భూసేకరణ ‘చట్ట సవరణ’కు బ్రేక్‌! | Break to the Land Acquisition Act Amendment | Sakshi
Sakshi News home page

భూసేకరణ ‘చట్ట సవరణ’కు బ్రేక్‌!

Published Sun, Mar 19 2017 2:17 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

భూసేకరణ ‘చట్ట సవరణ’కు బ్రేక్‌! - Sakshi

భూసేకరణ ‘చట్ట సవరణ’కు బ్రేక్‌!

చట్టంలో సామాజిక ప్రభావ మదింపు తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వం
ఆర్డినెన్సు జారీకి అనుమతివ్వని రాష్ట్రపతి
ఈ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం లేదంటున్న అధికారులు
సర్కారు ఎత్తులు పారవంటున్న న్యాయ నిపుణులు


సాక్షి, అమరావతి: కేంద్ర భూసేకరణ చట్టం–2013కు సవరణల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చట్ట సవరణ/ఆర్డినెన్సుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కేంద్ర భూసేకరణ చట్టంలోని అత్యంత ముఖ్యమైన సామాజిక ప్రభావ మదింపునకు తూట్లు పొడవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశం కనిపించడం లేదు. భూసేకరణవల్ల పర్యావరణ పరంగా, నిర్వాసితులకు సామాజికంగా, ఉపాధిపరంగా, ఆర్థికంగా కలిగే నష్టాలపై సామాజిక ప్రభావ మదింపు జరపాలన్న ఈ చట్టంలోని ప్రధాన నిబంధనను తొలగించాలని ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు ఆరంభించింది.

ఇందులో భాగంగానే సామాజిక ప్రభావ మదింపు నిబంధనను కేంద్ర భూసేకరణ చట్టం–13 నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్సు జారీ చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, హోంశాఖ ద్వారా వెళ్లిన ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించకుండా పక్కన పెట్టేశారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ ద్వారా ఆమోదించిన ఈ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై న్యాయ నిపుణులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.

ఇప్పటికి బ్రేక్‌ పడ్డట్లే...
ప్రస్తుతానికి కేంద్ర భూసేకరణ చట్టం–13 సవరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడ్డట్లేనని అధికారులు అంటున్నారు. ఈ చట్టం మూల లక్ష్యమైన సామాజిక ప్రభావ మదింపునకు తూట్లు పొడుస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించి కేంద్రానికి పంపడాన్నే నిపుణులు తప్పుబడుతున్నారు. ‘ఈ చట్ట సవరణకు ఆర్డినెన్సు అనే పేరు ఉచ్చరించాలంటేనే జుగుప్సాకరంగా ఉందని నేను గతంలో వ్యాఖ్యానించాను. న్యాయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉన్నారు’ అని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అన్నారు. ‘ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టే అవకాశం లేదు.

ఆర్డినెన్సు జారీకి కూడా రాష్ట్రపతి నుంచి ఆమోదం రాదు. దీంతో  2013 భూసేకరణ చట్ట సవరణ ప్రతిపాదన తాత్కాలికంగా ఆగిపోయినట్లే’ అని మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ‘సాక్షి’తో చెప్పారు.  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం త్వరలో ముగుస్తున్నందువల్ల ఆయన ఈ వివాదాం శాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరని కేంద్ర న్యాయ శాఖకు చెందిన అధికారి రాష్ట్ర అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మౌలిక సదుపాయాల కల్పన ముసుగులో పేదల భూములను బలవంతంగా లాక్కునేందుకే సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని ఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర సర్కారు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తోందని, అవసరమైతే న్యాయ స్థానం ద్వారానైనా దీనిని అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement