ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నందున.. ఈ సమస్య నుంచి గట్కెక్కించేందుకు పరిష్కార మార్గం చూపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. ప్రజలను సంతృప్తిపరిచే మార్గం చూడాలని విన్నవించారు. కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించేందుకు గురువారం సీఎం ఢిల్లీకి వచ్చారు. తొలుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్‌ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను రాష్ట్రపతి దృష్టికి తెస్తూ కృష్ణా పుష్కరాల ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెహర్‌ను ఆహ్వానించారు. ఉభయ రాష్ట్రాల్లో న్యాయాధికారుల కేటాయింపు అంశం, హైకోర్టు విభజన అంశాలు ఈ సందర్భంగా చర్చ కు వచ్చినట్టు సమాచారం. రాత్రి తొమ్మిది గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆయన నివాసంలో కలిశారు. ఇప్పటివరకు చెబుతూ వస్తున్న సాకులు ప్రజలను ఒప్పించలేకపోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం సన్నగిల్లేలా చేశాయని చంద్రబాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తానూ కలిసి ఒక తుది నిర్ణయానికి వచ్చామని, ప్రధాని నిర్ణయం మేరకు నడుచుకుంటామని జైట్లీ చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రధాన మంత్రితో నేడు భేటీ: ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు శుక్రవారం పార్లమెంటులో 11 గంటల సమయంలో భేటీ కానున్నారు. కృష్ణా పుష్కరాలకు ఆహ్వాన పత్రిక అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై చర్చించనున్నారు. పలు డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని ఇవ్వనున్నారని ఏపీభవన్ అధికార వర్గాలు తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్, సభాపతి సుమిత్రా మహాజన్‌ను కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. టీడీపీ ఎంపీలకు శుక్రవారం మధ్యాహ్నం 12.20కి ప్రధాని అపాయింట్‌మెంట్ లభించిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.