మోదీ ప్రతినిధిగా కేసీఆర్
- భూ నిర్వాసితుల మహాధర్నాలో బృందా కారత్
- సొంత నియోజకవర్గ ప్రజలపై లాఠీచార్జీ చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌దే
- వాస్తవాలు చూడాలని సూచన
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర భూసేకరణ చట్టం 2013 ద్వారా కాకుండా జీవో 123 వంటి నల్ల చట్టాన్ని తీసుకొచ్చి సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ప్రతినిధినని చాటుకున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. పార్లమెంట్‌లో భూసేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాల్లో విఫలమైన మోదీ... రాష్ట్రాల ద్వారా దొడ్డిదారిలో చేస్తున్న ఆ ప్రయత్నాలకు కేసీఆర్ చేదోడువాదోడుగా నిలుస్తున్నారన్నారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద ‘తెలంగాణ భూనిర్వాసితుల పోరాట కమిటీ’ నిర్వహించిన మహాధర్నాలో ఆమె ప్రసంగించారు.
‘రైతులు, నిర్వాసితులపై లాఠీచార్జీలకు పాల్పడుతూ... అప్రజాస్వామికంగా భూమిని లాక్కుంటూ బంగారు తెలంగాణను సాధించలేరు. తన సొంత నియోజకవర్గ పేదలు, రైతులపై లాఠీలు, తూటాలు ప్రయోగించి, కాళ్లు, చేతులు విరగ్గొంటించిన సీఎంగా దేశంలోనే ఎవరూ సాధించని ఘనత కేసీఆర్ దక్కించుకున్నారు’ అని బృందా కారత్ ఆరోపించారు. లాఠీచార్జ్జీకి కారకులైన డీఎస్‌పీని వెంటనే సస్పెండ్ చేసి, బాధ్యులైన ఇతర పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన ప్రభుత్వ దృష్టి కోణాన్ని మార్చుకునేందుకు కళ్లజోడు మార్చుకోవాల న్నారు. తన నియోజకవర్గ ప్రజలు విరాళాలు వేసుకుని కొత్త కళ్లద్దాలు కొనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
బిచ్చగాళ్లను చేస్తామంటే సహించం...
‘నాడు తెలంగాణ ఉద్యమంలో రోడ్లు దిగ్బం ధించి మంత్రి హరీశ్‌రావు వంటా వార్పు చేస్తే రైటు.. ఇప్పుడు భూనిర్వాసితులు రోడ్లపై బైఠాయిస్తే తప్పా’ అని జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నిం చారు. కేసీఆర్, హరీశ్‌రావు చట్ట, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. భూములపై నయానోభయానో సంతకాలు పెట్టించుకున్నం త మాత్రాన ప్రాజెక్టులు పూర్తికావని, ఇందులో అంతిమ విజయం ప్రజలదేనన్నారు. అణచి వేత చర్యలపై ప్రజలు, సంఘాలు, వివిధ పక్షాల ఐక్య ఉద్యమాల ద్వా రానే ప్రభుత్వానికి చెక్ పెట్టగలమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరి ట రైతులను బిచ్చగాళ్లను చేస్తామంటే సహిం చేది లేదన్నారు.
కేసీఆర్‌కు కళ్లద్దాల కోసం విరాళం..!
బృందాకారత్ ఇచ్చిన పిలుపు మేరకు భూని ర్వాసితులు కొందరు ఆందోళనకారులు కేసీఆర్ కు కళ్లద్దాలు కొనిచ్చేందుకు వంద నుంచి ఐదొందల రూపాయల వరకు విరాళాలు ఇచ్చా రు. ఈ మొత్తాన్ని సీఎంకు మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తామని భూనిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ బి.వెంకట్ తెలిపారు. ధర్నాలో పోటు రంగారావు (న్యూ డెమోక్రసీ), విమలక్క, పి.శంకర్ (డీబీఎఫ్), ప్రొ.పీఎల్‌వీ (ఆప్), రాజ య్య, జూలకంటి (సీపీఎం) పాల్గొన్నారు.
భూములివ్వం... ఊళ్లో నుంచి పోం...
మాకు ఎలాంటి రిజర్వాయర్ (పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు) అవసరంలేదు. ప్రాజెక్టులకు భూములివ్వం. ఊళ్లో నుంచి ఎక్కడికీ వెళ్లం. మా ఊరు ఉండాలి.. మా భూమి మాకే ఉండాలి. ఇప్పుడిప్పుడే వేసిన పంట చేతికొచ్చి అన్నం తినే సమయం వచ్చింది. రైతుల నోట్లో మట్టిపోసి ఆయన (సీఎం) బంగారం తింటారా? జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి ఇప్పుడు రిజర్వాయర్ల మంత్రి అయ్యారు. భూములు తీసుకుని కేసీఆర్ ఏమైనా రూపాయలు, బంగారంపై నిద్రపోతారా?
- కె.మణెమ్మ, మహబూబ్‌నగర్ జిల్లా ఉద్దండపూర్ సర్పంచ్
కేంద్ర చట్టం అమలుకు పోరు..
ముచ్చర్ల ఫార్మాసిటీని 400 ఫార్మా కంపెనీల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఏ అవసరం కోసం భూమిని తీసుకుంటున్నారో స్పష్టంగా చెప్పడంలేదు. వాటర్‌గ్రిడ్ పేరుతో సంతకాలు పెట్టిస్తున్నారు. భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం లాక్కుంటుందని బెదిరిస్తున్నారు. అక్రమ భూసేకరణను ప్రశ్నించినందుకు వందలాది మందిపై కేసులు పెట్టారు. కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాస ప్యాకేజీ కోసం గట్టిగా పోరాడతాం. - రాంచందర్, ముచ్చర్ల ఫార్మాసిటీ బాధితుడు