నుదుటిపై తొలిపొద్దు | special story to cpi(m) leader brinda karat | Sakshi
Sakshi News home page

నుదుటిపై తొలిపొద్దు

Published Sun, Apr 2 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

నుదుటిపై తొలిపొద్దు

నుదుటిపై తొలిపొద్దు

సీపీఐ (ఎమ్‌) లీడర్‌    బృందాకారత్‌
తలరాతను ఎవరూ మార్చలేరంటారు. కానీ.. అదే తలరాత మీద రూపాయి బిళ్లంత ఉదయించే సూర్యుడు కనబడితే... ప్రతిరోజూ... ఒక అందమైన తొలిపొద్దు అవుతుంది. తలరాతను సైతం మార్చే ఉద్యమ సిందూరం అవుతుంది. బృందాకారత్‌... రోజూ ఉదయించే ఒక ఉద్యమం!


ఎన్డీటీవీ వెబ్‌సైట్‌కి కనీసం నెలకొక ఆర్టికలైనా రాస్తుంటారు సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌. దేశంలోని పరిణామాల తీవ్రతను బట్టి ఒక్కో నెలలో రెండు ఆర్టికల్స్‌ కనిపిస్తుంటాయి. ఈ ఏడాది జనవరి నెలలో ఆమె బెంగళూరు అకృత్యాలపై హోమ్‌ మినిస్టర్‌ వైఖరిని విమర్శించారు. అదే నెలలో, ‘గిరిజన మహిళలపై అత్యాచారం అన్నది ఒక ఆయుధం అయినప్పుడు...’ అంటూ ఒక వ్యాసం రాసి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తర్వాత ఫిబ్రవరిలో... కేరళ నటిపై జరిగిన లైంగిక నేరం... సమాజాన్ని కలవరపరుస్తున్న ధోరణులకు ఒక ప్రతిబింబమని ఆవేదన చెందారు.

ఆర్టికల్స్‌ రాయడం కాకుండా, బృందాకారత్‌ నిర్వహించే సామాజిక బాధ్యతలు ఇంకా చాలానే ఉన్నాయి. రాజకీయంగా దేశంలోనే అత్యంత క్రియాశీలకంగా ఉండే కమ్యూనిస్టు కార్యకర్తల్లో బృందా ముఖ్యులు. మహిళా సమస్యలు దేశంలో ఎక్కడ తలెత్తినా మొదట నినదించే గొంతు, మొదట బిగుసుకునే పిడికిలి ఆమెదే! ఇరవై ఏళ్ల వయసు నుంచి పోరాట పథంలో ఉన్న ఈ 69 ఏళ్ల సీనియర్‌ నాయకురాలు ప్రస్తుతం... బెంగాల్‌ ప్రభుత్వ అరాచక కృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల టీచర్ల నియామకాలలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ మార్చి 9న విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరుపుతున్నప్పుడు వారిలోంచి పోలీసులు నలుగురు విద్యార్థినులను నిర్బంధంలోకి తీసుకుని ‘సెర్చింగ్‌ రూమ్‌’లో వారికి నరకం చూపించారు. బట్టలు తీయించారు. పీరియడ్స్‌లో ఉన్న ఒక యువతినైతే అండర్‌వేర్‌ కూడా తీయించి మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ దారుణంపై బృందాకారత్‌ ప్రస్తుతం ఉడికిపోతున్నారు. ఇదే విషయాన్ని ఈ నెల ఎన్డీటీవీ ఆర్టికల్‌ రాస్తూ, ఆరేళ్ల క్రితం ఆదివాసీ మహిళ సోని సోరిపై జరిగిన లైంగిక రాక్షసత్వానికి ఇది ఏమాత్రం తీసిపోని వికృతమైన అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బృందాకారత్‌ ‘ఐద్వా’ (ఆలిండియా డెమొక్రాటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌) ఉపాధ్యక్షురాలు. ‘సెర్చింగ్‌ రూమ్‌’ ఘటనపై గత కొన్ని రోజులుగా ఐద్వా నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు తీవ్రరూపం దాల్చితే కనుక ఆ ఉద్యమ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు బెంగాల్‌ ప్రభుత్వం ఏ క్షణాన్నైనా బృందాకారత్‌ను అరెస్టు చేయవచ్చు. సాహసోపేతమైన సామాజిక కార్యకర్త బృందాకారత్‌ గురించి కొన్ని వివరాలు, విశేషాలు.

చదువు... ఉద్యోగం... ఉద్యమం
బృంద 13 ఏళ్ల వరకు కలకత్తాలో చదువుకున్నారు. అక్కడి నుండి డెహ్రాడూన్‌లోని వెల్హమ్‌ వెళ్లిపోయారు. అక్కడి ‘వెల్హమ్‌ గర్ల్స్‌http://img.sakshi.net/images/cms/2017-04/51491153685_Unknown.jpg హైస్కూల్‌’లో చదువుకున్నారు. తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల ‘మిరాండ హౌస్‌’లో డిగ్రీలో చేరారు. 1967లో డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత లండన్‌లోని ఎయిర్‌ ఇండియా శాఖలో నాలుగేళ్లు పనిచేశారు. అక్కడ తప్పనిసరిగా స్కర్ట్‌లు ధరించాలి. చీర కట్టుకోడానికి లేదు. స్కర్ట్‌ ను ధరించాలన్న ఆ నిబంధనకు వ్యతిరేకంగా బృంద ఉద్యమించారు. దాంతో ఎయిర్‌ ఇండియా దిగివచ్చింది. నిబంధనను సడలించింది. స్కర్ట్‌ అయినా, చీర అయినా చాయిస్‌ మహిళా సిబ్బందిదే అని ప్రకటించింది! బృంద లండన్‌లో పనిచేస్తున్నపుడు వియత్నాం యుద్ధం జరుగుతోంది.

ఆ యుద్ధ పర్యవసానాలు బృందను సామ్రాజ్యవాద వ్యతిరేకిగా, అంతకన్నా కూడా యుద్ధ వ్యతిరేకిగా మార్చాయి. లండన్‌లోని అనేక యుద్ధవ్యతిరేక ప్రదర్శనల్లో కూడా ఆమె పాల్గొన్నారు. 1971లో ఇండియా తిరిగొచ్చి, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.హిస్టరీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా క్యాంపస్‌లోను, బంగ్లాదేశ్‌ యుద్ధ శరణార్థుల శిబిరాలలోనూ పనిచేశారు. అప్పుడే పార్టీ పత్రికలో కొన్ని వ్యాసాలు రాశారు. తర్వాత పూర్తికాల కార్యకర్తగా బాధ్యతలు స్వీకరించారు.

రాజకీయాలు
http://img.sakshi.net/images/cms/2017-04/71491153773_Unknown.jpgకార్మిక సంఘాలలో పని చేయడం కోసం 1975లో ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో సీపీఐ(ఎం)కి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య. ఆయనే బృందకు ఢిల్లీ శాఖలో సభ్యత్వం ఇచ్చారు. అదే ఏడాది నవంబర్‌ ఏడున ఆమె పార్టీ కామ్రేడ్‌ ప్రకాశ్‌ కారత్‌ని పెళ్లి చేసుకున్నారు.
ఢిల్లీలో జౌళిమిల్లు కార్మికుల తరఫున ఢిల్లీ కార్మిక సంఘాల సమన్వయకర్తగా పనిచేశారు. మహిళా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1980లలో అత్యాచార వ్యతిరేక చట్ట రూపకల్పన జరుగుతున్న క్రమంలో బృందా కారత్‌కు ప్రముఖంగా గుర్తింపు వచ్చింది. అనంతరం సీపీఐ(ఎం) మహిళా విభాగం అయిన ‘ఐద్వా’లో పూర్తి స్థాయి దీర్ఘకాలిక కార్యకర్తగా కొనసాగారు.
2005లో పశ్చిమబెంగాల్‌ నుంచి పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలయ్యారు. అదే ఏడాది పార్టీ పొలిట్‌బ్యూరో తొలి మహిళా సభ్యురాలయ్యారు.
పొలిట్‌బ్యూరోలో సభ్యత్వాన్ని బృంద పోరాడి సాధించుకున్నారనే చెప్పాలి. అయితే తన సభ్యత్వం కోసం ఆమె పోరాడలేదు. పొలిట్‌బ్యూరోలో అసలు మహిళల ప్రాతినిధ్యమే లేకపోవడాన్ని తప్పుపట్టారు. అందుకు ఆగ్రహించిన కేంద్ర కమిటీ ఆమెను తొలగించింది. అయితే అలా తొలగించడం లెనినిస్టు సిద్ధాంతాలకు విరుద్ధం అని గ్రహించి పునర్నియమించుకుంది. ఆ తర్వాతి పరిణామమే పొలిట్‌బ్యూరోలోకి మహిళల ప్రవేశం.

అమ్మానాన్న!
బృందాకారత్‌కు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి అశ్రుకణ చనిపోయారు. అశ్రుకణ అంటే అర్థం తెలిసిందే. కన్నీటి బిందువు. ఎన్నో కన్నీళ్ల నిరీక్షణ తర్వాత పుట్టిందని ఆమెకు ఆ పేరు పెట్టారు. అశ్రుకణ విప్లవవాది! ఆ కాలంలో ఆడవాళ్లకు ఎన్నో లక్ష్మణరేఖలు ఉండేవి. వాటిని దాటి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. ఒకేఒక ఆడకూతురు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఆమెకు అడ్డుచెప్పలేదు. చదువుకున్నంతా చదివించారు. బృంద తండ్రి సూరజ్‌ లాల్‌. లాహోర్‌ ఆయన పుట్టినిల్లు. ఉద్యోగం వెతుక్కుంటూ కలకత్తా వచ్చారు. మొదట పోర్ట్‌ కమిషనర్‌ ఆఫీసులో ఉద్యోగం సంపాదించారు. తర్వాత కాలగమనంలో పెద్దపెద్ద కంపెనీలకు డైరెక్టర్‌ అయ్యారు.

ఉద్యమ సిందూరం
బీజేపీకి, కమ్యూనిస్టులకు పడదు. మరి బొట్టుకు, బృందాకారత్‌కు ఎలా పడింది! ఏ కాలం నాటిదీ ప్రశ్న?! అయినా సరే, ఇప్పటికీ బృందను అడుగుతుంటారు. ‘మీరేమో ఉద్యమ వనిత. మీ నుదుటిపై మాత్రం సంప్రదాయ సిందూరం. ఏమిటీ వైరుధ్యం?’ అని. ఈ మాటకు నవ్వుతారామె. సిందూరం వ్యక్తిగతం. ఉద్యమం సామాజికం అనే అర్థం ఆ నవ్వులో కనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 17కు ఆమెకు 70 ఏళ్లు నిండుతాయి. కానీ ఆమె చలాకీదనం ఆమె వయసును ఏళ్లుగా ధిక్కరిస్తూ వస్తోంది. నిరంతరం ఆమె ప్రజా ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉండడమే ఆమె అందం, ఆరోగ్య రహస్యం కావచ్చు. అయినా అవిశ్రాంతంగా శ్రమిస్తుండే ఒక సామాజిక కార్యకర్త అందచందాల గురించి అదొక ముఖ్యాంశంగా మాట్లాడుకోవడం సరికాదేమో! కార్మిక సంఘాల నాయకురాలిగా సీపీఐ(ఎం)లోకి వచ్చిన ఈ వామపక్ష యోధురాలు గత ముప్పై ఏళ్లుగా నిరుపేదలు, దళితులు, మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.

సర్వకాల సర్వైవల్‌
మహిళా సమస్యలు, మహిళా ఉద్యమాలపై 2005 ఏప్రిల్‌లో బృందాకారత్‌ ఈ పుస్తకం రాశారు. బృంద స్వీయానుభవాలు, సునిశిత పరిశీలనల కలబోతే ‘సర్వైవల్‌ అండ్‌ ఇమాన్సిపేషన్‌’. సుప్రసిద్ధ మార్క్సిస్టు సిద్ధాంతి, రాజకీయ వ్యాఖ్యాత అయిన ఐజీజ్‌ అహ్మద్‌ మాటల్లో చెప్పాలంటే... ‘ఇది అరుదైన పుస్తకం. సమాచారం ఇస్తుంది. సూచనలిస్తుంది. స్ఫూర్తినిస్తుంది’. మల్టిపుల్‌ స్ట్రగుల్స్, గ్లోబలైజేషన్స్‌ అండ్‌ సర్వైవల్‌ ఇష్యూస్, ఆన్‌ పొలిటికల్‌ పార్టిసిపేషన్, కమ్యూనలిజం అండ్‌ ఉమెన్, వయలెన్స్‌ అగైన్‌స్ట్‌ ఉమెన్, ఎ పర్సనల్‌ రిమెంబరింగ్‌ అనే ఆరు అధ్యాయాలలో ‘స్త్రీల మనుగడ, దాస్యవిముక్తి’ అంశాలను పొందుపరిచారు.

వివాదాలు
http://img.sakshi.net/images/cms/2017-04/51491154106_Unknown.jpgయోగా గురు బాబా రామ్‌దేవ్‌... కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఆయన ఉత్పత్తి చేస్తున్న పదార్థాలలో మానవ ఎముకలను మిళితం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని బృందాకారత్‌ ప్రస్తావించడం వివాదాస్పదం అయింది. శరద్‌పవార్, ములాయంసింగ్‌ యాదవ్, అంబికా సోని, నారాయణ్‌ దత్‌ తివారీ వంటి రాజకీయ నాయకులు ఈ విషయమై బృందా కారత్‌పై తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా బృందను తప్పుపట్టారు. భారతీయ జనతాపార్టీ ఫరీదాబాద్‌ నాయకుడొకరు ఏకంగా ఆమెకు లీగల్‌ నోటీసే పంపారు!

అశ్రుకణ పెళ్లి పెద్ద సీన్‌ అయింది
బృంద తల్లి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమె పెళ్లి నాటికే బృంద అమ్మమ్మ చనిపోయారు. ఆమె తాతయ్యకో పెద్దన్నయ్య ఉన్నాడు. ఆ పెద్దన్నయ్య వాళ్లది కోల్‌కతాలో పెద్ద పేరున్న కుటుంబం. ఆయనకు బృంద తల్లి కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. ఆ పెళ్లికి ఎవరూ వెళ్లడానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. దాంతో బృంద... అమ్మగారి వివాహం సుబోద్‌ మాలిక్‌ అనే స్వాతంత్య్ర సమరయోధుడి సహాయంతో జరిగింది. సుబోద్‌ ఇంటికి శ్రీ అరబిందో, రవీంద్రనాథ్‌ టాగోర్‌ వంటి జాతీయ నాయకులు వచ్చి వెళుతుండేవారు. దాంతో ఇంకెవరూ మాట్లాడేందుకు లేకుండాపోయింది. ఆ సమరయోధుడు బృంద తల్లికి బంధువు కూడా. బృందకు ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి. అన్న, అక్క చనిపోయారు. చెల్లి రాధికారాయ్‌ ఎన్డీటీవీ అధినేత ప్రణయ్‌రాయ్‌ భార్య. బృంద సహా పిల్లలంతా తల్లి భావాలకు అనుగుణంగా స్వేచ్ఛగా లౌకికవాదులుగా పెరిగారు.

ప్రశ్న – జవాబు
మార్క్స్‌–జ్యోతిబసు

ఏ వయసులో మీరు కమ్యూనిస్టు అయ్యారు?    http://img.sakshi.net/images/cms/2017-04/51491153963_Unknown.jpg
21–23 మధ్య.

అంటే 1960ల చివర్లలో. భారతీయ విద్యార్థులు నక్సలైట్‌ ఉద్యమంలోకి ఉరుకుతున్న సమయం కదా అది! మీరెందుకని కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చారు?
అప్పటికే మార్క్స్‌ నా మైండ్‌లో ఉన్నాడు. కళ్లెదుట జ్యోతిబసు ఉన్నారు. సీపీఐ(ఎం)లో చేరిపోయాను.

క్రియాశీల కమ్యూనిస్టు రాజకీయాల్లోకన్నా, కార్మిక సంఘాల కార్యాచరణల్లోనే ఎక్కువగా కనిపించారు?
నేనొక కమ్యూనిస్టు కార్యకర్తను... అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ. అత్యంత అప్రజాస్వామికమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటమే నేను ఎంచుకున్న లక్ష్యం.  

భారతదేశంలో కమ్యూనిజం విఫలమైనట్లు కనిపిస్తోంది. ఒక కార్యకర్తగా మిమ్మల్ని ఏనాడూ నిరాశ ఆవరించలేదా?
నిలబడిపోవడం నిరాశ. నినదిస్తూ సాగిపోవడం కమ్యూనిజం. మేమెక్కడా నిలబడిపోలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement