హోదాతోనే న్యాయం | YS Jagan to meet President Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

హోదాతోనే న్యాయం

Published Tue, Aug 9 2016 2:11 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదాతోనే న్యాయం - Sakshi

హోదాతోనే న్యాయం

రాజ్యాంగ పెద్దగా జోక్యం చేసుకుని  ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని రాష్ట్రపతిని కోరాం
ప్రణబ్‌ను కలిసిన అనంతరం మీడియాతో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
* పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలు అమలుకాలేదు
* పౌరుడిగా సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది
* జీఎస్టీతో రాష్ట్రాల్లో సేల్స్‌టాక్స్ రాయితీలు ఇచ్చే పరిస్థితి ఉండదు
* ప్రత్యేక హోదా ఇప్పుడు మరింత అవసరం
* మన హక్కును అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు
* మద్దతు ఉపసంహరించుకుంటామనే సాహసం చేయరు
* ముఖ్యమంత్రే మాట మారుస్తుంటే కేంద్రం ఎలా ఇస్తుంది?
* హోదా ఇవ్వకపోవడం మోదీ తప్పు.. పోరాడకపోవడం చంద్రబాబు తప్పు
* హోదా సాధించలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు


సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని, రాజ్యాంగ పెద్దగా జోక్యం చేసుకుని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని, న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సాయంత్రం 6.45కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన అనంతరం రాష్ట్రపతి భవన్ ఆవరణలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, బుట్టా రేణుక, పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘ప్రత్యేక హోదా అంశంలో జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చాం. హోదాపై జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడానికే ఆయనను కలవడంలో ఏకైక ఉద్దేశం. ‘ఇక్కడికి వచ్చింది ప్రత్యేక హోదా కోసం కాదు పుష్కరాలకు పిలవడానికే మేం వచ్చాం’ అని చెప్పే దుస్థితి మాకు లేదు. హోదా విషయంలో ఏపీకి  జరుగుతున్న అన్యాయాన్ని రాజ్యాంగ పెద్దగా ఉన్న మీరు కూడా ఆపలేకపోతే ఇక ఎవరి దగ్గరకు పోవాలని అడిగాం’’ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించక తప్పడం లేదని చెప్పి.. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారని గుర్తుచేశారు. ‘‘హైదరాబాద్‌ను ఏపీ కోల్పోయి ఇబ్బందిపడుతుంది కాబట్టి నష్టపరిహారంగా ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.

పార్లమెంటు సాక్షిగా అధికార ప్రతిపక్షాలు ఇచ్చిన  హామీలు అమలు కానప్పడు ఎవరి దగ్గరకు పోవాలి? ఎవరిని నమ్మాలి? ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఎలా ఉంటుంది?’’ అని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలు అమలుకానప్పుడు ఒక దేశపౌరుడిగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే...
 
జీఎస్టీతో సేల్స్ ట్యాక్స్ కూడా కేంద్రం పరిధిలోకి పోతుంది..
జీఎస్టీ బిల్లు వల్ల దేశానికి మంచి జరుగుతుంది. అయితే దీనివల్ల రాష్ట్రానికి ఒక అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చేది. కానీ ఇప్పుడు జీఎస్టీ మూలంగా దేశవ్యాప్తంగా ఒకే పన్ను రానుండడంతో.. సేల్స్ ట్యాక్స్ పరిధి కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతుంది. దీంతో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మరింత తగ్గిపోనుంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరింత అవసరం. ఎందుకంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది.

రాష్ట్రం ఇంత దారుణంగా నష్టపోయే పరిస్థితి నెలకొంటే చంద్రబాబుకు ఉలుకూలేదు పలుకూలేదు. ఉద్యోగాలు దొరికే పరిస్థితిలేక ప్రజలు వలసలు పోతారు అన్న విషయం తెలిసికూడా.. మనకు రావాల్సిన హక్కును డిమాండ్ చేయలేని పరిస్థితి. మాకు రావాల్సిన హక్కును ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మా మంత్రులను ఉపసంహరించుకుంటామని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు.
 
ఇక్కడ తిడతారు.. అక్కడ పొగుడుతారు..
చంద్రబాబు ఒకవైపు వెంకయ్యనాయుడిని తీసుకొస్తారు, ఆయనకు సన్మానాలు చేస్తారు. బీజేపీ ప్రభుత్వం చాలా మేలు చేస్తోందని చెబుతారు. ఇదే చంద్రబాబు ఇతర సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పి ఏడుస్తారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఒక సంజీవని. అది లేనిదే రాష్ట్రాలు బాగుపడ వు, కాబట్టి ఐదేళ్లు సరిపోదు, 15 హోదా కావాలని గట్టిగా అడుగుతారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అని ప్రశ్నిస్తారు. నిజానికి ఒక మనిషి ఇంత దారుణంగా మాట మారుస్తుంటే.. హోదా ఇవ్వాల్సిన వారికి మాత్రం ఎందుకు సీరియస్‌నెస్ ఉంటుంది? ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల.. మేం ప్రత్యేక హోదా ఇవ్వబోం అని కేంద్ర ప్రభుత్వం ఏకంగా పార్లమెంటులో చెప్పినా వారిని గట్టిగా నిలదీసి అడగలేదు.

హోదా ఇవ్వకున్నా ఫర్వాలేదు. మేం మాత్రం మద్దతు ఉపసంహరించుకోం అని కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తే ఇక ప్రత్యేక హోదా ఎలా సాధ్యమవుతుందని అడుగుతున్నా. జీఎస్టీ బిల్లు ఆమోదం సమయంలో కూడా టీడీపీల ఎంపీలు హోదా అంశం గురించి ప్రస్తావించారు. నిజంగా ఇంత డబుల్ స్టాండ్, ఇన్ని మోసాలు చేసే పరిస్థితి కనిపిస్తుంటే... వీళ్లను చూసి నిజంగా వీళ్లదొక పార్టీనా?  వీళ్లకు పరిపాలించే నైతిక విలువలు ఉన్నాయా? అని అడుగుతున్నా.
 
ప్రధానికి తెలుస్తుందని భయం
ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ చంద్రబాబు ఎక్కడా ఇంగ్లీష్‌లో
 మాట్లాడరు.. ఎందుకంటే మోదీని గట్టి అడిగితే సీబీఐ కేసులు పడతాయి. పుష్కరాల పేరిట ఢిల్లీ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టకుండా తిరిగెళ్లిపోయారు. ఇక్కడ మాట్లాడితే ఎక్కడ మోదీకి తెలిసిపోతుందేమోనని భయం. చంద్రబాబు చాలా బాగా పనిచేస్తున్నారు... ఆయనలా పనిచేస్తే దేశం ఎక్కడికో వెళ్లిపోతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన ట్టు మొన్న ఒక పేపర్లో చదివా. రాష్ట్రపతిని కలవడానికి వెళ్లినప్పుడు.. బృందంలోని ప్రతినిధులు మినహా అక్కడ ఎవరూ ఉండరు. ఒక ఫొటోగ్రాఫర్ మధ్యలో వచ్చి ఫొటో తీసుకొని వెళ్లిపోతాడు. కానీ ప్రణబ్ మాట్లాడేటప్పుడు దగ్గరుండి విన్నట్టు, చంద్రబాబు బాగా పనిచేస్తున్నారని చెప్పినట్టు నిస్సిగ్గుగా రాయించుకుంటున్నారు.
 
అందరినీ కలుస్తాం..
ప్రత్యేక హోదా అన్న అంశంపై మోదీ అన్న మాటలు ప్లే చేసి రాష్ట్రపతికి వినిపించాం. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం మోదీ తప్పు... పోరాటం చేయకపోవడం చంద్రబాబు తప్పు. దీనిపై పోరాటం చేసే దిశగా కలవాల్సిన పార్టీలను అన్నింటినీ కలుస్తాం. రేపు కమ్యూనిస్టు నేతలను కలుస్తాం... వాళ్ల మద్దతు తీసుకుంటాం. రాష్ట్రంలో కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కూడా కోరుతాం... అమిత్ షాను కూడా కలుస్తాం. హోదా సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. రాష్ట్రం నష్టపోతుంది.. మీరూ నష్టపోతారు... రాష్ట్రానికి అన్యాయం చేసినవారవుతారని గట్టిగా చెబుతాం. పునరాలోచించుకోవాలని చెబుతాం. కలిస్తే ప్రత్యేక హోదా కావాలనే అడుగుతాం. కానీ వాళ్ల మెప్పు సంపాదించేందుకు పుష్కరాల కోసమే వచ్చామని చెప్పం.
 
వచ్చేదాకా పోరాటం చేయాలి..

హోదా మన హక్కు. విభజన వేళ హోదా ఇస్తామని విడగొట్టారు. ఇప్పుడు ఆ హక్కును మేం వదిలేస్తే మళ్లీ అడిగేవారుండరు. ఇవాళ కాకపోతే రేపైనా హోదావస్తుంది. రేపయినా హోదా ఇచ్చే వాళ్లకే మద్దతు ఇస్తామని గట్టి నినాదంతోనే ముందుకెళతాం. పోరాటం నీరుకారితే మాత్రం దొరకదు. అందరూ ఒకటి కావాలి. అందరం కలసి ఒక్కటైతేనే ప్రత్యేకహోదా సాధించగలుగుతాం.. వచ్చేదాకా పోరాటం చేద్దాం. మీ అందరి మద్దతు కావాలి.
 
23 సార్లు ఎందుకొచ్చావు.. ఎందుకెళ్లావు..
చంద్రబాబు తాను ఢిల్లీకి 23వసారి వచ్చానని చెప్పి ఊదరగొడతారు. 23 సార్లు ఎందుకొచ్చావ్? ఎందుకెళ్లావ్? అంటే... హోదా కోసం రాలేదు అని నిస్సిగ్గుగా బహిరంగంగా చెబుతారు. జెట్లీ మీద రక్తం మరుగుతోందని రాష్ట్రంలో చెబుతారు. ఇక్కడికి వచ్చాక ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు శాలువా కప్పుతారు. విజయవాడలో గుళ్లను కూలగొట్టేసి... పుష్కరాలకు ఆహ్వానించడానికే ఢిల్లీకి వచ్చానని నిస్సిగ్గుగా చెబుతారు. దేవుడి విషయంలో అవినీతి చేస్తే దేవుడు శిక్షిస్తాడని అందరూ భయపడుతారు.. కానీ చంద్రబాబుకు ఆ భయమూ లేదు. రూ. వెయ్యి కోట్లు విలువచేసే అమరేశ్వరుడి 22 ఎకరాల సదావర్తి భూములను రూ. 22 కోట్లకే తన బినామీలకు కట్టబెట్టారు.
 
రెండు సార్లు తీర్మానం చేయించారు.. ఏం సాధించారు
ప్రత్యేక హోదా సాధన కోసం అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేయించారు. మొదటిసారి తీర్మానం చేయించారు కదా ఏమైందని రెండో తీర్మానం సమయంలో నేను ప్రశ్నిస్తే సమాధానం లేదు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమంటే.. అందుకు ప్రయత్నించడు. ఆయన చేయడు.. చేసే వాళ్లను చేయనివ్వడు. హోదా రాకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు రాక, పిల్లలకు ఉద్యోగాలు లేకుంటే భవిష్యతు అంధకారం అవుతుందన్న ఆవేదనతో అందరినీ కలిసి వినతిపత్రాలు సమర్పిస్తుంటే మా మీదే అభాండాలు వేస్తారు. చంద్రబాబూ... ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించుకోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్... ప్రజలే బుద్ధి చెబుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement