
సాక్షి, అమరావతి: రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకే ‘ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం–2018’ను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం లెక్కచేయడం లేదు. మరో అడుగు ముందుకేసి ‘ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం–2018’ నిబంధనల పేరుతో జీఓఎంఎస్ నంబరు 390 కింద సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులోని అంశాల పట్ల రెవెన్యూ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరికి, దగాకోరు విధానానికి ఈ జీవో ప్రత్యక్ష నిదర్శనమని చెబుతున్నారు. ‘కేంద్ర భూసేకరణ చట్టం–2013’ను రాష్ట్ర ప్రభుత్వం సవరించడమే కాకుండా, ఈ సవరణ 2014 జనవరి నుంచే వర్తిస్తుందంటూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమని అంటున్నారు.
సర్కారు నియంతృత్వానికి నిదర్శనం
‘‘సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయించడం అన్యాయం. పరస్పర ఆమోదం పేరుతో కన్సెంట్ అవార్డు ప్రకటించడం సరైంది కాదు. సరస్పర ఆమోదం అనే పదం కాగితాల్లో బాగానే ఉంటుంది. భూసమీకరణ కింద భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతులను రాజధాని అమరావతిలో, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వం ఎలా వేధించిందో అందరికీ తెలుసు. కన్సెంట్ అంటే భవిష్యత్తులో జరిగేది ఇదే. అందుకే ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018ని ఉపసంహరించుకోవాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పాత తేదీ నుంచి ఈ చట్టం వర్తిస్తుందంటూ జీవో ఇవ్వడం ఏమిటి’’ అంటూ రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.
‘కేంద్ర భూసేకరణ చట్టం–2013’ను సవరిస్తూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టరూపం దాల్చిన తర్వాత జీవో జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనికి విరుద్ధంగా ‘డీమ్డ్’ అంటూ 2014 జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇలా చేయడం సరికాదని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
సుప్రీంకోర్టుకు వెళతాం...
కేంద్ర భూసేకరణ చట్టం–2013కు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా... ప్రజల వ్యక్తిగత జీవనానికి, జీవనోపాధికి విఘాతం కలిగేలా ఉన్నాయని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. కేంద్ర చట్టానికి 12 సవరణలు చేసి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018లోని అంశాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయాలని పేర్కొంటున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పెద్ద ఎత్తున లేఖలు రాయాలని, వీటిని ఆధారంగా చూపుతూ తాము ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళతామని పలువురు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
తక్షణమే ఉపసంహరించుకోవాలి: సీపీఎం
కేంద్ర భూసేకరణ చట్టం–2013కు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. భూములు కోల్పోయే వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు నష్ట పరిహారాన్ని నిరాకరించేలా సవరణలు చేయడం దారుణమని మండిపడింది. ‘‘కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడం కోసమే చేసిన ఈ చట్ట సవరణలను సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సవరణ చట్టం 2014 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందంటూ జీవో ఇవ్వడం రైతుల భూములను బలవంతంగా గుంజుకోవడానికే. కేంద్ర చట్టంలో రైతులకు ఉన్న రక్షణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం సవరణల ద్వారా తొలగించింది. నిర్వాసితుల హక్కులను నిరంకుశంగా కాలరాసేందుకు పూనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా రైతులు, నిర్వాసితులు ఆందోళనలు చేపట్టాలి’’ అని సీపీఎం మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment