రాష్ట్రపతితో వైఎస్ జగన్ సమావేశం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సోమవారం సాయంత్రం పార్టీ ఎంపీలతో కలసి వైఎస్ జగన్.. రాష్ట్రపతి భవన్లో ప్రణబ్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇటీవల కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో వైఎస్ జగన్ రాష్ట్ర విషయాలను రాష్ట్రపతికి వివరించారు.
ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుకు మద్దతు ఇస్తున్న జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టగా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే.