
సాక్షి, అమరావతి : భూ యజమానుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకునేందుకు మార్గం క్లియరైంది. విలువైన భూములను చౌకగా, బలవంతంగా లాక్కుని అస్మదీయులకు కట్టబెట్టి వాటాలు పంచుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు రూపొందించిన ఏపీ భూసేకరణ చట్ట సవరణ–2017కు ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఈ సవరణ వల్ల ఏపీలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, కొత్త రాష్ట్రమైన ఏపీకి ఇది ఏమాత్రం ఉపయుక్తం కానందున దీనిని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం పంపిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది.
కేంద్ర ప్రభుత్వం పంపిన మార్గదర్శకాలను కాలరాస్తూ మళ్లీ అవే సవరణలతో గత ఏడాది నవంబరులో అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం మళ్లీ కేంద్రానికి పంపింది. ఈ చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జరిగే నష్టాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతాధికారులను పంపించి.. రాష్ట్రంలో కొత్తగా 12 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తున్నామని, అందువల్ల ఈ భూసేకరణ చట్ట సవరణవల్ల ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదంటూ పదేపదే వివరించడం, పలుమార్లు లేఖలు రాయడం ద్వారా రాష్ట్రపతికి అనుకూల నివేదిక పంపించేలా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
2013 కేంద్ర చట్టానికి తూట్లు
ఇదిలా ఉంటే.. ఏపీ భూసేకరణ చట్టం–2017 సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ ( భూసేకరణ చట్టం)–2013కు తూట్లు పొడించినట్లయింది. ఇప్పటివరకూ ఏ ప్రాంతంలోనైనా పారిశ్రామికీకరణ ఇతర అవసరాల కోసం భూమిని సేకరించాలంటే ఆ ప్రాంతంలో 80 శాతం మంది ప్రజల ఆమోదం తప్పనిసరని కేంద్ర భూసేకరణ చట్టం–2013 స్పష్టంగా పేర్కొంది.
ఆమోదం లభించని పక్షంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టడానికి వీల్లేదు. దీనినే సామాజిక ప్రభావ అంచనా సర్వే తప్పనిసరి అని అంటారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ కింద భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటూ కోర్టుకెళ్లిన వారి గ్రామాల్లో ఈ సర్వే నిర్వహిస్తే 70 శాతం మందికి పైగా వ్యతిరేకిస్తారు. అందువల్ల ఇక్కడ భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యంకాదు. బహుళ పంటలు పండే ఈ భూములను ఎలాగైనా రాజధాని పేరుతో లాక్కోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి కేంద్ర భూసేకరణ చట్టం–2013కు సవరణలు తీసుకువచ్చింది.
సవరణలతో వచ్చే నష్టాలివీ..
ఏపీ భూసేకరణ చట్టం–2017వల్ల భూయజమానులకు వివిధ రకాలుగా నష్టం జరుగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టే ప్రాజెక్టులు, రహదారులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ అవసరాలకు ఇకపై సామాజిక ప్రభావ మదింపు అంచనా అవసరంలేదు. నచ్చిన పారిశ్రామికవేత్తలకు విలువైన భూములను సేకరించి ఇవ్వొచ్చు.
- ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే భూ యజమానులు ప్రేక్షకుల్లా మిగిలిపోవాల్సి వస్తుంది.
- కలెక్టరు, ఇతర అధికారులు సంప్రదింపుల ద్వారా నిర్ణయించిన ధరే ఇక ఫైనల్. దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశంలేదు. ఉదాహరణకు.. రాజధాని అమరావతి కోసం భూములు ఇవ్వడానికి తిరస్కరించిన గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఎకరా అధికారిక ధర రూ.కోటి వరకు (మార్కెట్ ధర రూ.రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా) ఉందనుకుందాం. 2013 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం దీనికి రెండున్నర రెట్లకు పైగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సవరించిన చట్ట ప్రకారమైతే సంప్రదింపుల్లో నిర్ణయించిన ధరను రైతులు తప్పకుండా అంగీకరించాల్సిందే. తక్కువ ధరకే భూములు ఇచ్చేందుకు అంగీకరించినట్లు రైతుల నుంచి బలవంతంగా సంతకాలు సేకరించి భూములు తీసుకోవచ్చు.