ముచ్చర్ల ఫార్మాసిటీని 400 ఫార్మా కంపెనీల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఏ అవసరం కోసం భూమిని తీసుకుంటున్నారో స్పష్టంగా చెప్పడంలేదు. వాటర్‌గ్రిడ్ పేరుతో సంతకాలు పెట్టిస్తున్నారు. భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం లాక్కుంటుందని బెదిరిస్తున్నారు. అక్రమ భూసేకరణను ప్రశ్నించినందుకు వందలాది మందిపై కేసులు పెట్టారు. కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాస ప్యాకేజీ కోసం గట్టిగా పోరాడతాం. - రాంచందర్, ముచ్చర్ల ఫార్మాసిటీ బాధితుడు